వైసీపీకి కూటమి కఠిన సందేశం

పొత్తులు చిత్తు అవుతాయని కూటమి విడిపోతుందని వైసీపీ ఇంతకాలం అనుకుంటే అనుకుని ఉండవచ్చు. కానీ ఇపుడు అవన్నీ భ్రమలు అన్న సంగతి అయితే తేలిపోయింది.;

Update: 2025-10-18 06:30 GMT

ఎత్తులు పొత్తులు అన్నీ ఎన్నికల ముందే ఉంటాయి. తీరా అధికారమలోకి వస్తే చాలు అవన్నీ పటాపంచలు అవుతాయి. అధికారం కోసం కుమ్ములాటలు స్టార్ట్ అవుతాయి. పదవుల దగ్గర వచ్చే పేచీలతో ఎంతటి బంధాలు అయినా పేక మేడలుగా కుప్పకూలుతాయి. అయితే ఏపీలో మాత్రం మూడు పార్టీలు కలసి అధికారం పంచుకున్నాయి. ఇప్పటికి పదహారు నెలలు అయింది కానీ ఎలాంటి పేచీ పూచీ లేకుండా ముందుకు సాగుతున్నాయి. కూటమికి ఏపీలో పెద్దన్నగా టీడీపీ ఉంది. చంద్రబాబు అనుభవం కలిగిన నాయకుడు. దాంతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే నేతగా ఉన్నారు. ఇక కేంద్రంలో నరేంద్ర మోడీ కూడా ఏపీలో కూటమి పది కాలాల పాటు సాగేలా కోరుకుంటున్నారు.

కర్నూల్ తో సీన్ ఓపెన్ :

కర్నూల్ గడ్డ మీద జరిగిన కూటమి భారీ బహిరంగ సభ చూసిన వారికి ఒక్కటి బాగా అర్ధం అయింది. ఈ బంధం ఎన్నాళ్ళో కాదు ఏకంగా పదిహేనేళ్ళు పై మాటే అని. ఎందుకంటే మూడు పార్టీలదీ ఒక్కటే మాట. ఒక్కటే బాట నరేంద్ర మోడీని కర్మ యోగిగా ఈ సభలో పవన్ కళ్యాణ్ అభివర్ణిస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లను మోడీ విజనరీ లీడర్స్ అని కొనియాడారు. ఇక పవన్ అయితే చాలా ఓపెన్ గా చెప్పేశారు. పదిహేనేళ్ళ పాటు ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని. ఒక విధంగా కుండబద్దలు కొట్టేసారు. దానికి ప్రధాని మోడీ కూడా తన ప్రసంగం ద్వారా చెప్పకనే చెప్పారు, ఆమోదముద్ర వేసేశారు.

రాజకీయ అనివార్యత :

పొత్తులు చిత్తు అవుతాయని కూటమి విడిపోతుందని వైసీపీ ఇంతకాలం అనుకుంటే అనుకుని ఉండవచ్చు. కానీ ఇపుడు అవన్నీ భ్రమలు అన్న సంగతి అయితే తేలిపోయింది. ఈ మూడు పార్టీల పొత్తు వెనక రాష్ట్ర దేశ అభివృద్ధితో పాటు రాజకీయ వ్యూహాలు కూడా ఉన్నాయి అని అంటున్నారు. కేంద్రంలో 2029లో మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి ఈసారి 2024లో వచ్చిన సీట్లు కూడా వస్తాయో రావో తెలియదు, దాంతో మిత్రుల మీద మరింత ఎక్కువగా ఆధారపడే పరిస్థితి 2029 ఎన్నికల్లో రావచ్చు. పైగా బాబు సీనియర్ మోస్ట్ లీడర్, జాతీయ స్థాయిలో ఎంతో పలుకుబడి ఉన్న వారు. అందువల్ల ఆయనను అసలు వదులుకోరాదన్నది బీజేపీ ముందస్తు తెలివైన ఎత్తుగడ. అలా బీజేపీ అవసరాలు దానికి ఉంటే ఏపీలో వైసీపీని నిలువరించి మరోసారి అధికారంలోకి రావడం టీడీపీ జనసేనకు అతి ముఖ్యం.

వైసీపీకి పెను సవాల్ :

అందువల్ల మూడు పార్టీలు పరస్పర ఆధారంగానే సాగుతున్నాయి. అవి విడిపోవాలని అసలు అనుకోవు. గత అనుభవాలు కూడా కళ్ళ ముందు ఉన్నాయి. దాంతో కూటమి ఐక్యంగానే 2029లో కూడా పోటీకి దిగుతుంది దాంతో వైసీపీకి ఇది పెను సవాల్ గా మారుతుంది అనడంలో సందేహం లేదు. 2014 నుంచి 2019 మధ్యలో వైసీపీ ఆలోచనలు ఫలించాయి. అనుకున్నట్లుగానే పొత్తులు చిత్తు అయ్యాయి, మూడు పార్టీలు విడిగా పోటీ చేస్తే వైసీపీకి 151 సీట్లు దక్కాయి. మళ్ళీ కోరి ఆ చాన్స్ అయితే కూటమి పార్టీలు ఇచ్చేది ఉండదని అంటున్నారు. దాంతో వైసీపీ ఇప్పటి నుంచే మేలుకుని కౌంటర్ పొలిటికల్ స్ట్రాటజీని అమలు చేయాలి. అంతే కాదు జాతీయ స్థాయిలో కొత్త మైత్రి కోసం కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఒంటరి పోరు వైసీపీకి విజయాన్ని ఇవ్వదు అని 2024 ఎన్నికలు రుజువు చేసినందువల్ల వైసీపీ తన విధానాలను రాజకీయ ఆలోచనలను కూడా మార్చుకోవాల్సి ఉందని అంటున్నారు. కర్నూల్ సభతో కూటమి వైసీపీకి పంపించిన కఠిన సందేశం ఇదే అని అంటున్నారు.

Tags:    

Similar News