వరస విషాదాలు-మృత్యు విలాపాలు
ఏపీ అంటేనే కత్తి మీద సాము లాంటి వ్యవహారం. 2014లో విభజన తరువాత గత పుష్కర కాలంగా ఏపీలో ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ అన్నది ఉంది.;
ఏపీ అంటేనే కత్తి మీద సాము లాంటి వ్యవహారం. 2014లో విభజన తరువాత గత పుష్కర కాలంగా ఏపీలో ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ అన్నది ఉంది. అంతే కాదు, ఏపీలో సంపద సృష్టికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ సేవా రంగం పారిశ్రామిక రంగం ఇంకా కుదుటపడాల్సి ఉంది. అదే సమయంలో రాజధాని నిర్మాణంలో ఉంది. దాంతో ఏపీ అన్ని విధాలుగా ఆర్ధికంగా సవాళ్ళు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఏపీని ఇటీవల కాలంలో వరస ప్రమాదాలు వెన్నంటున్న విషాదాలు చికాకు పెడుతున్నాయి.
మృత్యు ఘోష :
ఏపీలో గత కొద్ది రోజులుగా ఎటు చూసినా విషాద మరణాలు మృత్యు ఘోషతోనే వాతావరణం కనిపిస్తోంది. రాజమండ్రీలో కల్తీ పాల వ్యవహారంలో ఆరుగురు మరణించారు, ఇంకా చాలా మంది ఆసుపత్రి పాలు అయ్యారు. అక్కడ కోలుకోవాల్సి ఉంది. శ్రీకాకుళం జిల్లాలో డయోరియా కేసులలో మరో అయిదురుగు మరణించారు. చాలా మంది ఆసుపత్రి పాలు అయ్యారు. అక్కడ కూడా కోలుకోవాల్సి ఊంది. ఇంతలో వేట్లపాలెం లో భారీ పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది.
రెండు పదులకు పైగా :
వేట్లపాలెంలో శనివారం జరిగిన భారీ పేలుడు ఘటనలో ఏకంగా రెండు పదులకుమించి మృత్యువాత పడ్డారు అని అంటున్నారు. ఇది ఏపీకి అతి పెద్ద విషాదంగా ఉంది. దాంతో ప్రభుత్వం అంతా కట్టకట్టుకుని అక్కడికి కదలాల్సి వచ్చింది. సమాచారం తెలియడంతోనే విజయనగరం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి అప్రమత్తం అయ్యారు. ఆయన కాకినాడ జిల్లా వేట్లపాలెం కి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బయలుదేరివెళ్ళారు ఆయన ప్రమాద ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించారు. అంతే కాదు బాణసంచా ప్రమాద ప్రాంతాని చూసిన మీదట ప్రమాదానికి గల కారణాలను కూడా ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఎటు చూసినా కన్నీరు :
ఇదిలా ఉంటే పదుల సంఖ్యలో మృత్యువాత పడడంతో ఎటు చూసిన బాధిత కుటుంబాలు కంట కన్నీరు అదే పనిగా పెడుతున్న దృశ్యాలు అందరినీ కలచి వేస్తున్నాయి. ఊహకందని ప్రమాదం జరిగింది. క్షణాలలో అంతా బుగ్గి అయింది. శవాలు సైతం ముక్కలుగా ఎగిరి పొలాలలో పడ్డాయి. దాంతో ఈ ప్రమాదం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి స్థాయి నివేదికను అధికారులను కోరారు. అంతే కాదు బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై ఆయన కలెక్టర్, ఎస్పీలను అడిగి తెలుసుకున్నారు. ఆ మీదట బాధితులను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్ళీన ముఖ్యమంత్రి ఆసుపత్రిలో మృతుల కుటుంబాలని పరామర్శించారు. అలాగే క్షతగాత్రులను సైతం పరామర్శించారు.
గతంలో సైతం :
ఇదిలా ఉంటే ఈ విధంగా బాణాసంచా ప్రమాదాలు గతంలో కూడా సంభవించాయి. ఇదే గోదావరి జిల్లా మండపేట వద్ద గత ఏడాది జరిగిన పేలుళ్ళలో చాలా మంది మరణించారు. ఇక అనకాపల్లి జిల్లా కోటవురట్లలో కూడా గతంలో జరిగిన పేలుళ్లలో చాలా మంది మృత్య్వాత పడ్డారు. సరైన ప్రమాణాలు పాటించకపోవడం అధికారుల ఉదాశీనత నిర్లక్ష్యం ఈ తరహా ప్రమాదాలకు కారణం అవుతున్నాయని విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనా ఒకే వారంలో ఏపీలో దాదాపుగా ముప్పయికి పైగా ప్రజలు వివిధ సంఘటనలో దుర్మరణం పాలు కావడం బాధాకరం అని అంతా అంటున్నారు. ప్రభుత్వానికి కూడా ఈ సంఘటనలు ప్రమాదాలు సవాళ్ళుగా మారుతున్నాయని అంటున్నారు.