ఉద్యోగుల ఆరోగ్య పథకంలో ఇబ్బందులు.. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల కోసం అమలు చేస్తున్న ఎంప్లాయిస్ హెల్త్ కార్డ్స్ స్కీం ( ఇహెచ్ఎస్) నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.;
ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల కోసం అమలు చేస్తున్న ఎంప్లాయిస్ హెల్త్ కార్డ్స్ స్కీం ( ఇహెచ్ఎస్) నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులతో ఇటీవల ఈ విషయంపై చర్చించిన ప్రభుత్వం.. సమస్యలను నివారించే మార్గాలను అన్వేషించేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విషయంపై గతనెలలో ఉద్యోగ సంఘాలకు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చేదిశగా చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇహెచ్ఎస్ అమలుకు సంబంధించి కొన్ని సమస్యల్ని ఉద్యోగ సంఘాల నాయకులు గతనెలలో మంత్రుల కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలోనూ ఇదే సమస్యను ప్రస్తావించారు. వారు లేవనెత్తిన అంశాల పరిష్కారిస్తామని సీఎం అప్పట్లోనే హామీ ఇచ్చారు. సమస్యలను పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని గతనెలలోనే ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నేతృత్వం వహించే ఈ కమిటీలో జీఏడీ విభాగం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి, వ్యయ విభాగం కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఉద్యోగ సంఘాల నుంచి ఇద్దరు ప్రతినిధులను సభ్యులుగా నియమిస్తూ వైద్యశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ 8 వారాల్లో ఇహెచ్ఎస్ పటిష్ట అమలుపై నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
2013లో ఉమ్మడి రాష్ట్రంలో ఇహెచ్ఎస్ పథకం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పథకం కింద 23 లక్షల 58 వేల మంది లబ్దిదారులు ఉన్నారు. 5.53 లక్షల ఉద్యోగులు, 2.29 లక్షల పింఛనుదారుల కుటుంబ సభ్యులు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతున్నారు. ఈ పథకంపై అయ్యే ఖర్చులో ప్రభుత్వం, లబ్దిదారులు చెరి సగం భరిస్తారు. సాలీనా దాదాపు రూ.350 కోట్ల మేర ఖర్చవుతోంది. అయితే గతంలో ప్రభుత్వం నుంచి సరైన స్పందన ఉండకపోవడం వల్ల ఉద్యోగులు, పింఛన్ దారుల కుటుంబ సభ్యులు ఈహెచ్ఎస్ పథకం ద్వారా వైద్యం చేయించుకోవడం గగనమవుతోందని ఫిర్యాదు చేశారు.
వైద్య సేవల కోసం చేసిన ఖర్చును సకాలంలో చెల్లించకపోవడం, వివిధ వ్యాధుల ప్యాకేజీ ధరలను పెంచకపోవడం, ఈహెచ్ఎస్ కింద సేవలందించడానికి ఆసుపత్రుల నిరాసక్తత, పర్యవేక్షణ లోపం, ఫిర్యాదులను పరిష్కారించకపోవడం, ఇహెచ్ఎస్ అమలుకోసం వినియోగిస్తున్న ఆన్‌లైన్ పోర్టల్ పరిమిత సామర్ధ్యం మొదలైనవి సమస్యల వల్ల సత్వర, నాణ్యమైన సేవలు అందడం లేదని అంటున్నారు. దీంతో వీటిపై అధ్యయనం చేసి పరిష్కారానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. లబ్దిదారుల అనుభవాలు, సమస్యలు, లోపాలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటి పరిష్కార మార్గాలపై 8 వారాల్లో నివేదిక సమర్పించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు.