ఆ ఏపీ ఐపీఎస్‌లు అలా రిటైర్ కావాల్సిందే.. !
మరోవైపు కేసుల విచారణ కూడాకొనసాగుతోంది. ఇదిలావుంటే..ఏబీవీ చేసినట్టుగా వీరిలో ఎవరూ కూడా న్యాయ పోరాటం చేయడం లేదు.;
ఏపీలో కొందరు ఐపీఎస్‌ల వ్యవహారం.. వివాదానికి దారితీసిన నేపథ్యంలో ప్రభుత్వం వారిని పక్కన పెట్టి న విషయం తెలిసిందే. సాధారణంగా.. వైసీపీ హయాంలోనే ఈ వ్యవహారం మొదలైంది. ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుతో ప్రారంభమైన సస్పెన్షన్ల వ్యవహారం.. తర్వాత పలువురి వరకు పాకింది. ఏబీని సుదీర్ఘ కాలం పాటు సస్పెన్షన్‌లో ఉంచారు. అనంతరం.. రిటైర్మెంటుకు ఓ రెండు రోజుల ముందు సస్పెన్షన్ ఎత్తేశారు. అయితే.. ఆయన క్యాట్ సహా కోర్టులను ఆశ్రయించి.. కేసుల నుంచి బయట పడ్డారు.
ప్రస్తుతం పరిస్థితి ఏంటి..?
ప్రస్తుతం నలుగురు కీలక ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్‌లో ఉన్నారు. 1) పీవీ సునీల్ కుమార్ 2) సంజయ్ 3) విశాల్ గున్నీ 4) కాంతి రాణా టాటా. ఈనలుగురిపైనా కేసులు ఉన్నాయి. పీవీ సునీల్‌పై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పెట్టిన కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ పరిధిలోనే ఉంది. దీనిని సిట్ ప్రస్తుతం విచారిస్తోంది. ఇక, సంజయ్‌పై ఏపీ ఫైర్ డిపార్ట్‌మెంటు నిధుల దుర్వినియోగం కేసు ఉంది. విశాల్ గున్నీ, కాంతి రాణా టాటాలపై.. మహారాష్ట్రకు చెందిన నటి కాదంబరి జెత్వానీ వేధింపుల కేసు ఉంది. దీంతో ప్రభుత్వం వీరిని సస్పెన్షన్‌లో ఉంచింది.
మరోవైపు కేసుల విచారణ కూడాకొనసాగుతోంది. ఇదిలావుంటే..ఏబీవీ చేసినట్టుగా వీరిలో ఎవరూ కూడా న్యాయ పోరాటం చేయడం లేదు. దీనికి కారణం.. ఒకవేళ క్యాట్ సహా కోర్టులకు వెళ్తే.. కేసులు మరిన్ని రోజులు పొడిగించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. దీంతో వారు మౌనంగా ఉన్నారు. పీవీ సునీల్‌పై కేసు విచారణ జరుగుతోంది. సంజయ్ ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. ఇక, విశాల్ గున్నీ, టాటాలపై కేసులు నమోదైనా విచారణపై స్టే తెచ్చుకున్నారు.
ఫ్యూచర్ ఏంటి..?
ఈ నలుగురు ఐపీఎస్‌ల వ్యవహారంతో పాటు మరో ఐపీఎస్ అధికారి.. వైసీపీ హయాంలో కృష్ణాజిల్లా ఎస్పీగా చేసి.. టీడీపీ నేతలపై కేసులు పెట్టించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జాషువా పేరు కూడా ఉంది. ఈయన కూడా ప్రస్తుతం సస్పెన్షన్‌లోనే ఉన్నారు. ఇక, ఈ ఐదుగురిలో జాషువా, సునీల్, సంజయ్‌లు మరో రెండు, మూడేళ్లలో రిటైర్మెంట్ కానున్నారు. అప్పటి వరకు ఈ కేసులు తేలే పరిస్థితి కనిపించడం లేదని ఐపీఎస్ వర్గాలు చెబుతున్నాయి. సో.. మొత్తానికి ఏబీవీ మాదిరిగానే వీరికి కూడా చివరి రోజు వరకు.. లేదా రిటైరైన తర్వాత కూడా కేసులు వెంటాడే అవకాశం ఉందని తెలుస్తోంది.