'మా వాళ్లు 3,000 మంది బయటే ఉన్నారు'.. షహజాద్ భట్టీ సంచలన వ్యాఖ్యలు
అంతేకాదు భారత్‌లో తమ నెట్‌వర్క్‌కు చెందిన సుమారు 3,000 మంది ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారని అతడు పేర్కొనడం భద్రతా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
భారత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై భద్రతా సంస్థలు విస్తృతంగా చర్యలు చేపడుతున్న వేళ పాకిస్థాన్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ షహజాద్ భట్టీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవల 253 మందిని అరెస్ట్ చేసినట్లు కేంద్రం వెల్లడించిన నేపథ్యంలో భట్టీ ఓ వీడియోలో స్పందిస్తూ.. అరెస్టైన వారిలో తమ నెట్‌వర్క్‌కు చెందినవారు లేరని చెప్పుకొచ్చాడు. అంతేకాదు భారత్‌లో తమ నెట్‌వర్క్‌కు చెందిన సుమారు 3,000 మంది ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారని అతడు పేర్కొనడం భద్రతా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
అరెస్టైన వారిని ‘'సీజేపీ సభ్యులు’గా పేర్కొన్న భట్టీ.. వారి ముఖాలను ప్రజలకు చూపించాలని సవాల్ చేశాడు. అవసరమైతే వారికి న్యాయపరమైన, ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించాడు. అతడి ప్రకటనపై భారత భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉన్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోనూ భట్టీ నెట్‌వర్క్‌కు సంబంధించిన లింకులు వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. యూసుఫ్‌గూడ, మేడ్చల్ ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థలకు కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. గతంలో అరెస్టైన ఇద్దరు యువకులకు ఈ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
సోషల్ మీడియా ద్వారా నెట్‌వర్క్ విస్తరణ?
దర్యాప్తులో గాజియాబాద్‌కు చెందిన 22 ఏళ్ల జాయిద్ ఖాన్ పేరు కీలకంగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అతడు ఫిబ్రవరిలో మేడ్చల్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేసినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఐఎస్‌ఐ సానుభూతిపరులతో పరిచయం ఏర్పడి అనంతరం వారితో ఆన్‌లైన్‌లో చాటింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. హమీద్, రాణా హుస్సేన్ అనే వ్యక్తులతో అతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ గుర్తించినట్లు సమాచారం.
ఎవరీ షహజాద్ భట్టీ?
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన షహజాద్ భట్టీ.. నేర ప్రపంచం నుంచి సోషల్ మీడియా వరకు తన ప్రభావాన్ని విస్తరించుకున్న వ్యక్తిగా భారత దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి. దోపిడీలు, బెదిరింపులు వంటి నేరాలతో ప్రారంభమైన అతడి ప్రస్థానం లాహోర్ అండర్‌వరల్డ్‌తో సంబంధాల వరకు వెళ్లినట్లు సమాచారం. 2013లో అతడిపై పలు కేసులు నమోదయ్యాయని, అనంతరం పాకిస్థాన్ నుంచి యూఏఈకి వెళ్లినట్లు ప్రచారం ఉంది.
పాకిస్థాన్‌లో టిక్‌టాక్‌కు ఆదరణ పెరిగిన తర్వాత భట్టీ సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగాడు. ‘333’ పేరుతో గుర్తింపు పొందుతూ మతపరమైన, జాతీయవాద, వివాదాస్పద అంశాలపై పోస్టులు చేస్తూ భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. భారత జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తనకు స్నేహితుడని కూడా గతంలో చెప్పుకున్నాడు. అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత బిష్ణోయ్ పాక్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో వీరి సంబంధాలు దెబ్బతిన్నట్లు సమాచారం.
ఉగ్రకుట్రల ఆరోపణలు
ప్రముఖ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి సహా పలువురు వ్యక్తులను భట్టీ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2024లో పంజాబ్‌లోని జలంధర్‌లో ఇన్‌ఫ్లూయెన్సర్ రోజర్ సంధు నివాసం వద్ద జరిగిన గ్రనేడ్ దాడి వెనుక భట్టీ హస్తం ఉందనే ఆరోపణలపై దర్యాప్తు జరిగింది. అతడికి పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో సంబంధాలు ఉన్నాయని భారత దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి.
భారత్‌లో యువతను తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షించి నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ప్రయత్నించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హరియాణా, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో అతడి నెట్‌వర్క్‌కు సంబంధించి కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.
253 అరెస్టులు.. భట్టీపై పాక్ స్పందన
స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్లలో 14 రాష్ట్రాల్లో మొత్తం 253 మందిని అరెస్ట్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. వీరిలో తెలంగాణకు చెందిన ఇద్దరు ఉన్నట్లు సమాచారం. మరోవైపు మహారాష్ట్ర ఏటీఎస్ కూడా భట్టీతో సంబంధాలున్నాయనే అనుమానంతో 112 మందిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల మధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. భట్టీ నెట్‌వర్క్‌ను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయని ప్రకటించినట్లు సమాచారం. అయితే భట్టీ నెట్‌వర్క్‌కు ఐఎస్‌ఐతో సంబంధాలున్నాయన్న ఆరోపణలను పాకిస్థాన్ తిరస్కరించింది.
భట్టీ తాజాగా చేసిన ‘భారత్‌లో మా వాళ్లు 3,000 మంది ఉన్నారు’ అనే వ్యాఖ్యలు నిజమా? లేక భయాందోళనలు సృష్టించేందుకు చేసిన ప్రచారమా? అనే అంశంపై దర్యాప్తు సంస్థలు మరింత లోతుగా పరిశీలించాల్సి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వెలుగులోకి వస్తున్న లింకుల నేపథ్యంలో భద్రతా సంస్థల దర్యాప్తు కీలకంగా మారింది.