మమ్మల్ని కూడా ట్రోల్స్ చేస్తున్నారు: హైకోర్టు న్యాయమూర్తి
వైసీపీ అధినేత జగన్ గుంటూరు జిల్లా రెంటపాళ్లలో పర్యటించిన సమయంలో ఆయన కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారని పోలీసులు కేసు నమోదు చేశారు.;
``మేం రాజ్యాంగ బద్ధంగా తీర్పులు ఇస్తున్నాం. ఏ కేసును ఎలా విచారించాలో మాకు తెలుసు. ఏ విషయం పై ఎలా స్పందించాలో మాకు తెలుసు. కానీ.. కొందరు తమకు వ్యతిరేకంగా ఆదేశాలు వస్తుండడంతో మమ్మల్ని కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. మా బాధలు ఎవరికి చెప్పాలి? సారీ.. `` అని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నాలుగు రోజులుగా తనను ట్రోల్ చేస్తున్నారని ఆయన వాపోయారు.
వైసీపీ అధినేత జగన్ గుంటూరు జిల్లా రెంటపాళ్లలో పర్యటించిన సమయంలో ఆయన కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారని పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సదరు న్యాయమూ ర్తి.. రెండు రోజుల కిందట దీనికిసంబంధించిన పోలీసు విచారణపై స్టే విధించారు. వీడియోలు, ఫొటోలు ఉన్నా.. స్టే ఎలా విధిస్తారని.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనలర్ ఆయనను నిలదీశారు. అయితే.. అది తమ విచక్షణాధికారమని.. ఎవరూ ప్రశ్నించజాలరని పేర్కొన్న న్యాయమూర్తి.. స్టే విధించారు.
దీనిపైనే సదరు న్యాయమూర్తిని కొందరు ట్రోల్ చేశారు. ఈ విషయాన్ని తాజాగా హైకోర్టు బెంచ్‌పైనే సదరు న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే.. ఆయన ఎవరినీ ఉద్దేశించి తప్పుబట్టకపోయినా.. ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ట్రోల్స్ వల్ల గతంలోనూ న్యాయవ్యవస్థ తీవ్ర ఇబ్బందిపడిన సందర్భాలను న్యాయవాదు లు గుర్తు చేశారు.
ముఖ్యంగా వైసీపీ హయాంలో కొందరు న్యాయమూర్తులను టార్గెట్ గా చేసుకుని చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు చేశారన్నది ప్రశ్నగా మారింది. ఇదిలావుంటే.. న్యాయమూర్తి బెంచ్‌పై కూర్చుని చేసిన వ్యాఖ్యలను ప్రధాన న్యాయమూర్తి సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉందని.. దీనిపై సుమోటో గా కేసు నమోదు చేయొచ్చని న్యాయవాదులు అంటున్నారు.