సుపరిపాలనపై 'ఖాకీ' మరకలు..!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సువేంద్ర రెడ్డి.. మంత్రి నారా లోకేష్‌పై కామెంట్లు చేశారు. దీనిని మంత్రి సీరియస్‌గా తీసుకుని అతనిని అరెస్టు చేయాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు.;
రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నామని.. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపిస్తే.. తాము స్వేచ్ఛా వాయువులు ప్రసాదిస్తున్నామని చెబుతున్న కూటమి ప్రభుత్వంపై అదే వ్యవహారం మరకలు పడేలా చేస్తోంది. సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారని.. పోస్టులు పెడుతున్నారని.. ఫొటోలు పెడుతున్నారని.. దీనివల్ల తమపై విమర్శలు వస్తున్నాయని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతోంది. అయితే.. ఇలా చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు, కేంద్ర ప్రబుత్వం కూడా చెప్పాయి.
దీంతో దొడ్డిదారిని పోలీసులు అవలంభిస్తున్నారు. సోషల్ మీడియాలో సర్కారుపై కామెంట్లు చేస్తున్న వారిని వేరే కేసులకు ముడిపెట్టి .. అరెస్టు చేస్తున్నారు అని వైసీపీ ఆరోపిస్తుంది. లేదా సంఘ విద్రోహ శక్తులుగా ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు . ఈ రెండు కూడా అత్యంత దారుణమని కొంత కాలం కిందటే.. రాష్ట్ర హైకోర్టు తీవ్రస్థాయిలో హెచ్చరించింది. అయినా.. పోలీసుల తీరు మారలేదు. తాజాగా హైకోర్టు మరోసారి నిప్పులు చెరిగింది. తాడేపల్లిలో సువేంద్ర రెడ్డి అనే వైసీపీ కార్యకర్తను అరెస్టు చేసిన తీరు, ఎఫ్ ఐఆర్ నమోదు చేసిన తీరును తీవ్రంగా తప్పుబట్టింది.
అక్కడితో కూడా ఆగకుండా.. అసలు హైకోర్టునే తప్పుదారి పట్టించేలా పోలీసులు వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఈ కేసులో పోలీసులే ప్రథమ నిందితులని స్పష్టం చేసింది. ఒకానొక దశలో డీజీపీని కోర్టుకు పిలిచి.. విచారిస్తామని పేర్కొనడం సంచలనంగా మారింది. ఈ కేసును సీబీఐకి ఇస్తామని తేల్చి చెప్పింది. ఈ పరిణామాల ను ప్రభుత్వం దాచేసే ప్రయత్నం చేసినా.. అదే సోషల్ మీడియాలో మరోసారి ప్రజలకుచేరవేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు వివాదానికి కారణమైన ఈ కేసు సుపరిపాలనపై మచ్చలు కాదు.. మరకలు పడేలా చేసింది.
ఏం జరిగింది..?
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సువేంద్ర రెడ్డి.. మంత్రి నారా లోకేష్‌పై కామెంట్లు చేశారు. దీనిని మంత్రి సీరియస్‌గా తీసుకుని అతనిని అరెస్టు చేయాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. దీంతో రెచ్చిపోయిన పోలీసులు సువేంద్ర రెడ్డిని అరెస్టు చేశారు. అయితే.. ఈ విషయాన్ని కుటుంబానికి చెప్పలేదు. దీంతో ఆయన భార్య అపహరణ కేసు పెట్టాలని తాడేపల్లి పోలీసులను కోరారు. దీనికి ససేమిరా అనడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. అప్పటికే సువేంద్ర రెడ్డిపై కేసు పెట్టారు. తీవ్రంగా కొట్టారు.
కానీ, హైకోర్టుకు మాత్రం తమకు ఏమీ తెలియదని.. సువేంద్ర ఎవరో కూడా తెలీదని చెప్పారు. దీంతో హైకోర్టు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగింది. ఇది కేవలం ఒక కేసు మాత్రమే కాదు.. గతంలోనూ అనంతపురం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిపై ఏకంగా దేశ ద్రోహం కేసు పెట్టినప్పుడు కూడా హైకోర్టు మందలించింది. దీనిని బట్టి సుపరిపాలన ఎలా ఉందో చంద్రబాబు ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మేధావులు చెబుతున్నారు.