లిక్కర్ కేసుపై మంత్రి కొల్లు 'అతిపెద్ద తిమింగలం' వ్యాఖ్యల సంచలనం!
అవును... ఏపీలో రాజకీయాల్లో ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.;
ఏపీలో ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై దర్యాప్తు జరిపిన సిట్.. 305 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ను కోర్టుకు సమర్పించింది. ఈ క్రమంలో మిథున్ రెడ్డితో కలిపి 12 మందిని అరెస్ట్ చేసింది. అయితే... వీరంతా చిన్న తిమింగలాలని, అతి పెద్ద తిమింగలం ఒకటి ఉందంటూ కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... ఏపీలో రాజకీయాల్లో ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో వరుసగా అరెస్టులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో... త్వరలో అతిపెద్ద తిమింగలం బయటకు రాబోతోందని మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణం ఇదని ఆభిప్రాయపడ్డారు.
తాజగా శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు బయటపడుతున్నది చిన్న తిమింగలాలేనని త్వరలో అతిపెద్ద తిమింగలం బయటికి రాబోతుందని.. ఇందులో జరిగిన అవినీతిని చూసి ఆశ్చర్యపోతున్నారని వ్యాఖ్యానించారు.
గతంలో లిక్కర్ పేరు చెప్పి జేబులు నింపుకొన్నారని ఆరోపించిన మంత్రి... కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా రూ. 500 కోట్ల ఆదాయం వచ్చిందని అన్నారు. ఇదే సమయంలో.. బయట రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యానికి కళ్లెం వేశామని తెలిపారు. రాష్ట్రంలో తక్కువ దొరకే నాణ్యమైన మద్యం అందుతుందని అన్నారు.
ఇదే సమయంలో... గత ఐదేళ్లపాటు అరాచక పాలన సాగిందని, అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోయిందని చెప్పిన కొల్లు రవీంద్ర... పోలవరం, అమరావతి వంటి నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయన్నారు. ఎక్కడ చూసినా అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలు, దోపిడీలే కనిపించాయని గుర్తు చేసుకున్నారు.
అయితే ఇప్పుడు పోలవరంతో పాటు అమరావతి నిర్మాణాలు కూడా జరుగుతున్నాయని.. ఎన్నో కష్టాలు పడి బనకచర్ల ప్రాజెక్టుని ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతుంటే.. ఆ ప్రాజెక్టును అడ్డుకునేందుకు జగన్ అన్ని రకాల కుయుక్తులు పన్నుతున్నారని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో... మంత్రి కొల్లు రవీంద్ర చెప్పిన ఆ పెద్ద తిమిగిలం ఎవరనే చర్చ మొదలైంది.
కాగా... సిట్ అధికారులు దాఖలు చేసిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో జగన్ ను నిందితుడిగా చేర్చనప్పటికీ.. ఆయా సందర్భాల్లో కొన్ని చోట్ల జగన్ పేరు ప్రస్తావించిన సంగతి తెలిసిందే! అయితే... దర్యాప్తు కొనసాగుతున్నందున తదుపరి దశలో దాఖలు చేయబోయే అనుబంధ ఛార్జ్ షీట్ ల్లో జగన్ ప్రమేయంపై స్పష్టత రానుందని అంటున్నారు.