బీజింగ్ లో రెస్టారెంట్ల బ్యాన్.. 'ఇండియన్' పేరుతో పాకిస్థానీల వ్యాపారాలు? చైనా తనిఖీల్లో వెలుగుచూసిన నిజాలు!
చైనా రాజధాని బీజింగ్‌లో ఇండియన్ రెస్టారెంట్లపై అధికారులు చేపట్టిన తనిఖీలు చర్చనీయాంశంగా మారాయి.
చైనా రాజధాని బీజింగ్‌లో ఇండియన్ రెస్టారెంట్లపై అధికారులు చేపట్టిన తనిఖీలు చర్చనీయాంశంగా మారాయి. తొలుత 11 భారతీయ రెస్టారెంట్లను అధికారులు సీజ్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే బీజింగ్‌లో నివసిస్తున్న కొందరు ఈ సమాచారాన్ని తప్పుబడుతున్నారు. 11 రెస్టారెంట్లను సీజ్ చేయలేదని.. ఒక ఇండియన్ రెస్టారెంట్‌పై మాత్రమే సీలింగ్ చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు.
చైనా మీడియా కథనాల ప్రకారం.. బీజింగ్‌లోని ఓ ప్రముఖ ఇండియన్ రెస్టారెంట్‌పై పబ్లిక్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్, మార్కెట్ రెగ్యులేషన్ తదితర విభాగాల అధికారులు తనిఖీలు చేపట్టారు. అనంతరం ఈ వ్యవహారానికి సంబంధం ఉన్న మరికొన్ని రెస్టారెంట్లు, వ్యాపారాలపైనా అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.
వీసాలతో పని చేస్తున్నారా?
ఈ తనిఖీల్లో ప్రధానంగా విదేశీయుల వీసాలు, వర్క్ పర్మిట్లు, వ్యాపార లైసెన్సులు, ఆహార భద్రత ప్రమాణాలను అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. టూరిస్ట్ లేదా ఇతర అనుమతి లేని వీసాలపై చైనాలో ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారా? అనే అంశంపైనా విచారణ జరిగినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
ముఖ్యంగా కమ్యూనికేషన్ యూనివర్సిటీ ఆఫ్ చైనా సమీపంలోని ఓ ఇండియన్ రెస్టారెంట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారీగా కస్టమర్లను ఆకర్షించినట్లు సమాచారం. అక్కడ పనిచేస్తున్న కొందరు విదేశీయుల వీసా, ఉద్యోగ అనుమతులకు సంబంధించిన అంశాలపై అధికారులు విచారణ చేపట్టినట్లు చైనా మీడియా పేర్కొంది.
11 రెస్టారెంట్లు సీజ్ చేశారా?
ఇక్కడే అసలు గందరగోళం నెలకొంది. 11 రెస్టారెంట్లపై విచారణ లేదా తనిఖీలు జరగడం, 11 రెస్టారెంట్లను సీజ్ చేయడం రెండూ ఒకటి కాదు. కొన్ని కథనాల్లో దర్యాప్తు 11 సంబంధిత సంస్థల వరకు విస్తరించినట్లు పేర్కొనగా సోషల్ మీడియాలో మాత్రం అది ‘11 ఇండియన్ రెస్టారెంట్లు సీజ్’గా ప్రచారంలోకి వచ్చింది.
బీజింగ్‌లో నివసిస్తున్న వారి నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఒక ఇండియన్ రెస్టారెంట్ మాత్రమే సీజ్ అయిందని, మిగిలిన 10 పాకిస్తాన్, బంగ్లాదేశీలు ‘ఇండియన్’ పేరుతో నిర్వహిస్తున్నవని చెబుతున్నారు. అందువల్ల 11 ఇండియన్ రెస్టారెంట్లన్నీ మూతపడ్డాయని అన్నది తప్పుడు ప్రచారం అని బీజింగ్ లోని భారతీయులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు..
పాకిస్థానీయులే నడుపుతున్నారనే ప్రచారం
మరోవైపు ‘ఇండియన్ రెస్టారెంట్’ పేరుతో చైనాలోని కొన్ని వ్యాపారాలను పాకిస్థాన్ లేదా బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తులు నిర్వహిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. అయితే తాజా బీజింగ్ ఘటనలో చిక్కుకున్న రెస్టారెంట్ల నిర్వాహకులు పాకిస్థానీయులు లేదా బంగ్లాదేశీయులేనని గంటాపథంగా చెబుతున్నారు.. కాబట్టి సోషల్ మీడియా కామెంట్ల ఆధారంగా ఇండియన్ రెస్టారెంట్లు అని నిర్ణయానికి రావడం సరికాదు.
ఇండియన్ రెస్టారెంట్లకే పరిమితమా?
ఈ వ్యవహారాన్ని కేవలం భారతీయ రెస్టారెంట్లపై చైనా ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యగా చూడటంపైనా సందేహాలున్నాయి. విదేశీయులు నిర్వహించే ఇతర వ్యాపారాలు, యోగా స్టూడియోలు సహా పలు సంస్థల్లో వీసాలు, వర్క్ పర్మిట్లు, లైసెన్సులు తదితర అంశాలపై అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.
మొత్తంగా చూస్తే బీజింగ్‌లో తనిఖీలు జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ.. 11 ఇండియన్ రెస్టారెంట్లను సీజ్ చేశారన్న ప్రచారంలో నిజం లేదని బీజింగ్ లో ఉంటున్న భారతీయులు అంటున్నారు. . అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఒక రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకోగా, దర్యాప్తు మరికొన్ని సంస్థలకు విస్తరించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని ‘11 ఇండియన్ రెస్టారెంట్లు సీజ్’గా పేర్కొనడం అబద్దమంటున్నారు. 10 రెస్టారెంట్లు పాకిస్తానీలు నిర్వహిస్తున్నవే అని స్పష్టం చేస్తున్నారు.