ఏపీలో 'తుఫాన్' రాజ‌కీయం.. స‌ర్కారు చేతులెత్తేసింద‌ట‌!

ఈ వ్య‌వ‌హారాల‌పై కొన్నాళ్లుగా ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపుతున్నా.. కొంద‌రి తీరు మాత్రం మార‌డం లేదు.;

Update: 2025-10-28 03:43 GMT

అయిన దానికీ కానిదానికీ రాజ‌కీయ కార్డు వాడేయ‌డం.. ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అదిగో పులి అంటే.. ఇదిగో తోక‌.. అన్న చందంగా సోష‌ల్ మీడియా చేస్తున్న హడావుడి.. ఇటు స‌ర్కారును అటు ప్ర‌జ‌ల‌ను కూడా ఇబ్బంది పెడుతోంది. కందుకూరు హ‌త్య నుంచి క‌ర్నూలు బ‌స్సు ప్ర‌మాదం వ‌ర‌కు ప్ర‌జ‌ల మైండ్‌ను డైవ‌ర్ట్ చేసేలా కొంద‌రు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న‌ది స‌ర్కారు చెబుతున్న మాట‌. సోష‌ల్ మీడియా పేరుతో వదంతులు ప్ర‌చారంచేసి.. స‌ర్కారు పై నింద‌లు ప‌డేలా చేయ‌డం ఒక ఎత్త‌యితే.. మ‌రోవైపు.. ప్ర‌జ‌ల‌ను కూడా భ‌య భ్రాంతుల‌కు గురి చేయ‌డం మ‌రో ఎత్తు!.

ఈ వ్య‌వ‌హారాల‌పై కొన్నాళ్లుగా ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపుతున్నా.. కొంద‌రి తీరు మాత్రం మార‌డం లేదు. దీంతో స‌ర్కారు ఎప్ప‌టిక‌ప్పుడు.. ఫ్యాక్ట్ చెక్ పేరుతో వివ‌ర‌ణ ఇస్తోంది. కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో ఇలా కూడా చేయ‌లేని ప‌రిస్థితి నెల‌కొంటోంది. తాజాగా `మొంథా` తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల‌పై ప్ర‌భుత్వం పూర్తిగా దృష్టి పెట్టింది. కాకినాడ‌, విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, చిత్తూరు నెల్లూరు, బాప‌ట్ల జిల్లాల‌పై దీని ప్ర‌భావం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు చెప్పుకోద‌గ్గ (సోమ వారం రాత్రి 7 గంట‌ల స‌మ‌యానికి) వ‌ర్షం ప‌డ‌లేదు. అలాగ‌ని ప్ర‌భుత్వం ఉదాసీనంగా కూడా లేదు.

ఎక్క‌డిక‌క్క‌డ అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారం ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూనే ఉంది. ఫోన్లు.. సామాజిక మాధ్య‌మాల ద్వారా.. విప‌త్తు నిర్వ‌హ‌ణ, పోలీసు శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తున్నాయి. అయితే.. ఇంత చేస్తున్నా.. సోష‌ల్ మీడియాలో వ్య‌తిరేక ప్ర‌చారంమాత్రం ఆగ‌డం లేదు. గ‌తంలో 2014-15 మ‌ధ్య వ‌చ్చిన‌.. హుద్‌హుద్ తుఫాను, ఆ త‌ర్వాత‌.. వ‌చ్చితిత్లీ తుఫాను వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పెట్టి.. కూట‌మిప్ర‌భుత్వం చేతులు ఎత్తేసింది. ప్ర‌జ‌లు నానా అగ‌చాట్లు ప‌డుతున్నారంటూ.. వికృత ప్ర‌చారం చేస్తున్నారు. ఇలాంటి ప్ర‌చారాల‌తో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డే అవ‌కాశం ఉంటుంద‌న్న‌ది స‌ర్కారు చెబుతున్న‌మాట‌.

''వాస్త‌వాల‌ను ప్ర‌చారం చేయండి. ఇలాంటి న‌కిలీలు వ‌ద్దు బ్రో!'' అంటూ.. మంత్రి నారా లోకేష్ స్పందించే వ‌ర‌కు ఈ ప‌రిస్థితి వ‌చ్చిందంటే.. ఏ రేంజ్‌లో సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోందో అర్ధం చేసుకోవ‌చ్చు. నిజానికి గ‌త రెండు రోజులుగా మొంథా తుఫాను పై వార్త‌లు వ‌స్తున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు దాని ప్ర‌భావం స‌ముద్రానికి ప‌రిమిత‌మైంది. దీంతో ముందుగానే ఆయా ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌ను ప్ర‌భుత్వం పున‌రావాస‌కేంద్రాల‌కు త‌ర‌లించింది. అయినా.. న‌కిలీ ప్ర‌చారం మాత్రం ఆగ‌డం లేదు. గ‌తంలో కూలిపోయిన ఇళ్ల‌ను.. తుఫాను భీభ‌త్సానికి సంబంధించిన వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పెడుతూ.. ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సో.. ఈ విష‌యంలో అధికారిక స‌మాచారాన్ని మాత్ర‌మే విశ్వ‌సించాల‌ని స‌ర్కారు చెబుతోంది.

Tags:    

Similar News