అసెంబ్లీ ప‌రిణామాల‌ పై చ‌ర్చ‌.. బాబు కీల‌క నిర్ణ‌యం ..!

ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు కూటమిలో చర్చకు దారితీస్తున్నాయి. మరీ ముఖ్యంగా టిడిపి ఎమ్మెల్యేలు, జనసేన మంత్రులను టార్గెట్ చేయటం.. వరుసగా ఇరకాటంలో పెట్టే విధంగా మాట్లాడటం వంటివి ఇరుపక్షాల్లోనూ ఉత్కంఠను రేపుతున్నాయి.;

Update: 2025-09-21 22:30 GMT

ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు కూటమిలో చర్చకు దారితీస్తున్నాయి. మరీ ముఖ్యంగా టిడిపి ఎమ్మెల్యేలు, జనసేన మంత్రులను టార్గెట్ చేయటం.. వరుసగా ఇరకాటంలో పెట్టే విధంగా మాట్లాడటం వంటివి ఇరుపక్షాల్లోనూ ఉత్కంఠను రేపుతున్నాయి. బొండా ఉమా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన వివాదం ఎలా ఉన్నప్పటికీ నాదెండ్ల మనోహర్ పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన కామెంట్స్ మరింత ఎక్కువగా కూటమిలో చర్చకు దారితీసాయి. వాస్తవానికి బొండా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విషయానికి సంబంధించి అడిగిన ప్రశ్న పవన్ కళ్యాణ్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.

ఆయన ఉద్దేశం ఎలా ఉన్నప్పటికీ రాజకీయంగా ఎక్కడో రాజీపడుతున్నారన్న ధోరణిలో బొండా ఉమా మాట్లాడారు. ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన రాజ్య‌స‌భ సభ్యుడు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి సంస్థ‌ల‌పై చర్యలు తీసుకోవాలనేది ఆయన ఉద్దేశం గా ఉంది. ఈ క్రమంలో ఎక్కడో రాజీ పడుతున్నారని, ఎవరి ప్రలోభాలకో లొంగుతున్నారనే విధంగా ఆయన మాట్లాడారు. దీనిపై పవన్ కళ్యాణ్ సీరియస్ గానే స్పందించారు. దీనిపై సీఎం చంద్రబాబు కూడా దృష్టి పెట్టారు. ఇదిలా ఉంటే మంత్రి నాదెండ్ల మనోహర్ ను ఉద్దేశించి గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

పౌరసరఫరాల శాఖకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ.. బుచ్చయ్య చౌదరి మంత్రి నాదెండ్ల మనోహర్ ను లక్ష్యంగా చేసుకొని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నాయని. దీనిని అరికట్టడంలో శాఖ విఫ‌ల‌మైందా? మంత్రి విఫలమయ్యారా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. అయితే, దీనికి నాదెండ్ల మనోహర్ చూస్తామని, పరిశీలిస్తామని సమాధానం చెప్పారు. దీనిపై గోరంట్ల మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎప్పుడు అడిగినా ఇదే సమాధానాలు చెబుతున్నారని.. అసలు శాఖపై మీకు పట్టుందా? లేదా? అని నిల‌దీశారు.

నిజానికి టిడిపి మంత్రులను ఇప్పటివరకు ఎవరు ఇలా అడగలేదు. కానీ, జనసేనకు వచ్చేసరికి మాత్రం ఇలా ప్రశ్నించటం ఏంటి అన్నది ఇరు పార్టీల్లోనూ జరుగుతున్న చర్చ. ఒక పార్టీలో చర్చ జరిగితే అది వేరేగా ఉండేది. కానీ, జనసేన ను టార్గెట్ చేస్తున్నట్టుగా కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారన్నది ప్రధాన విమర్శలకు చర్చకు కూడా దారితీయ‌డంతో టీడీపీలోనూ ఈ విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇంత పరుషంగా ఇంత కఠినంగా వ్యాఖ్యానించాల్సిన అవసరం ఏంటి అనేది కూడా ఆసక్తిగా మారింది. ఉన్నది మొత్తం కూటమి సభ్యులే.

సభలో మరో ప్రతిపక్ష నాయకుడు కానీ ప్రతిపక్ష పార్టీకి చెందినవారు కానీ ఎవరూ లేరు. మూడు పార్టీల ఎమ్మెల్యేలు మూడు పార్టీలకు చెందిన మంత్రులే ఉన్నారు. అలాంటప్పుడు సమస్యను ప్రస్తావించే విషయంలోను, ప్రశ్నను అడిగే విషయంలోనూ కొంత సమయమనం కొంత ఓర్పు చాలా అవసరం. కానీ ఇది కోల్పోయి అచ్చం వైసిపి కన్నా ఎక్కువగా నాయకులు వ్యవహరించడం పట్ల కూటమి పార్టీలో అంతర్గతంగా అసలు ఏం జరుగుతోంది అన్నది చర్చనీయాంశంగా మారింది.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ మోస్ట్ నాయకుడే ఇలా మంత్రిని టార్గెట్ చేయడం వెనుక రీజ‌న్‌ ఏంటి అన్నది కూడా ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల నాటికి ఆయన రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి తప్పుకుంటానని చెబుతున్నప్పటికీ మళ్లీ పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కానీ, అక్కడికి వెళ్లి పోటీ చేసి విజయం దక్కించుకోవాలని జనసేనకు చెందిన నాయకుడు, మంత్రి కందుల దుర్గేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. బహుశా ఈ కారణంతోనే మనసులో ఉన్న బాధను మరో రూపంలో బుచ్చయ్య చౌదరి వ్యక్తం చేశారన్న వాద‌నా వినిపిస్తోంది.

మరి బోండా ఉమా విషయానికి వస్తే ఏం జరిగిందన్నది కూడా చర్చనీయాంశం. తన నియోజకవర్గంలోకి వేరే నియోజకవర్గంలో స్థాపించిన పరిశ్రమ నుంచి వస్తున్న కాలుష్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చారు. కానీ, అసలు విషయం వేరేగా ఉందని పార్టీ అంతర్గతంగా జరుగుతున్న చర్చలు చెబుతున్నాయి. మొత్తంగా ఈ పరిణామాలు ఇరు పార్టీల్లో కూడా చర్చకు దారితీసాయి. దీనిపై సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో సోమవారం నుంచి ఎలాంటి మార్పు వస్తుందన్నది చూడాలి.

Tags:    

Similar News