800 నిబంధనలు ఇక 100 లోపే - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

ఏపీలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.;

Update: 2026-04-13 13:08 GMT

ఏపీలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, పరిశ్రమల ఏర్పాటులో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు సిద్ధమైంది. బ్రిటీష్ కాలం నాటి కాలం చెల్లిన చట్టాలను రద్దు చేస్తామని, అవసరమైతే దీని కోసం ప్రత్యేక ఆర్డినెన్స్‌లు కూడా తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని కేంద్ర బృందంతో సీఎం సమావేశమై, డి-రెగ్యులేషన్ ఫేజ్-2 అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

800 నిబంధనలకు కత్తెర

పరిశ్రమల ఏర్పాటులో జాప్యాన్ని తగ్గించేందుకు ప్రస్తుతం ఉన్న నిబంధనలను భారీగా తగ్గించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 800కు పైగా నిబంధనలను వంద లోపుకు తీసుకురావాలని, అలాగే అనుమతుల సంఖ్యను సింగిల్ డిజిట్‌కు పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అధికారులు అనవసరంగా తిప్పకుండా థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యాపారాలకు లైఫ్ టైం లైసెన్సింగ్ ఉండేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని సూచించారు. ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ పడకుండానే, వ్యాపారులకు సానుకూల వాతావరణం కల్పించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

మే 31 నాటికి ఫేజ్-2 పూర్తి

రాష్ట్రంలో డి-రెగ్యులేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని ఈ సమీక్షలో వెల్లడైంది. డి-రెగ్యులేషన్ ఫేజ్-1లో భాగంగా ఇప్పటికే 7 శాఖల్లో 23 ప్రాధాన్య అంశాలను పూర్తి చేయగా, ఫేజ్-2లో మరో 28 అంశాలను నిర్దేశించుకున్నారు. మొత్తం 47 సిఫార్సుల్లో ఇప్పటివరకు 18 అమలు కాగా, మే 31 నాటికి పూర్తి లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రక్రియ పూర్తయితే పరిశ్రమల ఏర్పాటుకు పట్టే సమయం కనీసం 40 శాతం వరకు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే అనుమతులకు సంబంధించిన మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్ చేసి పారదర్శకతను పెంచాలని సీఎం ఆదేశించారు.

ఒకే నోడల్ ఏజెన్సీ ద్వారా అనుమతులు

పరిశ్రమల కోసం ప్రస్తుతం ఉన్న 82 రకాల అనుమతులను దశలవారీగా 57కు తగ్గించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఒకే శాఖలో ఉన్న వివిధ రకాల పర్మిషన్లను విలీనం చేయడం ద్వారా ఫైళ్ల కదలికను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. బిల్డింగ్ ప్లాన్ ఆమోదాలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు వంటి ప్రక్రియలను మరింత సులభతరం చేయాలన్నారు. భూ వినియోగానికి సంబంధించిన క్లిష్టతను తగ్గించేందుకు ఇప్పటికే నాలా చట్టాన్ని రద్దు చేశామని, భవిష్యత్తులో డిమాండ్ ఆధారిత జోనింగ్ విధానాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఒకే నోడల్ ఏజెన్సీ ద్వారా అన్ని రకాల అనుమతులు లభించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అఫిడవిట్ ఆధారంగా వ్యాపారాలకు పచ్చజెండా

ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రంగంలో పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు అఫిడవిట్ ఆధారంగా వ్యాపారం ప్రారంభించే వినూత్న విధానాన్ని అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. దీనివల్ల అనుమతుల కోసం వేచి చూడకుండా వెంటనే పనులు మొదలుపెట్టే అవకాశం కలుగుతుందని భావిస్తున్నారు. నేషనల్ బిల్డింగ్ కోడ్ స్థానంలో రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా సరళమైన ఫైర్ సేఫ్టీ నిబంధనలను తీసుకురావాలని, విద్యుత్ కనెక్షన్లు కూడా త్వరితగతిన అందేలా చూడాలని ఆదేశించారు. మీ సేవా, సింగిల్ డెస్క్ పోర్టల్, వాట్సాప్ గవర్నెన్స్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా ప్రజలకు, వ్యాపారులకు సేవలను మరింత చేరువ చేయాలని వివరించారు.

కేంద్రం కంటే ఏపీ ముందడుగు

ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న సంస్కరణలను కేంద్ర బృందం ప్రత్యేకంగా అభినందించింది. డి-రెగ్యులేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాల కంటే ఏపీ ప్రభుత్వం మెరుగ్గా పనిచేస్తోందని స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ కొనియాడారు. జూన్ నెల నుండి ప్రారంభమయ్యే ఫేజ్-3లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో డేటా లేక్, రియల్ టైం డేటా, సీఎఫ్ఎంఎస్ వంటి అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నామని, రాబోయే రోజుల్లో టెక్నాలజీ ద్వారా మరింత వేగంగా పాలన అందిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Tags:    

Similar News