బాబు గుబులు: ఈ సారైనా ` క‌లుస్తారా.. ? `

కానీ, ఆ స‌మ‌యంలో బీజేపీ నాయ‌కులు ప‌న్నెత్తు మాట కూడా అన‌లేదు. పైగా.. ఎవ‌రికి వారు అన్న‌ట్టుగా ఈ స‌మ‌స్య త‌మ‌దికాద‌న్న‌ట్టుగా ఉన్నారు.

Update: 2026-06-07 06:30 GMT

కూట‌మి పార్టీల క‌లివిడి వ్య‌వ‌హారం.. మ‌రోసారి చ‌ర్చకు వ‌చ్చింది. సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న ఎన్డీయే కూట‌మి పార్టీల నాయ‌కుల కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మ‌యంలో మ‌రోసారి చంద్ర‌బాబు క‌లివిడి పాలిటిక్స్‌కు పిలుపునిచ్చారు. వ‌చ్చే వారం నుంచి కూట‌మి పార్టీలు సంయుక్తంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లాల ని ఆయ‌న తేల్చి చెప్పారు. రెండేళ్ల పాల‌న‌కు సంబంధించిన విష‌యాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని చేసిన మేలును పేర్కొనాల‌ని ఆయ‌న చెప్పారు.

దీనికి మూడు పార్టీలు క‌లిసి రావాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. అయితే.. చంద్ర‌బాబు ఇలా కూట‌మి పార్టీల క‌లివిడి, ఉమ్మ‌డి ప్ర‌చారం.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లే అంశాల‌పై మాట్లాడ‌డం ఇదే తొలిసారికాదు. గ‌తంలో కూడా ఆయ‌న క‌లివిడి కోసం ఏకంగా మూడు పార్టీల నాయ‌కులతో స‌మ‌న్వ‌య క‌మిటీని ఏర్పాటు చేశారు. తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగం విష‌యంపై చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ప్పుడు.. వైసీపీకి దీటుగా బదులు ఇచ్చేందుకు కూట‌మి పార్టీలు క‌లిసి ప‌నిచేయాల‌ని చంద్ర‌బాబు కోరారు.

కానీ, ఆ స‌మ‌యంలో బీజేపీ నాయ‌కులు ప‌న్నెత్తు మాట కూడా అన‌లేదు. పైగా.. ఎవ‌రికి వారు అన్న‌ట్టుగా ఈ స‌మ‌స్య త‌మ‌దికాద‌న్న‌ట్టుగా ఉన్నారు. దీంతో టీడీపీ నాయ‌కులే ఈ విష‌యానికి కౌంట‌ర్లు ఇచ్చారు. ఈ ప‌రిస్థితిపై అప్ప‌ట్లోనే ఆవేద‌న వ్య‌క్తం చేసిన చంద్ర‌బాబు.. ప‌రిస్థితిని మార్చేందుకే స‌మ‌న్వ‌య క‌మిటీని ఏర్పాటు చేశారు. కానీ, ఆ స‌మ‌న్వ‌య క‌మిటీలోనూ స‌మ‌న్వ‌యం లోపించింది. ఫ‌లితంగా.. ఎలాంటి ముంద‌డుగు ప‌డ‌లేదు.

ఇక‌, తాజాగా రెండేళ్ల పాల‌న‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లేందుకు క‌లిసి రావాల‌ని చంద్ర‌బాబు మ‌రోసారి పిలుపునిచ్చారు. అంద‌రూ క‌లిసి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కువెళ్తామ‌ని.. చెప్పారు. అంతేకాదు.. ఈ నెలలోనే మూడు చోట్ల బ‌హిరంగ స‌భ‌ల‌కు కూడా చంద్ర‌బాబు ప్ర‌ణాళిక రెడీ చేశారు. విశాఖ స‌హా అమ‌రావ‌తిలో ఈ స‌భ‌ల ను నిర్వ‌హించ‌నున్నారు. మ‌రి ఈ క్ర‌మంలో అయినా.. కూట‌మి పార్టీలు, ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర నాయ‌క త్వం క‌లిసి వ‌స్తుందా? రాదా? అనేది చూడాలి.

Tags:    

Similar News