కీలక నిర్ణయాల దిశగా కేబినెట్ మీట్

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం నిర్వహిస్తున్నారు.;

Update: 2025-12-11 04:05 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ మంత్రివర్గ సమావేశంలో ఈసారి అనేకమైన అంశాలు ముందుకు రానున్నాయి. దాంతో పాటు పలు కీలక నిర్ణయాలను కూడా కేబినెట్ తీసుకోనుంది అని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తో పాటు మంత్రులు అంతా ఈ సమావేశానికి హాజరు కానున్న నేపధ్యంలో ఈసారి మీట్ ఎంతో ఆసక్తిని పెంచుతోంది.

అమరావతి కోసం :

ఈసారి మంత్రివర్గ సమావేశంలో ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి నాబార్డు నుంచి ఏకంగా 7 వేల 380 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు రాష్ట్ర మంత్రివర్గం సీఆర్డీఏకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అంతే కాకుండా సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధించే పనులకు సైతం 532 కోట్ల రూపాయల మేర కేటాయింపులు చేస్తూ ఆమోదం తెలియచేస్తారు అని అధికార వర్గాల సమాచారంగా ఉంది.

భారీగా భూ కేటాయింపులు :

అదే సమయంలో రాష్ట్రంలోని పలు సంస్థలకు పెద్ద ఎత్తున భూ కేటాయింపులు చేసేందుకు కూడా రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదముద్ర వేయనుంది అని అంటున్నారు. ఇక ఈ మధ్యనే రాజ్ భవన్ లను లోక్ భవన్ లుగా కేంద్ర ప్రభుత్వం మార్పు చేసింది. ఈ క్రమంలో .169 కోట్ల రూపాయలతో లోక్ భవన్ పేరుతో గవర్నర్ బంగ్లా నిర్మాణానికి టెండర్లు పిలిచే అంశంపైనా రాష్ట్ర మంత్రి వర్గం చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అంటున్నారు. అలాగే మరో 163 కోట్ల రూపాయలతో జ్యుడిషియల్ అకాడమీకి పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుందని భోగట్టా.

వేల కోట్ల పెట్టుబడులకు :

ఇక ఇదే మంత్రి వర్గ సమావేశంలో 2024-25 వార్షిక నివేదికలు ఇచ్చేందుకు కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే రాష్ట్రంలో 20 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులకు ఆమోద ముద్ర వేయడంతో పాటు వాటి ద్వారా కొత్తగా 56 వేల ఉద్యోగాలు కల్పనకు సైతం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు అని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈసారి మంత్రి వర్గ సమావేశంలో ఇంకా కీలక నిర్ణయాలు అనేకం ఉన్నాయని అంటున్నారు

Tags:    

Similar News