ప్రత్యక్షంగా స్థానికం.. పరోక్షంగా వైసీపీకి మేలు!

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వాతావరణం క్రమంగా విస్తరిస్తోంది. అక్టోబరులో ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తామని ప్రభుత్వం చెబుతోంది.

Update: 2026-08-20 15:30 GMT

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వాతావరణం క్రమంగా విస్తరిస్తోంది. అక్టోబరులో ఎన్నికల ప్రక్రియ పూర్తిచేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే పంచాయతీ పాలకవర్గాలకు పదవీకాలం పూర్తవగా, మండల, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలకు అక్టోబరులోగా పదవీకాలం ముగియనున్నట్లు చెబుతున్నారు. ముందుగా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా, ప్రత్యక్ష ఎన్నికల విధానంలో చైర్మన్లు, మేయర్లను ఎన్నుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంపైనా రకరకాల విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఈ మార్పు కారణంగా విపక్షం వైసీపీకి కొంత అనుకూల వాతావరణం తీసుకువస్తుందనే టాక్ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

సహజంగా స్థానిక ఎన్నికలు ప్రభుత్వానికి అడ్వాంటేజ్ గా ఉంటాయని గత చరిత్ర ఆధారంగా చెబుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అనూహ్యంగా తీసుకున్న నిర్ణయం వల్ల ఈ ఎన్నికల అటువంటి ఫలితాలు పునరావృతమయ్యే అవకాశాలపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రత్యక్ష ఎన్నికల కారణంగా అభ్యర్థి బలాబలాలతోపాటు పార్టీ ఓటింగ్ కీలకంగా మారే పరిస్థితి ఉందని అంటున్నారు. పరోక్ష ఎన్నికల విధానంలో ప్రజలతో అంతగా సంబంధాలు లేనివారు సైతం, లాబీయింగు ద్వారా మేయర్లు, మున్సిపల్ చైర్మన్లుగా పదవులు పొందే అవకాశం ఉండేదని అంటున్నారు. ప్రస్తుతం కూటమి తీసుకువస్తున్న సంస్కరణల కారణంగా బలమైన రాజకీయ నేపథ్యం, ప్రజలతో సత్సంబంధాలు ఉన్నవారికి గెలుపు అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు నిర్వహించడాన్ని విపక్షం ఎలా వినియోగించుకుంటుందనే అంశమే ఆ పార్టీకి గెలుపు అవకాశాలకు ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 123 మున్సిపాలిటీకి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇందులో 17 కార్పొరేషన్లు ఉండగా, 82 మున్సిపాలిటీలు, 24 నగర పంచాయతీలు ఉన్నాయని అంటున్నారు. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా పార్టీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం తీసుకురాగలిగితే 2029 ఎన్నికలకు వైసీపీపై భారం తగ్గుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అంటే కేవలం 123 మంది సమర్థులను గుర్తించడం ద్వారా వైసీపీ తన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

రాష్ట్రాభివృద్ధికి కీలకమైన పట్టణాల్లో రాజకీయ సుస్థిర కోరుకుంటూ ప్రభుత్వం మున్సిపాలిటీలకు ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. దీనివల్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఉంటుందని, అభివృద్ధి పనులను పరుగులు పెట్టించడమే కాకుండా, కొన్ని విధాన నిర్ణయాల అమలులో వేగం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సరిగ్గా ఇదే అంశం వైసీపీకి కూడా ఉపయోగపడుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ బలంగా ఉన్న కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వ్యూహాత్మకంగా పనిచేస్తే విజయం సాధించే అవకాశాలు ఉంటాయని, తద్వారా ఐదేళ్ల పాటు తమ వాణి బలంగా వినిపించే అవకాశం ఉంటుందని అంటున్నారు.

అదే సమయంలో ప్రధానమైన నగరాలు విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, కడప వంటి చోట్ల గెలిస్తే వైసీపీ భవిష్యత్తుపై కార్యకర్తలకు నమ్మకం కల్పించవచ్చునని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక విధంగా వైసీపీకి ఊపిరి పోసే పరిస్థితులు ఉన్నాయని, అయితే ఆ పార్టీ ఈ అవకాశాన్ని వినియోగించుకునే విధానంపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయని అంటున్నారు.

Tags:    

Similar News