అమెరికా అప్పెంతో తెలుసా ?
మన రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం వరకు నిత్యం అప్పుల గురించి ఆందోళన చెందుతుండడం సహజం.
మన రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం వరకు నిత్యం అప్పుల గురించి ఆందోళన చెందుతుండడం సహజం. కానీ అందరికీ పెద్దన్నగా చెప్పుకునే అగ్రరాజ్యం కూడా ఇప్పుడు అప్పుల కుప్పలలో కూరుకుపోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ దేశ అప్పు 38.23 లక్షల కోట్లు దాటి 40 ట్రిలియన్ డాలర్ల వైపు ప్రయాణిస్తున్నది.
సరిగ్గా పదేళ్ల క్రితం అమెరికా అప్పు 19.4 ట్రిలియన్ డాలర్లు. ఇప్పుడు అది రెట్టింపు కావడం గమనార్హం. ప్రతి అమెరికన్ తలసరి భారం 1,16,000 డాలర్లు కాగా, ప్రతి కుటుంబాని సుమారు 2,97,000 డాలర్లు. అమెరికా వడ్డీ చెల్లింపులు రక్షణ ఖర్చుల కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం. గత 9 నెలల్లో 827 బిలియన్ డాలర్ల వడ్డీ చెల్లించడం జరిగింది. అమెరికా రుణ పరిమితి 41.1 ట్రిలియన్ డాలర్లు దీనిని వచ్చే ఏడాది నాటికి చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అభివృద్ధి చెందిన దేశాలలో అమెరికా ఆర్థిక పరిస్థితే అత్యంత బలహీనంగా ఉందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఒక నివేదికలో పేర్కొనడం గమనార్హం. సామాజిక భద్రతా కార్యక్రమాలతో పాటు, రక్షణ, సైనిక ఖర్చులు, కోవిడ్ కాలంలో పన్ను తగ్గింపులు, వడ్డీల పెరుగుదలతో పాటు ప్రభుత్వ సంపాదనకన్నా ఎక్కువ ఖర్చులు ఉండడమే ఈ పరిస్థితికి కారణం అని తెలుస్తున్నది. పెరుగుతున్న అప్పుల ప్రభావం అమెరికన్ల జీవితాల మీద పడుతుందని, ఈ పరిస్థితి ఇలాగే సాగితే సంక్షోభం వైపు ప్రయాణించే అవకాశం ఉందని భావిస్తున్నారు.