మొత్తం 33 ప్రశ్నలకూ జవాబు చెప్పి తీరాల్సిందే !
ప్రపంచంలోనే అతిపెద్ద గణాంక కార్యక్రమమైన డిజిటల్ జనగణన 2027 కి ఆంధ్ర ప్రదేశ్ లో రంగం సిద్ధం అయింది.;
ప్రపంచంలోనే అతిపెద్ద గణాంక కార్యక్రమమైన డిజిటల్ జనగణన 2027 కి ఆంధ్ర ప్రదేశ్ లో రంగం సిద్ధం అయింది. ఏప్రిల్ 16 నుంచి మొదలవుతోంది. ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర డేటా సేకరణకు శ్రీకారం చుడుతున్నారు. 16 నుంచి మొదటి దశగా ఇండ్ల జాబితా ఇండ్ల గణన రాష్ట్రంలో ప్రారంభం అవుతోంది. పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడటం ఈసారి విశేషం. అంతే కాదు స్వీయ గణన సదుపాయం కల్పించడం మరో ప్రత్యేకతగా ఉంది. అంటే ఎవరికి వారుగా సొంతంగా ఆన్ లైన్ లో జన గణనను చేసుకోవచ్చు. ఇది మంచి ఆప్షన్ గా ఉంటుంది.
రాజ్యాంగ అనివార్యత :
భారతదేశంలో జనగణన అన్నది ఒక సాధారణ కార్యక్రమం కాదు ఇది ఒక రాజ్యాంగబద్ధమైన అనివార్యతగా ఉంటోంది. రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌లో 69వ అంశంగా జనాభా గణనను పేర్కొన్నారు. 1948 జనగణన చట్టం 1990 నియమాల ప్రకారం ఇది దేశవ్యాప్తంగా నిర్వహించబడుతోంది. ఈ విధంగా సేకరించిన వ్యక్తిగత సమాచారం సెక్షన్ 15 ప్రకారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుంది. దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో ఈ ప్రక్రియ అమలు చేయబడుతోంది. ఇక దేశంలో చూసుకుంటే 2011లో చివరి జనగణన నిర్వహించబడగా 2027 లో జరగబోయేది 16వదిగా ఉంది. ఇక దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నిర్వహించే ఎనిమిదవ జనాభా గణనగా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి
ప్రజలు సహకరించాలి :
ఇక జనాభా లెక్కల కోసం ఇంటికి వచ్చే అధికారులకు వారు అడిగిన వివరాలను అందిస్తూ ప్రజలు సహకరించాలని కోరుతున్నాను. సెక్షన్-8 ప్రకారం ప్రతి వ్యక్తి జనాభా లెక్కల అధికారి అడిగే ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సెక్షన్-9 ప్రకారం అధికారులు జనాభా లెక్కల కోసం ఇళ్లకు వచ్చినప్పుడు యజమానులు వారిని లోపలికి అనుమతించాలి, అంతే కాదు అవసరమైన గుర్తులు అక్షరాలు లేదా సంఖ్యలను వారి ఇంటి గోడలపై వేసేందుకు అనుమతివ్వాలి. సెక్షన్-11 ప్రకారం నిబంధనలను ఉల్లంఘించిన వారిపై జరిమానాలు ఇతర చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అలాగే విధులను సక్రమంగా నిర్వహించని అధికారులకు జరిమానా లేదా జైలుశిక్ష విధిస్తారు.
ఇవీ ప్రశ్నలు :
ఇదిలా ఉంటే ఏప్రిల్ 16 నుండి 30 ప్రజలు ఎవరికి వారు స్వంతంగా వివరాలు నమోదు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. ఇక మే 1 నుండి ఎన్యూమరేటర్ ఇళ్లకు వచ్చి వివరాలు సేకరిస్తారు. ఆన్ లైన్ లో అయినా అధికారులు ఇళ్ళకు వచ్చినా అడిగే ప్రశ్నలు ఇలా ఉంటాయి. 1. ఇంటి నంబరు, 2. జనగణన జాబితాలో కేటాయించిన సంబరు, 3. ఇంటిలో ఫ్లోర్ కు వాడిన మెటీరియల్, 4. ఇంటి గోడల నిర్మాణంలో ప్రధానంగా వాడిన మెటీరియల్, 5. ఇంటి పైకప్పులో వాడిన మెటీరియల్, 6. ఇంటిని ఎలా వాడుతున్నారు అంటే రెసిడెన్షియల్ గానా, పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా లేదా ఖాళీగా ఉందా అన్న వివరాలు ఇవ్వాలి. 7. ఇల్లు ఆవాస యోగ్యంగా ఉందా శిథిలావస్థలో ఉందా అన్నది చెప్పాలి. 8. కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత, 9. ప్రస్తుతం ఇంట్లో ఉంటున్న వారెంతమంది, 10. ఇంటి పెద్ద పేరు, 11. ఇంటి పెద్ద మహిళా లేదా పురుషుడా, 12. ఇంటి పెద్ద ఎస్సీ, ఎస్టీ లేదా ఇతర సామాజిక వర్గానికి చెందినవారా, 13. ఉంటున్న ఇల్లు సొంతమా లేదా అద్దె ఇల్లా, 14. ఇంట్లో ఎన్ని గదులు వాడుకుంటున్నారు, 15. ఇంట్లో పెళ్లయిన జంటలు ఎన్ని ఉన్నాయి, 16. తాగునీటి కోసం ప్రధానంగా దేనిపై ఆధారపడుతున్నారు, 17. తాగునీటి వనరులు అందుబాటులో ఉన్నాయా, 18. ఇంట్లో విద్యుత్ అవసరాలకు ఏ వనరులు ఉపయోగిస్తున్నారు. విద్యుత్, సోలార్ విద్యుత్, ఇతర మార్గాలు, 19. మరుగుదొడ్లు ఇంట్లోనే ఉన్నాయా, 20. ఏ రకమైన మరుగుదొడ్లు ఉన్నాయి, 21. ఇంటికి డ్రైనేజీ వ్యవస్థ ఉందా, 22. బాత్రూం లకు పైకప్పు ఉందా, డ్రైనేజీ ఉందా, 23. కిచెన్ ఉందా ఎల్పీజీ/పీఎనీ వాడుతున్నారా, 24. వంటకోసం ప్రధానంగా వాడే ఇంధనం, 25. రేడియో/ట్రాన్సిస్టర్ ఉందా, 26. టీవీ ఉందా, 27. ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, 28. ల్యాప్ టాప్ /కంప్యూటర్లు ఉన్నాయా, 29. టెలిఫోన్/మొబైల్ ఫోన్, /స్మార్ట్ ఫోన్ ఏవి ఎన్ని ఉన్నాయి, 30. ద్విచక్ర వాహనాలు ఏవేవి ఉన్నాయి, 31. కారు/జీవు/వ్యాన్ ఉన్నాయా ఉంటే ఎన్ని ఉన్నాయి, 32 ఇంట్లో ప్రధానంగా తినే ధాన్యాలు ఏమిటి, 33. ఫోన్ నంబరు ఏమిటి. ఈ విధమైన ప్రశ్నలు అన్నింటికీ ప్రతీ కుటుంబం తప్పనిసరిగా జవాబు చెప్పాల్సి ఉంటుంది.