నమో అంటే.. నరేంద్ర మోదీ కాదు.. లోకేశ్ కొత్త భాష్యం

పరిశ్రమలు ఏపీని ఎంచుకోడానికి మూడు కారణాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎకో సిస్టమ్ అంటూ వివరించారు మంత్రి లోకేశ్.;

Update: 2025-11-12 13:40 GMT

నమో.. అన్న పదానికి ఏపీ మంత్రి లోకేశ్ కొత్త అర్థం కనిపెట్టారు. ఇప్పటివరకు నమో అంటే నరేంద్ర మోదీ అన్న భావనే వ్యాప్తిలో ఉంది. అయితే ఈ విషయంలో చాలా తెలివిగా ఆలోచించిన మంత్రి లోకేశ్ నమోకు కొత్త అర్థం చెప్పారు. నమో అంటే నరేంద్ర మోదీయే కాదు. నాయుడు, మోదీ కూడా అంటూ తనదైన స్టైల్ లో కొత్త అర్థాన్ని ఆవిష్కరించారు లోకేశ్. బుధవారం ఢిల్లీ వెళ్లిన మంత్రి లోకేశ్ అక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి ప్రధాని మోదీ ఎంతగానో సహకరిస్తున్నారని కొనియాడారు. ప్రధాని మోదీ ప్రోత్సాహంతోనే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు.

పరిశ్రమలు ఏపీని ఎంచుకోడానికి మూడు కారణాలు ఉన్నాయి. సీఎం చంద్రబాబు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎకో సిస్టమ్ అంటూ వివరించారు మంత్రి లోకేశ్. పారిశ్రామిక వేత్తలతో మంచి సంబంధాలు నెలకొల్పుతున్నందునే రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వస్తున్నాయని వెల్లడించారు. పెట్టుబడులకు వేగవంతమైన సౌకర్యాల కల్పన కీలకమన్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఏపీని ఎంచుకున్నాయి. ఐటీ, తయారీ, సేవలు, పర్యాటక రంగాలు చాలా కీలకం. లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు అని మంత్రి లోకేశ్ తెలిపారు.

దేశంలో పలు రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తోంది. వికసిత్ భారత్ విజన్ మేరకు ముందుకు సాగుతున్నాం. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా సాగుతున్నాం. స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకుని ప్రగతి దిశగా పయనిస్తున్నాం. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు జరుగుతోంది. సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశమిచ్చిన సీఐఐకి ధన్యవాదాలు. ప్రభుత్వ విధాన రూపకర్తలు, పెడ్డుబడిదారులకు ఇదో అవకాశం. క్వాంటమ్, ఏఐ, మెటీరియల్ సైన్స్ తదితర రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. సీఐఐ సదస్సులో 410 ఎంవోయూలు జరుగుతాయని భావిస్తున్నామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. అదేవిధంగా 120 బిలియన్ డాలర్లు పెట్టుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడుల ద్వారా 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు.

Tags:    

Similar News