మరోసారి.. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు.. రీజన్ ఇదే!
తాజాగా శుక్రవారం సాయంత్రం ఎన్డీయే కూటమి పార్టీల నాయకులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు.;
ఏపీ అసెంబ్లీ మరోసారి ప్రత్యేకంగా భేటీ కానుంది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఈ నెల ఆఖరు లేదా.. మే తొలివారంలో అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరచాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇలా.. కేవలం నెల రోజుల వ్యవధిలోనే అసెంబ్లీని ప్రత్యేకంగా కొలువు దీర్చడం ఇది రెండోసారి. గత నెల చివరిలో అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై చర్చించేందుకు అసెంబ్లీని సమావేశ పరిచారు. బడ్జెట్ సమావేశాల అనంతరం.. ప్రత్యేకంగా నిర్వహించిన ఈ సభలో రాజధాని చట్టబద్ధతపై సభ్యులు చర్చించారు. అనంతరం బిల్లును కేంద్రానికి పంపించడం.. పార్లమెంటు ఆమోదించడం తెలిసిందే.
ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి ప్రత్యేకంగా అసెంబ్లీని కొలువు దీర్చాలని చంద్రబాబు నిర్ణయించారు. తాజాగా శుక్రవారం సాయంత్రం ఎన్డీయే కూటమి పార్టీల నాయకులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ కాన్ఫరెన్సులో టీడీపీ ఎమ్మె ల్యేలు, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల కీలక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు.. ఇటీవల పార్లమెంటులో వీగిపోయిన మహిళా బిల్లు.. వెనుక కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి కుట్ర ఉందని పేర్కొన్నారు. దీనిని ప్రజలకు మరింత అర్ధమయ్యేలా చెప్పాలన్న ఉద్దేశంతోనే అసెంబ్లీ సమావేశాలను ప్రత్యేకంగా నిర్వహించా లని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.
డీలిమిటేషన్ అనేది కేవలం ఇండియా కూటమిపార్టీలు లేవనెత్తిన వంకేనని చంద్రబాబు ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా 50 శాతం మేరకు సీట్లు పెంచేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని.. ఈ విషయాన్ని సభలోనే కేంద్ర మంత్రి అమిత్ షా సైతం ప్రకటించారని గుర్తు చేశారు. అయినప్పటికీ.. మహిళలకు అన్యాయం చేసేలా ఇండియా కూటమి పార్టీలు వ్యవహరించారని విమర్శించారు. 1996 నుంచి కూడా మహిళలకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీనే కారణమని పేర్కొన్నారు. అప్పట్లో రాజ్యసభలో ఆమోదించిన బిల్లును లోక్‌సభకు తీసుకురాకుండా కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడిందన్నారు.
ఇప్పుడు ఉభయసభల్లోనూ ఆమోదం పొందాల్సిన బిల్లును ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుందని కాంగ్రెస్‌పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఈ విషయాలన్నీ ప్రజలకు అర్ధమయ్యేలాచెప్పాల్సిన బాధ్యత ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఆది నుంచి టీడీపీ, బీజేపీలు మహిళలకు న్యాయం చేస్తున్నాయన్నారు. సుష్మా స్వరాజ్‌కు బీజేపీ జాతీయ స్థాయి పదువులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఇక, టీడీపీ అధికారంలో ఉన్నా..లేకపోయినా మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మహిళల రిజర్వేషన్‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు కూడా నిర్వహించాలని పార్టీలకు ఆయన పిలుపునిచ్చారు.