పొదుపులో కూటమి దూకుడు... ఇ-సైకిళ్లకు ప్రోత్సాహం

దేశంలో రానున్న రోజులు గడ్డువని అంటున్నారు. ఎందుకంటే గల్ఫ్ యుద్ధం కొనసాగినా లేక ఆగినా ఆ ప్రభావం చాలా కాలం ఉంటుందని చెబుతున్నారు.

Update: 2026-05-18 18:04 GMT

దేశంలో రానున్న రోజులు గడ్డువని అంటున్నారు. ఎందుకంటే గల్ఫ్ యుద్ధం కొనసాగినా లేక ఆగినా ఆ ప్రభావం చాలా కాలం ఉంటుందని చెబుతున్నారు. దాంతో పూర్తిగా ముడి చమురు దిగుమతి అధారిత దేశంగా ఉన్న భారత్ లాంటి పెద్ద దేశాలు సరైన చర్యలను ఇప్పటి నుంచి తీసుకోకపోతే మాత్రం భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని కూడా ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశమంతా ఇపుడు ఇంధన పొదుపు మంత్రం పాటిస్తోంది. ఈ విషయంలో ఎన్డీయేలో కీలకమైన భాగస్వామిగా ఉన్న ఏపీలోని ప్రభుత్వం దూకుడుగానే వ్యవహరిస్తోంది. వినూత్నమైన ఆలోచనలను చేస్తోంది. అందులో భాగంగా ఇ-సైకిళ్ల వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కూడా నిర్ణయించింది.

పొదుపు ఉద్యమానికి భారీ ఊతం :

ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అడుగులు వేస్తున్నారు. ఇంధన పొదుపు అన్నది అతి ముఖ్యమైన అంశంగా ఉన్న క్రమంలో ఏపీలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం చేపట్టాలని, దానిని ఒక ఉద్యమంగా మార్చాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈవీ సైకిళ్లు, ఈవీ వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

వారందరికీ ఇ-సైకిళ్లు :

ఏపీలో భారీ సంఖ్యలో ఉన్న స్వర్ణ గ్రామ,స్వర్ణ వార్డు కార్యాలయాలకు ఎలక్ట్రిక్ సైకిళ్లు అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఈవీ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. మొత్తం 16 వేల ఎలక్ట్రిక్ సైకిళ్లను ఆయా కార్యాలయాల సిబ్బందికి అందించాలని సీఎం నిర్దేశించారు. అంతే కాదు ఈవీ వాహనాలను సులభంగా కొనుగోలు చేసేలా రుణాలను అందించే ప్రయత్నం చేయాలని కూడా సూచించారు. దీని కోసం ఓ ప్రత్యేక ఎస్పీవీని ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఏపీ రోల్ మోడల్ గా :

దేశమంతా ఇపుడు పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడి సాగుతోంది. అతి తక్కువగానే ఈవీ వాహనాల వినియోగం సాగుతోంది. దాంతో ఇంధన పొదుపు ఉద్యమాన్ని ఈవీ వాహనాల వినియోగం వైపు మళ్ళించడం ద్వారా ఏపీని రోల్ మోడల్ గా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దానిని స్వర్ణ వార్డు గ్రామ సచివాలయాల నుంచే శ్రీకారం చుట్టాలని ఆలోచిస్తున్నరు. అంతే కాదు ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా రానున్న రోజులలో అంతా ఈవీ వాహనాల వైపు వచ్చేలా చూడాలని కూడా యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఈ క్రమంలో వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఈఎంఐ విధానంలో ఈవీ సైకిళ్లను ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాలని బాబు కోరారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ఛార్జింగ్ స్టేషన్ల లాంటి మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఛార్జింగ్ స్టేషన్లతో పాటు మౌలికసదుపాయాల కల్పించటంపైన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చంద్రబాబు ఆయా ఈవీ కంపెనీలకు హామీ ఇచ్చారు.

Tags:    

Similar News