వైసీపీకి విజయసాయిరెడ్డి టెన్షన్.. చంద్రబాబుతో చేతులు కలిపారా?

లిక్కర్ స్కాం లోగుట్టు మొత్తం విజయసాయిరెడ్డికి తెలుసు అన్నట్లు సిట్ అనుమానిస్తోంది.;

Update: 2025-07-11 15:30 GMT

ఏపీ లిక్కర్ స్కాం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారణకు రమ్మంటూ ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) మరోసారి నోటీసులిచ్చింది. శనివారం ఉదయం రమ్మనమని ఆ నోటీసుల్లో సూచించింది. అయితే గతంలో నిందితుడిగా గుర్తించి విచారణకు పిలిచిన సిట్ తాజాగా విజయసాయిరెడ్డిని సాక్షిగా పరిగణిస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. సహజంగా విచారణ దశలో నిందితులు అప్రూవర్ గా మారితే కోర్టు అనుమతితో సాక్షులుగా మారతారు. కానీ, కేసు దర్యాప్తు దశలో ఉండగానే నిందితుడైన విజయసాయిరెడ్డిని సాక్షిగా పేర్కొనడం చర్చకు తావిస్తోంది. ఈ పరిణామం ప్రతిపక్షం వైసీపీని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. లిక్కర్ స్కాంలో వైసీపీ నేతలు వరుసగా అరెస్టు అవుతుండటం, పైగా కీలక నేతనే టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతున్న పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి వ్యవహారం ఆ పార్టీకి కలవరం పుట్టిస్తోంది.

వైసీపీలో నెంబర్ టు నాయకుడిగా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గత మార్చిలో ప్రకటించారు. అదే సమయంలో పార్టీలో అధినేత చుట్టూ కోటరీ ఉందంటూ విమర్శలు గుప్పించారు. ఇక కాకినాడ సీపోర్టు వాటాల బదిలీ కేసులో విచారణకు వెళ్లిన విజయసాయిరెడ్డి లిక్కర్ స్కాంపై సంచలన ఆరోపణలు చేశారు. ఏ1 కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి మాత్రమే కర్త, కర్మ, క్రియ అంటూ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనతోనే అరెస్టుల పర్వం మొదలైందని అంటున్నారు. అంతేకాకుండా ఈ కేసులో విజయసాయిరెడ్డి ఏ5గా సిట్ పేర్కొంది. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను వరుసగా అరెస్టు చేస్తున్న సిట్ ఇంతవరకు విజయసాయిరెడ్డిని టచ్ చేయలేదు. గతంలో రెండు సార్లు విచారించి విడిచిపెట్టింది. ఇక అదే సమయంలో తాను సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తారనని విజయసాయిరెడ్డి బహిరంగంగా ప్రకటించారు. ఈ పరిణామమే నిందితులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని అంటున్నారు.

లిక్కర్ స్కాం లోగుట్టు మొత్తం విజయసాయిరెడ్డికి తెలుసు అన్నట్లు సిట్ అనుమానిస్తోంది. విజయసాయిరెడ్డి సైతం తనకు తెలిసినంత వరకు చెప్పేస్తానంటూ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు అరెస్టు అయిన వారు తమకేం తెలియదని మాత్రమే చెబుతున్నారు. సిట్ కస్టడీకి తీసుకుని విచారించినా, కేసులో తమ పాత్ర లేదన్న వాదనకే కట్టుబడుతున్నారని అంటున్నారు. నిందితుల పాత్రపై ఆధారాలు చూపితే మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు కానీ, బిగ్ బాస్ కోసం చెప్పడం లేదని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి ఏం చెబుతారన్న టెన్షన్ కనిపిస్తోంది. వాస్తవానికి లిక్కర్ పాలసీ తయారీకి తొలుత విజయసాయిరెడ్డి ఇంట్లోనే సిటింగు జరిగిందని వార్తలు వెలువడ్డాయి. ఈ కథనాలను నిందితులు తోసిపుచ్చారు. కానీ, తన ఇంట్లో ఒకటి రెండు సార్లు చర్చించామని గతంలో విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఇలా నిందితులను ఇరికించేలా విజయసాయిరెడ్డి వాంగ్మూలాలు ఉండటంతో వైసీపీలో ఆందోళన వ్యక్తమవుతోందని అంటున్నారు.

కేసులో ఇప్పటివరకు విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారంతోనే కీలక ఆధారాలను సిట్ సేకరించిందని ప్రచారం జరుగుతోంది. ఇక తాజా విచారణలో ఆయన ఏం చెబుతారన్నది మాత్రం పెద్ద చర్చకు దారితీస్తోంది. విజయసాయిరెడ్డి నోరు విప్పితే 'ముఖ్య' నేత గుట్టు రట్టు అయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు. అయితే విజయసాయిరెడ్డి ఆ సాహసం చేస్తారా? అన్నది అంతుచిక్కడం లేదని అంటున్నారు. ముఖ్య నేత పాత్ర కోసం విజయసాయిరెడ్డి నోరు విప్పాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఆయనకు సరైన హామీ లభించాలని అంటున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు విజయసాయిరెడ్డిని అరెస్టు చేయలేదంటేనే ముఖ్యమంత్రి సహకారం పరోక్షంగా అందినట్లేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రేపటి విచారణలో విజయసాయిరెడ్డి ఏం చెబుతారన్న టెన్షన్ నిందితులకు నిద్ర పట్టనీయడం లేదని అంటున్నారు.

Tags:    

Similar News