జనసేన ఎంపీ కుమారుడి కారు ఢీకొని యువతి మృతి.. కేసు నమోదు!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు భారతి ముఖి (26) మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌లో ఉన్న లైఫ్‌స్టైల్ స్టోర్‌లో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది.

Update: 2026-08-20 17:07 GMT

హైదరాబాద్ మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల యువతి మృతి చెందింది. ఈ ప్రమాదానికి కారణమైన కారు జనసేన పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కుమారుడు లింగమనేని సంజూష్‌దిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంజూష్‌పై బీఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేశారు. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు భారతి ముఖి (26) మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌లో ఉన్న లైఫ్‌స్టైల్ స్టోర్‌లో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది. ఆగస్టు 16న మధ్యాహ్నం భోజనం కోసం ఆమె తన సహోద్యోగి పూజతో కలిసి బయటకు వెళ్లింది. ఐటీసీ కోహినూర్ వద్ద భోజనం చేసిన అనంతరం ఇద్దరూ తిరిగి ఇనార్బిట్ మాల్ వైపు వస్తుండగా రోడ్డు దాటుతున్నారు.

అదే సమయంలో వేగంగా వచ్చిన ఆస్టన్ మార్టిన్ కారు వారిని ఢీకొట్టింది. కారు నంబర్ టీజీ-09-జీ-0666గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో భారతి తీవ్రంగా గాయపడింది. ముఖ్యంగా తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను అదే కారులో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ప్రమాదం అనంతరం మృతురాలి సహోద్యోగి ఇచ్చిన సమాచారంతో లైఫ్‌స్టైల్ స్టోర్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షుల వివరాలు, ఇతర ఆధారాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. విచారణలో ఆస్టన్ మార్టిన్ కారును లింగమనేని సంజూష్ నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు ఆయనపై బీఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘటన మాదాపూర్ పరిసరాల్లో తీవ్ర కలకలం రేపింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో వాహనాలను అతివేగంగా నడపడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News