గోదావరిని ముంచితే జైలుకే..! ఆంధ్రా పేపర్ మిల్లుకు మంత్రి దుర్గేష్ మాస్ వార్నింగ్

రాజమహేంద్రవరంలోని పవిత్ర గోదావరి నదిని కలుషితం చేస్తున్న పేపర్ మిల్లులపై మంత్రి దుర్గేశ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

Update: 2026-05-28 06:53 GMT

రాజమహేంద్రవరంలోని పవిత్ర గోదావరి నదిని కలుషితం చేస్తున్న పేపర్ మిల్లులపై మంత్రి దుర్గేశ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రెండు రోజుల క్రితం ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ ప్రాంతాన్ని పరిశీలించి నదిలోకి కలుషిత జలాలు వదలడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో పర్యాటక మంత్రిగా దుర్గేశ్ చూసుకోవాలి కదా? అని అన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాజమహేంద్రవరంలో తన క్యాంపు కార్యాలయంలో దుర్గేశ్ మీడియా సమావేశం నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి గోదావరిలోకి వ్యర్థాలను వదిలితే ఎంతటి పెద్ద పరిశ్రమనైనా ఉపేక్షించేది లేదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. చట్టప్రకారం నేరుగా జైలుకు పంపుతామని అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు.

ఆంధ్రా పేపర్ మిల్లు కాలుష్యంపై మంత్రి దుర్గేశ్ తీవ్రంగా మండిపడ్డారు. దొంగమాటలు చెబితే కుదరదు అంటూ తేల్చిచెప్పారు. వ్యర్థాలను శుద్ధి చేసిన తర్వాతే నీటిని వదులుతున్నామని యాజమాన్యం దొంగమాటలు చెబుతోందని ఫైర్ అయ్యారు. నిన్న స్వయంగా డిప్యూటీ సీఎం, మేము కళ్లారా చూసి నీటి గాఢతను చెక్ చేస్తే పీహెచ్ విలువ 7 కంటే ఎక్కువగానే ఉందని వెల్లడైందని స్పష్టం చేశారు. మీరెంత బాధ్యతా రాహిత్యంగా ఉన్నారో నిన్నటి ఘటన చూస్తే స్పష్టమవుతోంది. ఓవైపు లాభాలు పొందుతూ కార్మికులకు కనీసం వేతనాలు ఇవ్వరు" అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రూ. 13 కోట్ల బకాయిలు

మున్సిపాలిటీకి ఆంధ్రా పేపర్ మిల్లు కట్టాల్సిన రూ. 13 కోట్ల బకాయిలను ఇప్పటికీ కట్టలేదని, పలుమార్లు హెచ్చరించినా స్పందన లేదని మంత్రి తెలిపారు. పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తున్నప్పటికీ ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోబోమని, మురుగును నేరుగా నదిలోకి వదిలితే జైలుకు పంపుతామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. కాలుష్య వ్యర్థాలను పరిశ్రమలు వదులుతుంటే వాటర్ వర్క్స్ ద్వారా ప్రజలు ఆ నీటిని తాగునీటిగా తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, దీనిని తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నామని మంత్రి వ్యాఖ్యానించారు.

ప్లాస్టిక్ రహిత పుష్కరాలు

పుష్కరాల కోసం పంచాయతీరాజ్ శాఖ తరపున రూ. 100 కోట్ల నిధులు ఇచ్చేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ చూపడం సంతోషకరమని మంత్రి దుర్గేష్ కొనియాడారు. పుష్కరాలకు వచ్చే దాదాపు 10 కోట్ల మంది భక్తులకు పవిత్రమైన, స్వచ్ఛమైన జలాల్లో పుణ్యస్నానాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈసారి పుష్కరాలను పూర్తిగా 'ప్లాస్టిక్ రహితం'గా నిర్వహించనున్నారు.

కుంభమేళా తరహాలో ఏర్పాట్లు

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు సాంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక హంగులు జోడించనున్నామన్నారు. భక్తుల కోసం ప్రత్యేకంగా టెంట్ సిటీలు, హోమ్ స్టేలు, అత్యాధునిక హోటళ్లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఏ ఘాట్‌లో స్నానం చేసినా ఒకే పుణ్యఫలం లభిస్తుందనే అంశంపై భక్తులకు అవగాహన కల్పించి రద్దీని క్రమబద్ధీకరిస్తామన్నారు.



Tags:    

Similar News