రష్యన్‌ స్పై చరిత్రకు సజీవ ప్రతీక.. ఈ ‘అందమైన గూఢచారి’

ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రష్యన్‌ గూఢచారి అన్నా చాప్‌మాన్‌ మరోసారి వార్తల్లోకి ఎంట్రీ ఇచ్చారు.;

Update: 2025-10-24 03:45 GMT

ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రష్యన్‌ గూఢచారి అన్నా చాప్‌మాన్‌ మరోసారి వార్తల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అమెరికాలో అరెస్టై 15 ఏళ్ల తరువాత ఇప్పుడు ఆమెకు రష్యా ప్రభుత్వం నూతన బాధ్యతలు అప్పగించింది.

రష్యన్‌ ఇంటెలిజెన్స్‌ చరిత్ర, వారి గూఢచర్య విజయాలను ప్రపంచానికి పరిచయం చేయడానికి కొత్తగా ఏర్పాటు చేసిన "మ్యూజియం ఆఫ్ రష్యన్ ఇంటెలిజెన్స్"కు అన్నా చాప్‌మాన్‌ను చీఫ్‌గా నియమించడం పుతిన్‌ ప్రభుత్వ నిర్ణయం. ఒకప్పుడు లేడీ జేమ్స్ బాండ్‌గా ప్రసిద్ధి చెందిన ఈ మాజీ గూఢచారి ఇప్పుడు రష్యన్‌ స్పై చరిత్రకు సజీవ ప్రతీకగా నిలుస్తున్నారు.

* దౌత్య కుటుంబంలో పుట్టిన గూఢచారి

అన్నా చాప్‌మాన్‌ దౌత్య నేపథ్యం కలిగిన కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి సోవియట్ యూనియన్‌ కాలంలో విదేశీ వ్యవహారాల విభాగంలో ఉన్నతాధికారిగా సేవలందించారు. మాస్కోలోని ప్రముఖ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌ చదివిన ఆమె, తరువాత బ్రిటన్‌కు చెందిన సైకాలజీ విద్యార్థి అలెక్స్‌ చాప్‌మాన్‌ను వివాహం చేసుకున్నారు. లండన్‌లో స్థిరపడ్డా, నాలుగేళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు.

* గూఢచర్యంలోకి అడుగు

లండన్‌లో ఉన్న సమయంలో ఓ రష్యన్‌ గూఢచారి ఆమెతో పరిచయం అయ్యాడు. అన్నా నెట్‌వర్కింగ్‌ నైపుణ్యాలు, ఆకర్షణ, ధైర్యం చూసి ఆయన రష్యన్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో చేరమని సూచించాడు. పలు పరీక్షలు, ట్రైనింగ్‌లను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత ఆమెను రష్యా సీక్రెట్ ఆపరేటివ్‌గా నియమించారు.

ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో, చురుకైన ఆలోచనలతో ఆమెను “రష్యన్ బ్లాక్ విడో” అని పిలిచేవారు. ఉన్నత రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలతో పరిచయాలు పెంచుతూ రహస్య సమాచారాన్ని సేకరించడం ఆమె ప్రధాన బాధ్యతగా ఉండేది.

* అమెరికాలో అరెస్టు.. ప్రపంచాన్ని కుదిపిన సంఘటన

2009లో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారిగా అమెరికాలో అడుగుపెట్టిన అన్నా, అసలైన మిషన్ మాత్రం రహస్యమైంది. ఎఫ్‌బీఐ ఇప్పటికే రష్యన్ స్లీపర్ సెల్స్‌పై "ఆపరేషన్ ఘోస్ట్ స్టోరీస్"‌ను అమలు చేస్తుండగా, 2010లో అన్నా చాప్‌మాన్ సహా మరో 9 మందిని అరెస్టు చేశారు.

వారు రష్యా ప్రభుత్వానికి రహస్య సమాచారాన్ని పంచుకుంటున్నట్లు ఎఫ్‌బీఐ నిర్ధారించింది. ఈ ఘటన ప్రపంచ గూఢచార చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచింది.

రెండు వారాల వ్యవధిలోనే అమెరికా–రష్యా దేశాల మధ్య గూఢచారుల మార్పిడి ఒప్పందం కుదరడంతో, అన్నా స్వదేశానికి చేరుకున్నారు.

* రష్యాలో సెలబ్రిటీగా మారిన అన్నా

రష్యాకు తిరిగి వచ్చిన తర్వాత అన్నా చాప్‌మాన్ జాతీయ స్టార్‌గా మారిపోయారు. ఆమె టీవీ షో హోస్ట్‌గా, పబ్లిక్ స్పీకర్‌గా, తరువాత పుతిన్ పార్టీతో కలిసి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు రష్యన్ ఇంటెలిజెన్స్ మ్యూజియం చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడం ఆమె జీవితంలో మరో కీలక అధ్యాయంగా మారింది.

* వ్యక్తిగత జీవితం

అన్నా చాప్‌మాన్‌ ప్రస్తుతం రష్యాలో నివసిస్తున్నారు. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. పలు దేశాల్లో వివాదాస్పద వ్యక్తిగా ఉన్నప్పటికీ, రష్యాలో ఆమెను "దేశభక్తి ప్రతీక"గా చూడడం గమనార్హం.

ఒకప్పుడు అమెరికా గూఢచారి వ్యవస్థను సవాలు చేసిన అన్నా చాప్‌మాన్‌ ఇప్పుడు రష్యా గూఢచార చరిత్రను సంరక్షించే బాధ్యతను చేపట్టడం ఆసక్తికర పరిణామం. అందం, చతురత, ధైర్యం.. ఈ మూడు గుణాలతో ప్రపంచానికి గుర్తుండిపోయిన ఆమె కథ మరోసారి రష్యన్ ఇంటెలిజెన్స్ చరిత్రలో కొత్త పుట రాసింది.

Tags:    

Similar News