రిజిస్ట్రేషన్లకు కొత్త విధానం.. ఇకపై 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్స్ పూర్తి
ఇప్పటివరకు క్రిష్ణా జిల్లా కంకిపాడు రిజిస్ట్రార్ ఆఫీసులో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని అమలు చేశారు.;
ఏపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్లకు కొత్త విధానం తీసుకొచ్చింది. ఆస్తుల కొనుగోలు, విక్రయాల సందర్భంగా గంటలకొద్ది వేచిచూడకుండా విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చింది. వినియోగదారులు నచ్చిన సమయానికి వచ్చి తమ పని పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే వినియోగదారులు తమకు కావాల్సిన సమయాన్ని ముందుగా బుక్ చేసుకోవాల్సివుంటుంది. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. అంతేకాకుండా ఆస్తుల రిజిస్ట్రేషన్ తోపాటు ఆ వెంటనే రెవెన్యూ రికార్డుల మ్యుటేషన్ కోసం ఇబ్బందులు ఎదుర్కోకుండా రిజిస్ట్రేషన్ శాఖను రెవెన్యూ శాఖతో అనుసంధానించే సాఫ్ట్ వేర్ ను అందుబాటులోకి తీసుకువచ్చామని వెల్లడించారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి పరిపాలనలో అనేక మార్పులు తీసుకువస్తోంది. ఇప్పటికే వాట్సాప్ ద్వారా ప్రజల చేతిలోనే పాలనను పెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు రిజిస్ట్రేషన్ల శాఖలో స్లాట్ విధానం అమలులోకి తెచ్చింది. దీని ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన సమయంలో వెళ్లి తమ పని పూర్తి చేసుకోవచ్చనని అంటున్నారు. గంటల కొద్ది నిరీక్షించాల్సిన అవసరం లేకపోవడంతోపాటు అక్రమ కార్యకలాపాల నియంత్రణకు ఈ విధానం ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ విధానం ద్వారా రూ.5 వేల రూపాయల అదనపు ఫీజుతో సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది.
ఇప్పటివరకు క్రిష్ణా జిల్లా కంకిపాడు రిజిస్ట్రార్ ఆఫీసులో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని అమలు చేశారు. మార్చి 10 నుంచి దాదాపు 25 రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం సత్ఫాలితాలు ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దీనివల్ల వినియోగదారులకు సమయం ఆదా అవుతుందని, ముఖ్యమైన పనులను పక్కన పెట్టాల్సిన అవసరం లేకుండా, వినియోగదారులకు వీలైన సమయంలో వచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు ఉంటుందని అంటున్నారు.
స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకునే ఈ విధానాన్ని డిజిటల్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటున్నారు. పబ్లిక్ డేటా ఎంట్రీ (పీడీఈ) ద్వారా రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్ సైట్ లో స్లాట్ బుక్ చేసుకోవచ్చని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలో ఉన్న అన్ని ప్రధాన సబ్ - రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. దశలవారీగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు విస్తరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.