ఐఫోన్ మోజులో తాతను చంపించిన మనవరాలు.. ఇది నేరం కాదు.. టెక్నాలజీపై ప్రేమ సామీ

అవును ఈ సూత్రాన్ని నూరిపోసుకున్న ఓ 13 ఏళ్ల 'చిన్నారి'.. కేరళలోని అలప్పుజలో తన సొంత తాతకే పర్మనెంట్ రిటైర్మెంట్ ఇచ్చేసింది.

Update: 2026-08-20 09:51 GMT

ఈ ప్రపంచంలో మనుషుల ప్రాణాల కంటే.. సంబంధాల కంటే అత్యంత విలువైంది ఏదైనా ఉందంటే.. అది ఖచ్చితంగా చేతిలో ఉండే ఐఫోన్.. గాల్లో దూసుకెళ్లే స్పోర్ట్స్ బైక్ మాత్రమే.. అవును ఈ సూత్రాన్ని నూరిపోసుకున్న ఓ 13 ఏళ్ల 'చిన్నారి'.. కేరళలోని అలప్పుజలో తన సొంత తాతకే పర్మనెంట్ రిటైర్మెంట్ ఇచ్చేసింది. ఆపిల్ లోగో ఉన్న ఫోన్ చేతిలో ఉంటే వచ్చే ఆ 'రేంజ్' ముందు, పెంచి పెద్ద చేసిన తాత ప్రాణం ఎంత చెప్పండి?

కథలోకి వెళ్తే.. మేడమ్‌గారికి ఒక కల. చేతిలో ఐఫోన్ ఉండాలి.. పక్కన ప్రియుడు బైక్ మీద రయ్‌రయ్‌మని తీసుకెళ్లాలి. మరి దానికి డబ్బులు కావాలిగా? కష్టపడి సంపాదించడం, చదువుకోవడం లాంటి పాతకాలపు పద్ధతులు మన డైనమిక్ యూత్‌కి నచ్చవు కదా.. అందుకే ఇంట్లో ఉన్న 67 ఏళ్ల తాతగారి బంగారాన్ని "రీ-డిస్ట్రిబ్యూట్" చేయాలని డిసైడ్ అయ్యారు. చిన్నప్పుడు కథలు చెప్పిన తాత.. ఇప్పుడు తన డిజిటల్ డ్రీమ్స్‌కి అడ్డుగా మారేసరికి.. ఆయన చాప్టర్‌ను శాశ్వతంగా క్లోజ్ చేయడమే ఏకైక సొల్యూషన్ అని ఆ పాప భావించింది.

ఇక ప్లానింగ్ చూస్తే హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాలకే చెమటలు పట్టాల్సిందే. ప్రియుడు, అతడి ఫ్రెండ్స్‌తో కలిసి నైట్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఇద్దరు వెంటిలేటర్ గుండా, ఒకరు మెయిన్ డోర్ గుండా లోపలికి ఎంట్రీ ఇచ్చి ఆ వృద్ధుడిని కట్టేసి ఊపిరి ఆడకుండా చేసి కాటాకి పంపేశారు. ఇక్కడితో అయిపోయిందా? మనది 'సోషల్ మీడియా' జెనరేషన్ కదా.. ప్రత్యక్ష ప్రసారం లేకపోతే ఎలా? అందుకే అక్కడున్న గ్యాంగ్, పాపగారికి లైవ్ వీడియో కాల్ చేసి తాతగారి 'లాస్ట్ సీన్'ను కళ్లారా చూపించింది. అంటే డిజిటల్ ఇండియాను ఈ రకంగా కూడా వాడుకోవచ్చన్నమాట..

హత్య పూర్తయ్యాక.. ప్లాన్ ప్రకారం ఇంట్లోని నాలుగు తులాల బంగారంతో ఈ 'మాస్టర్ మైండ్స్' జంప్ అయ్యారు. కానీ పాపం రీల్స్ చేసుకోవాల్సిన ఫోన్ల డేటానే పోలీసులకు రూట్ మ్యాప్ చూపించింది. టెక్నాలజీ సాయంతోనే ప్లాన్ వేసిన ఈ తెలివైన బ్యాచ్‌ను.. పోలీసులు అంతకంటే వేగంగా అదుపులోకి తీసుకుని జువెనైల్ బోర్డు ముందు ప్రవేశపెట్టారు.

ఇక సమాజం, సోషల్ మీడియా, ఆన్‌లైన్ లగ్జరీలు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పెద్దలకు ఒక్కటే సలహా.. పిల్లలకు ప్రేమానురాగాలు నేర్పించడం పాత పద్ధతి, వారికి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ కొనివ్వడమే అసలైన బాధ్యత.. లేకపోతే మీ ఇంట్లోని పసిపాప కూడా మీ ప్రాణానికి ఐఫోన్ అంత ప్రైస్ ట్యాగ్ తగిలించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Tags:    

Similar News