కళ్యాణలక్ష్మి కథ కంచికేనా ?!
రైతుబీమా పథకం స్థానంలో ఇందిరమ్మ బీమా పథకం నవంబర్ 19 నుండి అమలులోకి తీసుకు రావాలని, ఆగస్టు 14న చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించకుండా ప్రభుత్వం నిలిపివేసింది.
తెలంగాణలో 2014 నుండి అమలవుతున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలు జీఓలు ఎనిమిదింటిని నిలిపివేస్తూ ఆగస్ట్ 12న స్టే విధించింది. ఈ పథకాల అమలుకు శాసనసభ ఆమోదం లేదని, కేవలం జీఓల ద్వారా అమలు చేస్తున్నారని, వీటి కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్దమని విజయ్ గోపాల్ అనే న్యాయవాది దాఖలు చేసిన రిట్ పిటీషన్ పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని అంతకుముందు తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
కానీ ప్రభుత్వం సకాలంలో కౌంటరు దాఖలు చేయకపోవడంతో పథకాల అమలుకు విడుదల చేసిన జీఓలను నిలిపివేస్తూ పథకాల అమలును నిలిపివేయాలని, లబ్దిదారులకు చెక్కులు ఇవ్వొద్దని ఆదేశాలు జారీచేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరగడంతో స్టే ఎత్తేయించి పథకాలు అమలు చేస్తామని, బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
అయితే తాజాగా స్టే ఎత్తేయాలన్న వినతిని రాష్ట్ర హైకోర్టు మరోసారి తిరస్కరించింది. ఆ పథకాలపై విధించిన స్టేలను తొలగించలేమని, ఉచిత పథకాలతో రాష్ట్రంలో ఆర్థిక ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని, పదవీ విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ అందడం లేదని, నిర్భంధ భూసేకరణ బాధితులకు పరిహారం అందడం లేదని, ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలు గడిస్తే ఇలాంటి పథకాలు అమలు చేయవచ్చని న్యాయస్థానం అభిప్రాయపడినట్లు తెలుస్తుంది.
రైతుబీమా పథకం స్థానంలో ఇందిరమ్మ బీమా పథకం నవంబర్ 19 నుండి అమలులోకి తీసుకు రావాలని, ఆగస్టు 14న చెల్లించాల్సిన ప్రీమియం చెల్లించకుండా ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పటికే రైతుభరోసా సరిగ్గా అమలు చేయడం లేదని, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకాలు నిలిపివేశారన్న అపవాదు ఉంది. ఈ పరిస్థితులలో కళ్యాణలక్ష్మి పథకానికి న్యాయపరమైన చిక్కులు రావడం ఇబ్బందికరంగా మారింది. మరి ఈ చిక్కుముడులు అధిగమించి పథకం ఎలా అమలు చేస్తారో ? వేచిచూడాలి.