పిల్లల అసెంబ్లీ.. ప్రేక్షకుడిలా చంద్రబాబు, లోకేశ్! ఎవరిదీ ఐడియా

ప్రభుత్వ పాఠశాల్లో చదువుకుంటున్న విద్యార్థులతో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.;

Update: 2025-11-26 11:02 GMT

ఏపీ అసెంబ్లీ ఆవరణలో బుధవారం నిర్వహించిన మాక్ అసెంబ్లీ ఆకట్టుకునేలా సాగింది. ప్రభుత్వ పాఠశాల్లో చదువుకుంటున్న విద్యార్థులతో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వినూత్న ఆలోచనలలో భాగంగా మాక్ అసెంబ్లీ నిర్వహణకు ప్రభుత్వం ముందుకొచ్చింది. సేమ్ అసెంబ్లీ సమావేశ మందిరంలా తయారు చేసిన వేదికపై అచ్చంగా అసెంబ్లీ మాదిరిగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి లోకేశ్ ప్రేక్షకులుగా మారిపోయారు.

విద్యార్థులకు రాజ్యంగం, ప్రభుత్వం, న్యాయం, చట్టం, పరిపాలన అనే అంశాలపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం పిల్లలతో మాక్ అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక విద్యార్థిని ఎంపిక చేశారు. వీరు ఆయా నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలుగా మాక్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఇక సభా కొలువుదీరినప్పుడు ఎలా అయితే స్పీకర్ ను ఎన్నుకుంటారో.. అదేవిధంగా మాక్ అసెంబ్లీలోనూ విద్యార్థి ఎమ్మెల్యేలు తమ స్పీకర్ ను ఎన్నుకున్నారు. ఎన్నికైన స్పీకర్ ను ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత స్థానాల్లో ఉన్న వారు సంప్రదాయం ప్రకారం సభాపతి స్థానం వద్దకు తొడ్కొని వచ్చారు.

ఇక సభా కార్యక్రమంలో కూడా పిల్లలు ఆకట్టుకునేలా చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ సమస్యలను ప్రస్తావించడం, బిల్లులను రూపొందించడం, వాటిని పాస్ చేయడం, ప్రతిపక్షం తమ అభ్యంతరాలను తెలియజేస్తూ ప్రభుత్వాన్ని కంట్రోల్ లో పెట్టడం ఇలా మాక్ అసెంబ్లీ మొత్తం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సమావేశాలను చూసిన వారు శాసనసభలో దిగజారుతున్న విలువలను కాపాడాలే కార్యక్రమాన్ని చేపట్టారని ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ సాగుతున్న తీరు, గత ప్రభుత్వంలో అసెంబ్లీ సాగిన తీరుపైన చర్చకు దారితీసింది. గత ప్రభుత్వంలో అసెంబ్లీ వేదికగా దూషణలే ఉండేవని, సీనియర్ నాయకుడు అయిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును కన్నీరు పెట్టుకునేలా అప్పటి ప్రభుత్వంలోని నేతలు వ్యవహరించారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ప్రతిపక్ష పార్టీ నేతలు కనీసం అసెంబ్లీకి కూడా రావడం లేదని విమర్శిస్తున్నారు. ఇలాంటి నేతల నుంచి విద్యార్థులు ఎలాంటి మంచిని నేర్చుకుంటారనే ఆలోచనతో.. పిల్లలతోనే అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో మాక్ అసెంబ్లీ నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

మొత్తానికి రాజకీయ విమర్శలు ఉన్నప్పటికీ, మాక్ అసెంబ్లీపై విద్యావేత్తలు, మేధావుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ వల్ల పిల్లలు అనుభవ పూర్వకంగా నేర్చుకునే అవకాశం ఉందంటున్నారు. పిల్లల మాక్ అసెంబ్లీని ప్రభుత్వం ప్రత్యక్ష ప్రసారం చేసింది. ప్రధాన మీడియాతోపాటు యూట్యూబ్ చానళ్లు కూడా లైవ్ టెలికాస్ట్ చేశాయి. పిల్లల తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు, సాధారణ ప్రజలు ఈ కార్యక్రమాన్ని తిలకించి ప్రభుత్వ ప్రయోగాన్ని అభినందిస్తున్నారు.



Tags:    

Similar News