ఆటో పధకం...అందరికీ అందినట్లేనా ?
ఇదే మాటను వైసీపీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని అంటూ నిలదీస్తున్నారు. ఏపీలో 2023లో పదమూడు లక్షల మంది ఉంటే ఇపుడు మరో లక్ష దాకా ఆటో కార్మికులు పెరిగారు అన్నారు.;
ఏపీలో దసరా తరువాత కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల కోసం తాము ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఒక పధకం తీసుకుని వచ్చింది. వైసీపీ హయాంలో పది వేల రూపాయలు ఆర్ధిక సాయం చేస్తే దానిని పదిహేను వేల రూపాయలుగా పెంచి మరీ అందించింది. ఈ పధకాన్ని విజయవాడలో ఆర్భాటంగా కూటమి ప్రభుత్వం పెద్దలు లాన్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ పీవీఎన్ మాధవ్ ఈ పధకాన్ని కలసి ప్రారంభించారు. అందరూ ప్రసంగాలు కూడా చేసారు.
ఎంత మంది ఉన్నారంటే :
ఏపీలో ఆటో కార్మికులు ఎంత మంది అంటే ఒక అంచనా ప్రకారం పదమూడు లక్షల దాకా అని అంటున్నారు. ఇది ఇపుడు లెక్క కాదు 2023లో నారా లోకేష్ యువగళం పాదయాత్రగా చెప్పిన ముచ్చట. ఆయన ఆటో కార్మికులతో సమావేశం జరిపినపుడు నాటి వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. ఏపీలో 13 లక్షలకు పైగా ఆటో కార్మికులు ఉంటే పదవ శాతం కూడా వారికి ఆర్థిక సాయం చేయడం లేదని నిందించారు. తాము అధికారంలోకి వస్తే మొత్తం ఆటో కార్మికులకే కాకుండా టిప్పర్, హెవీ వెహికిల్స్ ని నడిపే అందరి కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని ఇపుడు వైసీపీ గుర్తు చేస్తూ మా కన్నా ఎక్కువ ఏమి ఇచ్చారు అని విమర్శిస్తోంది.
మిగిలిన వారి సంగతేంటి :
ఇదే మాటను వైసీపీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని అంటూ నిలదీస్తున్నారు. ఏపీలో 2023లో పదమూడు లక్షల మంది ఉంటే ఇపుడు మరో లక్ష దాకా ఆటో కార్మికులు పెరిగారు అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం తమ కంటే పదహారు వేల మందికి మాత్రమే ఎక్కువ ఇచ్చిందని చెప్పారు తమ హయాంలో రెండు లక్షల 76 వేల మంది దాకా ఇస్తే ఇపుడు కూటమి ప్రభుత్వం రెండు లక్షల తొంబై మూడు వేల మంది దాకా ఇచ్చిందని అన్నారు. మరి కూటమి పెద్దలు ఇచ్చిన హామీ మేరకు మిగిలిన వారి సంగతి ఏమిటి అని ప్రశ్నించారు. చాలా మందిని నిబంధనలు పేరు చెప్పి ఆపేశారు. ఆటో డ్రైవర్ ఓనర్ ఒకరే అయి ఉంటేనే నగదు ఖాతాలో వేశారు అని అన్నారు. అలాగే పెళ్ళి అయిన ఆటో డ్రైవర్ కి ఈ పధకం వర్తించలేదని ఎత్తి చూపించారు. ఆ ఇంట్లో తమ్ముడి పేరు మీదనో లేక తండ్రి పేరు మీదనో ఆటో ఉన్నా కూడా ఈ పధకం అసలైన డ్రైవర్ కి వర్తించలేదని అయన విమర్శించారు. వారు పండుగ చేసుకోవాలని కూటమి సర్కార్ కి లేదా అని ఆయన అంటున్నారు.
రోడ్లు చూపిస్తారట :
కూటమి ప్రభుత్వంలో కొన్ని ప్రధాన రోడ్లు బాగుంటే అంతా ఓకేనా అని పేర్ని నాని అంటున్నారు. తనతో వస్తే ఎక్కడికైనా పాడైన రోడ్లు చూపిస్తామని ఆయన సవాల్ చేస్తున్నారు. ఆ రోడ్లపైన ఆటోలలో ప్రయాణిస్తే కనుక కచ్చితంగా ఎవరైనా ఆసుపత్రి పాలు అవుతారని కూడా ఆయన చెబుతున్నారు. మొత్తం మీద ఆటో డ్రైవర్లకు పండుగ అని కూటమి అంటూంటే కాదు దండుగ అని పేని నాని చెబుతున్నారు. ఆయన అన్నారని కాదు కానీ వైసీపీ హయాంలో అయినా కూటమి జమానాలో అయినా మొత్తం ఆటో కార్మికులకు ఎపుడూ ఆర్ధిక సాయం దక్కడం లేదని అంటున్నారు. మరి అందరికీ ఇవ్వాలంటేనే పధకం అమలు చేయాలి కానీ కొందరికి ఇస్తూ అందరినీ పండుగ చేసుకోమనడం గత ప్రభుత్వానికి అయినా ప్రస్తుత ప్రభుత్వానికి అయినా తగునా అని ప్రశ్నిస్తున్నారు.