జగన్ ని ధిక్కరించి వారంతా అసెంబ్లీకి ?
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం అవుతాయని ప్రచారంలో ఉంది.;
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం అవుతాయని ప్రచారంలో ఉంది. దాదాపుగా ఆ తేదీనే ఖాయం చేస్తారు అని అంటున్నారు. ఒక పది రోజుల పాటు వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కీలక బిల్లుల ఆమోదం తీసుకోవాలని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోంది. తిరిగి డిసెంబర్ లో శీతాకాల సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అది కాదనుకుంటే ఏకంగా మార్చిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు అని అంటున్నారు. ఏ విధంగా చూసినా ఈ వర్షాకాల సమావేశాలకు ముఖ్యమైనవి అని అంటున్నారు. దాంతో ప్రాధాన్యత ఏర్పడింది.
వైసీపీ డిమాండ్ అదే :
ఇదిలా ఉంటే అసెంబ్లీకి వస్తే అనేక సమస్యల మీద అక్కడే చర్చ జరపవచ్చు అని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా వైసీపీకి సవాల్ చేశారు. బయట మీడియా ముందు కాదు అని అసెంబ్లీ లోనే అన్నీ మాట్లాడుకోవచ్చు అని ఆయన అంటున్నారు. అయితే వైసీపీ మాత్రం తమకు ప్రతిపక్ష హోదా ఇస్తీఅ సభకు వస్తామని చెబుతోంది అసెంబ్లీలో ఉన్న ఏకైక పార్టీగా తాము ఉన్నామని అందుకే హోదా ఇవ్వాలని అంటోంది. అయితే నిబంధనలు మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉన్నాయని స్పీకర్ చెబుతున్నారు. చంద్రబాబు సైతం ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఓడిస్తే మేము ఎలా ఇస్తామని ప్రశ్నించారు. కనీసం 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా అని వైసీపీకి 11 సీట్లు వస్తే హోదా ఎలా అని ఆయన నిలదీశారు.
ఎమ్మెల్యేలకు వేటు భయం :
ఇదిలా ఉంటే ప్రభుత్వం స్టాండ్ క్లియర్ గా ఉంది. వైసీపీ డిమాండ్ నుంచి అయితే వెనక్కి పోవడం లేదు. దాంతో అసెంబ్లీకి ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యేలు సభ ముఖం చూడకుండానే తన శాసన సభ్యత్వాలు రద్దు అవుతాయా అన్న భయంతో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఈసారి వైసీపీ నుంచి గెలిచిన 11 మందిలో జగన్ తో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకానాధ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, బాల నాగిరెడ్డి వంటి వారు తప్పించి మిగిలిన వారు అంతా కొత్త వారే అని అంటున్నారు. కొత్తగా అసెంబ్లీకి నెగ్గిన వారు అయితే అరవై రోజుల పాటు సభకు తెలియజేయకుండా వరుసగా గైర్ హాజరు అయితే కచ్చితంగా ఎమ్మెల్యే సభ్యత్వం పోతుంది అని అంటున్నారు. దాంతో అలా ఒక అయిదారుగురు కొత్త ఎమ్మెల్యేలు తీవ్ర మధనం చెందుతున్నారు అని అంటున్నారు.
సభకు హాజరవుతారా :
వైసీపీ అధినాయకత్వం అయితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అంటోంది. కానీ కొత్త వారు అయితే తమ సభ్యత్వం కాపాడుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. అందువల్ల జగన్ ని ధిక్కరించి మరీ వారు అసెంబ్లీకి హాజరవుతారా అన్న చర్చ సాగుతోంది. గత బడ్జెట్ సెషన్ లో కూడా వీరే సభకు రాకుండా సభ్యత్వం పోకుండా మధ్యేమార్గంలో రిజిష్టర్ లో సంతకాలు పెట్టారు అని ప్రచారం సాగింది. అలా సభకు రాకుండా సంతకాలు పెడితే కుదరదు అని స్పీకర్ ఒక రూలింగ్ ఇచ్చారని అంటున్నారు. దాంతో సభకు హాజరు కావడం వారి మటుకు అనివార్యం అవుతోంది అని అంటున్నారు.
అదే జరిగితే ఇబ్బందే :
వైసీపీకి ఉన్నదే 11 మంది. అందులో సగానికి సగం మంది సభకు హాజరు కావాలని నిర్ణయించుకుంటే మాత్రం వైసీపీకి అధినాయకత్వానికి ఇబ్బందిగానే చూడాలని అంటున్నారు. అధినేతనే ధిక్కరిస్తే పార్టీ పరంగా ఏమి జరిగినా సభకు హాజరైతే మాత్రం వారి సభ్యత్వాలు కాచుకునే వీలు ఉందని అంటున్నారు. మరి వైసీపీలో సగం మంది ఎమ్మెల్యేలు సభకు రావాలని అనుకుంటున్నారన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. మరి ఇందులో నిజమెంత ఉంది అన్నది తొందరలోనే తెలుస్తుంది అని అంటున్నారు.