రాజభవనం నుంచి కాలిఫోర్నియా వరకు!

బ్రిటన్ రాజ కుటుంబ బాధ్యతలకు దూరంగా తమకంటూ స్వతంత్ర జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో రాజ వంశానికి చెందిన ప్రిన్స్ హ్యారీ - సతీమణి మేఘన్ మార్కెల్ అమెరికాలోని కాలిఫోర్నియాకు మకాం మార్చారు.

Update: 2026-08-20 14:30 GMT

బ్రిటన్ రాజ కుటుంబ బాధ్యతలకు దూరంగా తమకంటూ స్వతంత్ర జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో రాజ వంశానికి చెందిన ప్రిన్స్ హ్యారీ - సతీమణి మేఘన్ మార్కెల్ అమెరికాలోని కాలిఫోర్నియాకు మకాం మార్చారు. అలా వారు బ్రిటన్‌ను వీడి కాలిఫోర్నియాలో అడుగుపెట్టి సరిగ్గా ఆరు సంవత్సరాలు పూర్తయ్యాయి. సుదీర్ఘ కాలంలో ఈ జంట ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు , వారి జీవితంలో చోటుచేసుకున్న కీలక పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

సెలబ్రిటీ హోదా తెచ్చిన నిరంతర చర్చలు

రాజకీయ - రాజరిక నిబంధనల నుండి బయటపడిన దంపతులు కాలిఫోర్నియాలోని సంతోషకరమైన వాతావరణంలో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మొదట్లో కోవిడ్ మహమ్మారి లాక్‌డౌన్ సమయంలో అక్కడికి చేరిన జంట‌ ఆ తర్వాత శాశ్వతంగా అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. ఇష్టమైన రీతిలో స్వేచ్ఛగా బతకడానికి కాలిఫోర్నియా సరైన వేదికగా భావించారు. మీడియా కంటపడకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఆశించినప్పటికీ సెలబ్రిటీ హోదా కారణంగా వారి ప్రతి అడుగు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది.

ఆర్చ్‌వెల్ ద్వారా సామాజిక సేవా ప్రయాణం

ఆరు సంవత్సరాల కాలంలో ఈ జంట కేవలం వ్యక్తిగత జీవితానికే పరిమితం కాలేదు. తమ వ్యాపార - సామాజిక ప్రయాణాన్ని విస్తృతం చేశారు. ఆర్చ్‌వెల్ ఫౌండేషన్‌ స్థాపించి వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు, మానసిక ఆరోగ్య అవగాహన సదస్సులు , స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు అండగా నిలవడంలో వీరు ఎప్పుడూ ముందుంటారనే పేరు సంపాదించుకున్నారు.

వివాదాలు -కుటుంబంతో విభేదాలు

అయితే ఈ ప్రయాణం పూర్తిగా పూలబాట ఏమీ కాదు. రాజ కుటుంబంతో తెగిపోయిన సంబంధాలు, మీడియాలో వారిపై వ‌చ్చిన‌ నిరంతర వ్యతిరేక కథనాలు ఈ జంటను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాయి. ముఖ్యంగా ఒప్రా విన్‌ఫ్రే ఇచ్చిన సంచలనాత్మక ఇంటర్వ్యూ - హ్యారీ రాసిన ఆత్మకథ `స్పేర్` ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. రాజ కుటుంబంలోని అంతర్గత విషయాలను బహిర్గతం చేయడం ద్వారా తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నారు. అయినా? తమ మాటే నెగ్గాలనే ధైర్యంతో ముందుకు సాగారు.

వినోద రంగంలో కొత్త సామ్రాజ్య నిర్మాణం

మరోవైపు వినోద రంగంలో తమకంటూ కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేశారు. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌తో భారీ ఒప్పందాలు కుదుర్చుకుని తమ జీవిత విశేషాలను - సామాజిక అంశాలను ప్రతిబింబించే పలు డాక్యుమెంటరీలు, సిరీస్‌లను నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ల ద్వారా వారికి భారీగా పేరు వచ్చినా? కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొవాల్సి వచ్చింది. అయినా? మీడియా ప్రొడక్షన్ రంగంలో నిలదొక్కుకోవడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయం.

భవిష్యత్ ప్రయాణంపై సర్వత్ర ఆసక్తి

రాజ కుటుంబం ఇచ్చే విలాసవంతమైన భద్రతను, హోదాను వదులుకుని వ్యక్తిగత స్వేచ్ఛ కోసం ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ తీసుకున్న సాహసోపేత నిర్ణయానికి ఆరు సంవత్సరాలు నిండాయి. ఎన్నో ఆటుపోట్లను, వివాదాలను ఎదుర్కొంటూనే కాలిఫోర్నియా గడ్డపై తమకంటూ కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. భవిష్యత్తులో ఈ జంట కెరీర్‌ను, కుటుంబాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Tags:    

Similar News