లిక్కర్ స్కాంలో మరో ఐఏఎస్.. విచారణకు రమ్మంటూ సిట్ నోటీసులు

మద్యం పాలసీ రూపకల్పన నుంచి కమీషన్లు తీసుకోవడం వరకు అడుగడుగునా ఉల్లంఘనలు జరిగినట్లు సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు.;

Update: 2025-07-10 09:21 GMT

ఏపీ లిక్కర్ స్కాంలో మరో ఐఏఎస్ పేరు బయటకు వచ్చింది. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రజత్ భార్గవకు సిట్ నోటీసులు జారీ చేసింది. కీలక హోదాలో ఉండి మద్యం అమ్మాకాలు, కొనుగోళ్లలో అనేక అవకతవకలు జరుగుతుంటే కనీసం అభ్యంతరం చెప్పకపోవడం ఏంటి? అన్న కారణంతో రజత్ భార్గవ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల క్రితమే రిటైర్ అయిన రజత్ భార్గవ పాత్రపై సందేహాలు వ్యక్తం కావడంతో 11వ తేదీ శుక్రవారం సిట్ ముందుకు వచ్చి తమ అనుమానాలను నివృత్తి చేయాలని సిట్ నోటీసులు జారీ చేసింది.

లిక్కర్ స్కాంలో రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆయనను అరెస్టు చేస్తారా? లేక సాక్షిగా పరిగణించి విచారించి వదిలేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అయితే స్కాంలో రజత్ భార్గవకు కూడా ముడుపుల మొత్తం అందిందని, అందుకే ఆయన పూర్తిగా సహకరించారని సిట్ అధికారులు భావిస్తున్నారని అంటున్నారు. స్కాంలో రిటైర్డ్ ఐఏఎస్ పాత్ర నిర్ధారించుకున్నాకే ఆయనకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. దీంతో ఈ స్కాంలో ఇరుక్కున్నఐఏఎస్ అధికారుల సంఖ్య రెండుకు చేరింది. లిక్కర్ స్కాంలో ఇప్పటికే రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి అరెస్టు అయ్యారు. ప్రస్తుతం ఆయన విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

మద్యం పాలసీ రూపకల్పన నుంచి కమీషన్లు తీసుకోవడం వరకు అడుగడుగునా ఉల్లంఘనలు జరిగినట్లు సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ఎక్సైజ్ శాఖను శాసిస్తుంటే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత భార్గవ ప్రేక్షక పాత్ర పోషించారని ఆయనపై ఆరోపణలు వినిస్తున్నాయి. ఈ కారణంగానే సిట్ ఆయనను అనుమానిస్తోందని అంటున్నారు. మద్యం దుకాణాలలో కొత్త బ్రాండ్లు అమ్మాలంటే మొదటి నెలలో పది వేల బాక్సులకు మించి ఆర్డర్ ఇవ్వకూడదని నిబంధనలు ఉండగా, ఆదాన్ డిస్టలరీస్ అనే సంస్థకు తొలి నెలలోనే లక్షా 80 వేల కేసులకు ఆర్డర్ ఎలా ఇచ్చారు? దీని వెనుక ఎవరున్నారు? రిటైల్ అవుటలెట్ల నుంచి పెట్టాల్సిన ఆర్డర్లు డిపో మేనేజర్లు పెట్టేలా ఎందుకు నిబంధనలు మార్చారు? వంటి వాటిని రజత్ భార్గవ నుంచి తెలుసుకోవాలని సిట్ అనుకుంటోందని అంటున్నారు.

ఇక రజత్ భార్గవ విచారణతో ఈ కేసులో మరికొందరి పాత్ర బయటకు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ కేసులో సుమారు 40 మంది నిందితులను గుర్తించగా, సుమారు 11 మంది వరకు అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల్లో ఒకరిద్దరు న్యాయస్థానం నుంచి రక్షణ పొంది అరెస్టు ముప్పు నుంచి తప్పించుకున్నారు. మిగిలిన నిందితులను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

Tags:    

Similar News