వచ్చే ఏడాది 8 ఐపీఎస్ అధికారుల రిటైర్మెంట్.. అందులో ఇద్దరు సస్పెన్షన్ లోనే
వీరు రిటైర్ కావడానికి ఇంకా 8 నుంచి 10 నెలల సమయం ఉండగా, ఈ లోగా వారిపై సస్పెన్షన్ తొలగించే అవకాశం ఉందా? లేదా? అన్నదే ప్రధాన చర్చగా మారింది.;
ఏపీలో వచ్చే ఏడాది రిటైర్ కాబోయే ఐపీఎస్ అధికారుల లిస్టును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 8 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉద్యోగ విరమణ చేయనుండగా, అందులో ఇద్దరు ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు. వీరు రిటైర్ కావడానికి ఇంకా 8 నుంచి 10 నెలల సమయం ఉండగా, ఈ లోగా వారిపై సస్పెన్షన్ తొలగించే అవకాశం ఉందా? లేదా? అన్నదే ప్రధాన చర్చగా మారింది. అదేవిధంగా రిటైర్ కాబోతున్న సీనియర్ ఐపీఎస్ ల్లో కొందరు అప్రధాన్య పోస్టుల్లో ఉండటంపై చర్చ జరుగుతోంది.
వచ్చే ఏడాది రిటైర్ అవ్వనున్న ఐపీఎస్ ల్లో మాజీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డితోపాటు ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో అరెస్టు అయిన పీఎస్ఆర్ ఆంజనేయులు, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పీవీ సునీల్ కుమార్ ఉన్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరిని ప్రభుత్వం ఏడాదికిపైగా పక్కన పెట్టింది. ఎన్నికల సమయంలోనే కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా తప్పించి లూప్ లైన్ కి పంపగా, పీఎస్ఆర్ ఆంజనేయులు, పీవీ సునీల్ కుమార్ కూటమి అధికారంలోకి వచ్చిన నుంచి ఏ పోస్టింగు లేక ఖాళీగా ఉంటున్నారు. తొలుత ఈ ఇద్దరిని వీఆర్ లో పెట్టిన ప్రభుత్వం తర్వాత అవినీతి ఆరోపణలు, విధి నిర్వహణలో నిబంధనలు అతిక్రమణ వంటి అభియోగాలతో సస్పెన్షన్ విధించింది.
అదేవిధంగా మొత్తం 8 మంది రిటైర్ అవుతుండగా, వీరిలో రాజేంద్రనాథ్ రెడ్డి తప్ప మిగతా ఎవరూ డీజీపీ కాలేకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. రిటైర్ అవ్వనున్న వారిలో అంజనీకుమార్, మాదిరెడ్డి ప్రతాప్, ఎన్.బాలసుబ్రహ్మణ్యం, జి.పాలరాజు, కేఎస్ఎస్వి సుబ్బారెడ్డి పేర్లు ఉన్నాయి. వీరిలో అంజనీకుమార్ వచ్చే ఏడాది జనవరిలోనే రిటైర్ కానున్నారు. ఈయనతోపాటు పాలరాజు సైతం అదేనెలలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. అదేవిధంగా సుబ్బారెడ్డి మార్చిలోను రాజేంద్రనాథ్ రెడ్డి ఏప్రిల్ లోనూ రిటైర్ అవుతారు. సునీల్ కుమార్, మాదిరెడ్డి ప్రతాప్ జూన్, పీఎస్ఆర్ ఆగస్టులో ఉద్యోగ విరమణ చేస్తారు.
ఇక రిటైర్ అవుతున్న వారిలో అంజన్ కుమార్, మాదిరెడ్డి ప్రతాప్, పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు డీజీ ర్యాంకు ఉన్నవారు. వీరు నలుగురికి డీజీపీ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల చాన్స్ దక్కలేదు. ప్రధానంగా వీరు డీజీపీ అయ్యే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మారడంతో చాన్స్ కోల్పోవడమే కాకుండా కెరీర్ చివరి మజిలీలో ఇబ్బందుల్లో పడినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.