కారుణ్య నియామకాలపై ఏపీ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు..

కారుణ్య నియామకం అసలు ఉద్దేశం ‘తక్షణ ఆర్థిక సాయం’. కానీ ప్రస్తుతం ఇది ఒక వారసత్వ హక్కులా మారుతోందని కోర్టు అభిప్రాయపడింది.;

Update: 2026-04-21 05:57 GMT

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువత మనసులోని మాటను ప్రతిబింబిస్తున్నాయి. కారుణ్య నియామకాలు అనేవి ఒక కుటుంబం దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు ఇచ్చే 'మినహాయింపు' మాత్రమే కానీ, అవి 'ప్రత్యామ్నాయ నియామక ప్రక్రియ'గా మారకూడదనేది కోర్టు ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రస్తుతం పౌర సమాజంలో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి చనిపోయినప్పుడు వారి కుటుంబాన్ని ఆదుకోవాలనే మానవీయ కోణం మంచిదే అయినా, అది ప్రతిభావంతులైన నిరుద్యోగుల అవకాశాలను దెబ్బతీయకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘అన్నీ కారుణ్యాలే అయితే, కష్టపడి చదివిన ప్రతిభావంతులు ఎక్కడికి వెళ్లాలి?’ అన్న కోర్టు ప్రశ్న ఇప్పుడు ప్రభుత్వ విభాగాల్లోని నియామక సరళిని నిలదీస్తోంది.

గణాంకాలు ఏం చెబుతున్నాయి..

హైకోర్టు సేకరించిన వివరాల ప్రకారం.., 2014 నుంచి ఇప్పటి వరకు ఏపీలో ఏకంగా 20,801 ఉద్యోగాలు కారుణ్య కోటాలోనే భర్తీ అయ్యాయి. ప్రతి సంవత్సరం సుమారు 2,000 నియామకాలు జరుగుతున్నాయి. అనేక శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా జరిగే సాధారణ నియామకాల కంటే కారుణ్య నియామకాలే ఎక్కువగా ఉండడం ఆందోళనకరం. దీనివల్ల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసే సాధారణ అభ్యర్థులకు ఖాళీలు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది.

కారుణ్య నియామకం అసలు ఉద్దేశం ‘తక్షణ ఆర్థిక సాయం’. కానీ ప్రస్తుతం ఇది ఒక వారసత్వ హక్కులా మారుతోందని కోర్టు అభిప్రాయపడింది. ఒకే కుటుంబంలో మూడో తరానికి చెందిన వారికి కూడా ఈ కోటా వర్తింపజేస్తున్న ఉదాహరణలను కోర్టు తప్పుబట్టింది. కుటుంబం ఆర్థికంగా నిలకడగా ఉన్నప్పటికీ, కేవలం వారసత్వం పేరుతో ఉద్యోగాలు పొందడం రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు (ఆర్టికల్ 16)కు విరుద్ధమని కోర్టు పేర్కొంది.

కోర్టు సూచించిన మార్పులు

ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి మూడు నెలల గడువు ఇచ్చింది. దీనికి సంబంధించి కొన్ని ప్రధాన సూచనలు కూడా చేసింది. మరణించిన ఉద్యోగి కుటుంబం నిజంగా పేదరికంలో ఉందా..? లేదా..? అనేది క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఉద్యోగం ఇవ్వాలి. ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వడానికి బదులు, మరణించిన ఉద్యోగి చివరి వేతనం, మిగిలిన సర్వీసును బట్టి భారీ మొత్తంలో 'ఎక్స్‌గ్రేషియా' చెల్లించి ఆ కుటుంబాన్ని సెటిల్ చేయాలి. అవసరమైతే అవుట్‌సోర్సింగ్ లేదా తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధి కల్పించాలి తప్ప, నేరుగా పర్మినెంట్ పోస్టులను కేటాయించకూడదు అని సూచనలు చేసింది. 'ఆధారపడిన వారు' అనే పదానికి స్పష్టమైన, కఠినమైన నిర్వచనం ఉండాలి.

ప్రతిభావంతుల ఆవేదన

కోరుకున్న ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లలో గడుపుతూ, వేల రూపాయలు ఖర్చు చేస్తూ నోటిఫికేషన్ల కోసం వేచి చూసే నిరుద్యోగులకు ఈ తీర్పు పెద్ద ఊరట. కారుణ్య నియామకాల వల్ల రోస్టర్ పాయింట్లు, బ్యాక్‌లాగ్ ఖాళీలు నిండిపోవడం వల్ల మెరిట్ ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరుగుతోంది. ‘ప్రతిభకు గౌరవం దక్కని చోట పాలన కుంటుపడుతుంది’ అనే నిజాన్ని కోర్టు గుర్తు చేసింది.

కారుణ్య నియామకాలు పూర్తిగా రద్దు చేయాలని ఎవరూ కోరుకోవడం లేదు. కానీ, అది ఒక 'అడ్డదారి' కాకూడదు. మానవత్వం ఉండాలి, కానీ అది మెరిట్‌ను మింగేయకూడదు. ప్రభుత్వం రూపొందించబోయే కొత్త మార్గదర్శకాలు చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి భరోసానిస్తూనే, కష్టపడి చదివే నిరుద్యోగులకు న్యాయం చేసేలా ఉండాలి. అప్పుడే పాలనలో నాణ్యత, సమాజంలో సమానత్వం సాధ్యమవుతాయి.

Tags:    

Similar News