ఇంట్రస్టింగ్.. ఎమ్మెల్సీల రాజీనామాలపై ఏ నిర్ణయం తీసుకుంటారు?

వైసీపీ నుంచి ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల రాజీనామాలపై సోమవారం మండలి చైర్మన్ మోషేన్ రాజు విచారణ జరిపారు.;

Update: 2025-12-01 17:26 GMT

వైసీపీ నుంచి ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల రాజీనామాలపై సోమవారం మండలి చైర్మన్ మోషేన్ రాజు విచారణ జరిపారు. సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయడం వెనుక ఎవరైనా ఒత్తిడి ఉందా? అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే తమ రాజీనామాలకు ఎవరి ఒత్తిడి లేదని స్వచ్ఛందంగా పదవులు వదులుకోవాలని నిర్ణయించుకున్నామని ఐదుగురు ఎమ్మెల్సీలు స్పష్టం చేయగా, తాను రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం తెలిపారు. దీంతో వైసీపీకి రాజీనామా చేసి తమ సభ్యత్వాలను వదులుకున్న ఎమ్మెల్సీల ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ చైర్మన్ జకియా ఖానంతో సహా ఆరుగురు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. వీటిని ఆమోదించాలని చైర్మన్ మోషేన్ రాజును అనేకసార్లు కోరారు. అయితే ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడంలో చైర్మన్ తాత్సారం చేస్తూ వస్తున్నారు. దీంతో రాజీనామా చేసిన ఎమ్మెల్సీల్లో ఒకరైన జయమంగళం వెంకటరమణ చైర్మన్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం సభ్యుడు రాజీనామా చేసినా ఆమోదించకపోవడం అంటే అతడి హక్కులను హరించినట్లేనంటూ అభిప్రాయపడింది. రాజీనామాపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని చైర్మన్ ను సూచించింది.

ఈ నేపథ్యంలో పదవులకు రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌, జయమంగళ వెంకటరమణ, జాకియా ఖానం, పోతుల సునీతతో చైర్మన్ భేటీ అయ్యారు. రాజీనామాలకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. తక్కువ పదవీకాలం ఉన్నందున రాజీనామాలు వెనక్కి తీసుకోవాలంటూ కొందరికి సూచించారని సమాచారం. అయితే ఈ విషయంలో తాము వెనక్కి తగ్గేదేలేదని ఐదుగురు ఎమ్మెల్సీలు చైర్మనుకు తేల్చిచెప్పారని అంటున్నారు. డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం మాత్రం తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వైసీపీ నుంచి ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీలు.. ఆ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీ కూటమిలోకి వెళ్లే ఆలోచనతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఒక్కక్కరు ఒక్కోసారి ఈ రాజీనామాలు చేసినా, ఇంతవరకు ఏ ఒక్కరిది చైర్మన్ ఆమోదించలేదు. దీంతో రాజీనామాలు ఆమోదించాల్సిందిగా పలుమార్లు చైర్మనుపై సభ్యులు ఒత్తిడి తీసుకువచ్చారు. రాజీనామాలు చేసిన జకియా ఖానం, పోతుల సునీత బీజేపీలో చేరగా, జయమంగళం వెంకటరమణ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మిగిలిన ముగ్గురు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. దీంతో వారు తమ పదవులకు చేసిన రాజీనామాలు ఆమోదించాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చైర్మన్ మోషేన్ రాజు ఇప్పటికైనా తుది నిర్ణయం తీసుకుంటారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.

Tags:    

Similar News