ప్రైవేట్ బస్సులకు ఏపీ షాక్.. గంటకు 80కి.మీ. దాటితే తాట తీస్తారంతే
ఒకటి తర్వాత ఒకటి చొప్పున జరుగుతున్న ప్రైవేటు బస్సుల ప్రమాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు వీలుగా ఏపీ సర్కారు సీరియస్ చర్యలు చేపట్టింది.;
ఒకటి తర్వాత ఒకటి చొప్పున జరుగుతున్న ప్రైవేటు బస్సుల ప్రమాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు వీలుగా ఏపీ సర్కారు సీరియస్ చర్యలు చేపట్టింది. ఇటీవల కాలంలో ఏపీలోని కర్నూలు జిల్లాతో పాటు.. మార్కాపురంలో ప్రైవేటు ట్రావెల్ బస్సుల ప్రమాదాల కారణంగా అమాయకులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయిన వైనం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రైవేటు బస్సులు ఏవైనా సరే.. గంటకు 80కి.మీ. వేగ పరిమితిని దాటితే తాట తీసే ప్రోగ్రాంకు తెర తీశారు.
ప్రైవేటు బస్సుల అతి వేగంతో ఇటీవల కాలంలో పెను ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు వీలుగా నిబంధనల పుస్తకాల దుమ్ము దులిపిన ఏపీ రవాణా శాఖ.. వాటి వేగానికి నియంత్రణ చర్యలను చేపట్టింది. ఏ బస్సు అయినా సరే గంటకు 80కి.మీ. గరిష్ఠ వేగాన్ని దాటకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గంటకు 120 - 130 కి.మీ. వేగంతో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే.
ఏపీ వ్యాప్తంగా ఆలిండియా టూరిస్ట్ పర్మిట్ ఉన్న ట్రావెల్ బస్సులు.. ఏపీ మీదుగా ప్రయాణించే బస్సులు మొత్తంగా 1800లుగా ఉన్నట్లు అధికారుల అంచనా. ఇందులో ఇప్పటికే 1660 బస్సులకు ట్రాక్ చేయటం షురూ చేశారు. దీంతో గంటకు 50-60 కి.మీ. వేగం మొదలు ప్రతి పదికిలోమీటర్ల వేగానికి ఒక విభాగంగా చేపట్టి వేగాన్ని ట్రాక్ చేసేలా ప్రోగ్రాం డిజైన్ చేశారు. దీంతో.. ఒక బస్సు ఎంతెంత వేగంతో ప్రయాణించిందన్న విషయం తెలుస్తుంది. ఒకవేళ.. రవాణా శాఖ అధికారులు నిర్దేశించిన 80కి.మీ. వేగాన్ని దాటినట్లుగా గుర్తిస్తే.. ఆ బస్సుల్ని సీజ్ చేసి.. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ కు పంపించి.. దాని స్పీడ్ కంట్రోల్ టూల్ పని చేస్తుందా? లేదా?అన్నది చెక్ చేస్తారు.ఒకవేళ పని చేయకుంటే కేసు నమోదు చేస్తారు.
ఇలా ప్రతి బస్సును ఏపీలో ప్రయాణం మొదలైప్పటికి నుంచి వాటి గమ్యస్థానం చేరే సమయం మొత్తాన్ని ట్రాక్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ సరిహద్దు దాటేసి వేరే రాష్ట్రానికి వెళ్లే బస్సులు.. ఆయా రాష్ట్రాల్లో వేగ పరిమితుల్ని దాటేసినా.. కేసులు బుక్ చేస్తున్నారు. ఎందుకంటే తిరుగు ప్రయాణంలో మళ్లీ ఆ బస్సులన్ని ఏపీకి తిరిగి రావాల్సిందే. ఈ క్రమంలో బస్సులకు వేగ పరిమితి విధించటంతో ఘోర ప్రమాదాలకు చెక్ పెట్టొచ్చు. కాకుంటే.. వేగం తగ్గిన కారణంగా ప్రయాణ సమయం మరింత పెరుగుతుంది. కాకుంటే.. భద్రత పెరగటం మంచి పరిణామంగా చెబుతున్నారు.
గతంలో అధికారులు తనిఖీలు చేసే సమయంలో నిబంధనల ప్రకారం వాహనాన్ని నడిపేలా చేసి.. ఆ తర్వాత మళ్లీ షరా మామూలే అన్నట్లు వ్యవహరించేవారు. ఇప్పుడు అన్ని బస్సుల్లోనూ ప్రత్యేక పరికరాన్ని ఏర్పాటు చేయటం.. దాన్ని ట్రాక్ చేయటంతోప్రైవేటు బస్సుల వేగానికి ముకుతాడు పడినట్లైంది. దీని కోసం రవాణా శాఖ కమిషనరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేసి.. ప్రతి బస్సును ట్రాక్ చేస్తున్నారు. ఇదే విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తే.. రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టే అవకాశం ఉంది. మరి.. రేవంత్ సర్కారు ఈ అంశంపై ఫోకస్ చేస్తుందా? అన్నది చూడాలి.