రక్తసంబంధం తప్ప .. రాజకీయ సంబంధం లేదు !
‘నా కూతురుతో రక్తసంబంధం తప్ప రాజకీయ సంబంధం లేదు. నా జన్మదిన వేడుకల సందర్భంగా నా కూతురు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతం.
‘నా కూతురుతో రక్తసంబంధం తప్ప రాజకీయ సంబంధం లేదు. నా జన్మదిన వేడుకల సందర్భంగా నా కూతురు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతం. కేవలం కుటుంబ బాంధవ్యం కారణంగా తన వ్యక్తిగత అభిప్రాయాలకు నేను రాజకీయంగా బాధ్యత వహించాలనడం, అదే ప్రాతిపదికన వివరణ కోరడం సముచితం కాదు’
కొండా సుష్మిత ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి బుధవారం ఇచ్చిన షోకాజ్ నోటీసులకు మంత్రి కొండా సురేఖ ఇచ్చిన సమాధానం ఇది. తన స్వగ్రామం అయిన గీసుకొండతో ఉన్న అనుబంధం వల్ల తన కూతురు అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన వేడుకలకు హాజరైందని, తన కూతురు వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధం అని కొండా సురేఖ పేర్కొనడం గమనార్హం.
తనకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద, పార్టీ క్రమశిక్షణ నియమావళి మీద సంపూర్ణ గౌరవం, విశ్వాసం ఉందని, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, తనకు జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలని సమాధానంలో విజ్ఞప్తి చేయడం జరిగింది.
కొండా సురేఖ సమాధానాన్ని బట్టి వ్యూహాత్మకంగానే కొండా సుష్మిత ద్వారా ఆరోపణలు చేయించారని అర్ధం అవుతున్నది. రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, పొంగులేటి, వేం నరేందర్ రెడ్డితో పాటు, సీనియర్ కాంగ్రెస్ నేతలు, మంత్రులను సుష్మిత నిన్న జన్మదిన వేడుకల్లో ప్రసంగంలో లాగింది. అయితే ఆమెకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేకపోవడంతో ఆమె తల్లి అయిన కొండా సురేఖను కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం వివరణ అడిగింది. మరి కొండా సురేఖ వివరణతో కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఎంత వరకు ఏకీభవిస్తుందో వేచిచూడాలి. మరో వైపు కొండా సుష్మిత వ్యాఖ్యలపై కొందరు పార్టీ నేతలు మినహా, రేవంత్ రెడ్డి వర్గం నుండి పెద్ద ఎవరూ స్పందించిన దాఖలాలు లేవు.