అన్ని చోట్లా ఆర్టీజీఎస్ ..మొంథా అందించిన కొత్త థాట్ !
ఈ సమయంలో ప్రాణ నష్టం ఆస్తి నష్టం పెద్దగా లేకుండా ఏపీ బయటపడింది అంటే దానికి అతి ముఖ్య కారణం ఆర్టీజీఎస్ టెక్నాలజీ.;
మొంథా తుఫాన్ ఏపీని ఎంతలా గడగడలాడించిందో అందరికీ తెలిసిందే. ఈ సమయంలో ప్రాణ నష్టం ఆస్తి నష్టం పెద్దగా లేకుండా ఏపీ బయటపడింది అంటే దానికి అతి ముఖ్య కారణం ఆర్టీజీఎస్ టెక్నాలజీ. దీనినే ఫుల్ ఫార్మ్ లో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీగా పిలుస్తారు. మొంథా తుఫాన్ వేళ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్డేట్ చేయడమే కాదు జనాలకు అటు అధికార వ్యవస్థలకు దానిని అందించి మొంథా తీవ్రత ఎంత ఉన్నా ప్రజలు అంతా సురక్షితంగా ఉండేలా చేయగలిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా గంటల తరబడి ఆర్టీజీఎస్ సేవలను పర్యవేక్షించారు. అలాగే మంత్రి లోకేష్ కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్న కేంద్రంలో నిరంతరం పనిచేస్తూ మొత్తం అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేయగలిగారు.
జిల్లాలలో కూడా :
మొంథా తుఫాన్ విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు క్రైసిస్ మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నవి ఒక పాఠంగా కూడా అంతా చెబుతున్నారు ఒక పెను ఉపద్రవం సంభవించినపుడు దానిని తట్టుకుని నిలబడడమే కాకుండా తీవ్ర నష్టాన్ని ఏ విధంగా తగ్గించుకోగలం అన్నది తెలియచేయడానికి ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ ఎంతగానో ఉపకరించింది. చంద్రబాబు చెప్పినట్లుగా అయిదు కీలక అంశాలను పెట్టుకుని ముందుకు సాగారు. దాని వల్లనే మొంథా ఎంత వణికించినా కూడా చివరికి ఏపీ ఒడ్డున పడగలిగింది. ఈ స్పూర్తితో ఆర్టీజీఎస్ సెంటర్లను ఇక మీదట జిల్లా స్థాయిలో కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం వేగంగా ముందుకు కదులుతోంది.
ఉమ్మడి జిల్లాలే కేంద్రాలు :
ఇక ఆర్టీజీఎస్ సెంటర్లకు ఏపీలోని పదమూడు ఉమ్మడి జిల్లాలే ప్రధాన కేంద్రాలుగా ఉండబోతున్నాయి. అంటే పాత జిల్లా కేంద్రాలు అన్న మాట. ఆయా కేంద్రాలలో ఆర్టీజీఎస్ సెంటర్లను ఏర్పాటు చేసి వాటికి అవసరమైన పూర్తి సాంకేతిక సదుపాయాలను కల్పిస్తారు. అంతే కాదు అక్కడకు అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన సమాచారాన్ని కూడా అనుసంధానం చేస్తారు. ఈ జిల్లాలలో ఆర్టీజీఎస్ కేంద్రాలలో పూర్తి పర్యవేక్షణ బాధ్యట ఆయా జిల్లాల కలెక్టర్లు చూస్తారు.
అత్యంత కీలకంగా :
ఈ ఆర్టీజీఎస్ కేంద్రాలు రాష్ట్ర స్థాయి కేంద్రానికి పూర్తిగా అనుసంధానించబడతాయి. దాంతో అక్కడి సమాచారాని పంచుకోవడంతో పాటు జిల్లా స్థాయిలో జరిగే పరిస్థితులు పరిణామాలు ఎప్పటికపుడు వచ్చే సమాచారాన్ని క్రోడీకరిస్తూ ప్రకృతి విపత్తుల వేళ ఆయా జిల్లాలలో ప్రజలకు రక్షించేందుకు మరింత వేగంగా చర్యలు తీసుకుంటారు. ఆ విధంగా చేసేందుకు ఈ జిల్లా స్థాయిలో ఆర్టీజీఎస్ కేంద్రాలు ఉపయోగపడతాయని అంటున్నారు. అంతే కాకుండా ఈ జిల్లా స్థాయి ఆర్టీజీఎస్ కేంద్రాలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది. అదే విధంగా సీసీటీవీ డేటా సెంటర్ అలాగే జిల్లా రియల్‌టైమ్ గవర్నెన్స్, ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్ జిల్లాస్థాయి నెట్‌వర్క్ సెంటర్ వంటివి ఉంటాయి. విపత్తు వేళలలో ఆయా జిల్లాల , కలెక్టర్, ఎస్పీలు పరిస్థితులను ఎప్పటికపుడు సమీక్షించేందుకు సమావేశ మందిరం సైతం ఇక్కడ ఏర్పాటు చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి ఒక రోల్ మోడల్ గా అన్ని ప్రభుత్వ సేవలను అనుసంధానం చేస్తూ నిరంతరం పనిచేసే కేంద్రాలుగా ఈ జిల్లా ఆర్టీజీఎస్ సెంటర్లను తీర్చిదిద్దుతున్నారు.
అద్భుతంగా అక్కడ :
ఇక రాష్ట్ర స్థాయిలో పనిచేసే ఆర్టీజీఎస్ కేంద్రాన్ని మరింత అద్భుతంగా రూపొందిస్తున్నారు. ఇపుడు ఉన్న దానికి మరిన్ని కొత్తదనం చేకూరుస్తూ సిద్ధం చేస్తున్నారు. సీఎం ఆఫీస్ ఆర్టీజీఎస్ సెంటర్ కూడా అనుసంధానీకరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక మీదట ఏ రకమైన విపత్తు వచ్చినా రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలలో ఆర్టీజీఎస్ పటిష్టంగా పనిచేసి మరింత బెస్ట్ గా రిజల్ట్ ని ఇస్తుందని చెబుతున్నరు. ఈ కేంద్రాలను అన్నీ సాధ్యమైనంత త్వరలోనే పూర్తి చేసి అక్కడ ఆపరేషన్స్ ని స్టార్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని చెబుతున్నారు.