అప్పులకు వడ్డీ 70 వేల కోట్లు...వామ్మో ఏపీ !
ఏపీ అప్పుల కుప్పగా మారుతోందా అన్న చర్చ సాగుతోంది. ఏపీకి ఈ రోజుకీ సంపద సృష్టి అన్నది లేదు దాహం వేస్తే బావి తవ్వుతున్నట్లుగా ఇప్పుడే కసరత్తు అయితే మొదలైంది.;
ఏపీ అప్పుల కుప్పగా మారుతోందా అన్న చర్చ సాగుతోంది. ఏపీకి ఈ రోజుకీ సంపద సృష్టి అన్నది లేదు దాహం వేస్తే బావి తవ్వుతున్నట్లుగా ఇప్పుడే కసరత్తు అయితే మొదలైంది. పరిశ్రమలు రావాలన్నా ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా రాజధాని నిర్మాణం జరిగి ఒక రూపూ షేపూ రావాలన్నా చాలా కాలమే పడుతుంది.
మరి అంతవరకూ ఏపీ పరిస్థితి ఏమిటి అన్నదే కదా చర్చ. ఇక ఏపీ విభజన తరువాత పూర్తిగా వ్యవసాయిక రాష్ట్రంగా ఉండిపోయింది అదే సమయంలో ఏపీ విభజన వల్ల ఆర్ధిక వనరులను చాలా వరకూ కోల్పోయింది. దానికి తోడు అవాంచనీయమైన రాజకీయం సాగుతోంది పోటా పోటీగా అధికారం కోసం సాగే రాజకీయ చెలగాటంలో ఉచితాల మీద అంతా ఫోకస్ పెడుతున్నారు
ఉచిత పధకాలు తాము ఎక్కువ ఇస్తామంటే తాము అని పోటీలు పడుతున్నారు. నిజానికి ఏపీ లాంటి రాష్ట్రానికి ఉచిత పధకాలు ఇచ్చేంత ఆర్ధిక బలం లేదు. ఈ రోజున దేశంలో ఉన్న మిగిలిన 27 రాష్ట్రాలలో ధనవంతమైన రాష్ట్రాలు చాలానే ఉన్నాయి. ఏ ఇబ్బంది లేకుండా ఏ విభజన గాయాలూ లేకుండా దశాబ్దాలుగా స్థిరంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఆయా రాష్ట్రాలు ఏవీ కూడా ఉచిత పధకాలు ఏపీ మాదిరిగా ఇవ్వడం లేదు. కనీసం ఆ ఆలోచన కూడా చేయడం లేదు.
ఉదాహరణ తీసుకుంటే ఏపీలో సామాజిక పెన్షన్ నెలకు నాలుగు వేల రూపాయలుగా ఇస్తున్నారు ఇది దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత అతి పెద్ద మొత్తం. ఒక చిన్న జీతం మాదిరిగా ఇది ఇస్తున్నారు. ఈ మధ్యనే బీహార్ లాంటి రాష్ట్రం నెలకు ఇచ్చే సామాజిక పెన్షన్ మూడింతలు పెంచాలని నిర్ణయించింది. అది ఎంత పెంచినా 1300 కంటే ఎక్కువ లేకపోవడం విశేషం.
మరి ఏపీలో ఏ ధీమా ఉందని పెంచుకుని పోతున్నారు అన్నదే చర్చగా ఉంది. ఇది చాలదు అన్నట్లుగా ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం పధకం అమలు చేస్తున్నారు. తాజాగా వచ్చిన వార్తల బట్టి చూస్తే కొన్ని ఇళ్ళలో ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారు అరవై డెబ్బై వేలు తీసుకున్నారు. మరికొన్ని చోట్ల లక్ష రూపాయలు దాటి కూడా తల్లికి వందనం పథకం కింద ఇచ్చారు. దీని కోసం ప్రభుత్వం బడ్జెట్ లో ఏకంగా పదివేల కోట్ల రూపాయలను కేటాయించింది.
ఈ రోజున ఏపీ ప్రభుత్వం విద్యకు కేటాయిస్తున్న మొత్తం అక్షరాలా తొంబై వేల కోట్ల రూపాయలు అని చెబుతున్నారు. మరి ప్రభుత్వ పాఠశాలలలో ఉచితంగానే విద్యను ఇస్తున్నారు, బ్యాగులు ఇస్తున్నారు. మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. అన్నీ చేస్తూ మళ్ళీ ఈ మొత్తం ఇవ్వడం ఎందుకు అన్న ప్రశ్న. పైగా ప్రైవేట్ పాఠశాలలలో చదివే పిల్లలకు కూడా ఇస్తున్నారు.
అలాగే ఉచిత బస్సు మహిళలకు అంటే అది వందల కోట్ల మేర ఖజానా భారమే అని అంటున్నారు. ప్రతీ ఇంట్లో 18 ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు 1500 ఇస్తామని చెప్పారు. అది కనుక ఇస్తే ఏపీ ఖజానా అసలు చాలదని అంటున్నారు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఎంత తగ్గించి చూసినా లక్షలలో నిరుద్యోగులు ఉన్నారు. మరి వారికి ఎలా ఇస్తారు అన్న ప్రశ్న వస్తోంది.
అసలు ఎందుకు ఈ ఉచిత పధకాలు అన్నది మేధావుల నుంచి వస్తున్న ప్రశ్న. ప్రజలు కట్టే పన్నుల నుంచే కదా వచ్చే సొమ్ముతో ఈ విధంగా తెచ్చి ఖర్చు చేస్తున్నారు అన్నది టాక్స్ పేయర్ల బాధ. అలా కాదు అంటే అప్పులతో తెచ్చి పెట్టడమే కదా అని అంటున్నారు.
అసలు ఏపీ వార్షిక బడ్జెట్ ఎంత అంటే మూడు లక్షల కోట్లు అని లెక్క ఉంది. అందులో కనుక రూపాయి రాక చూసుకుంటే కేంద్ర పన్నులలో వాటా. కేంద్రం ఇచ్చే గ్రాంటులు. అలాగే రాష్ట్రానికి వివిధ రూపాయిలు పన్నుల ద్వారా వచ్చే ఆదాయాలు ఉంటాయి. ఏటేటా ఆదాయాలు ఎంతో కొంత పెరిగినా పెడుతున్న ఖర్చులకు ఏ మాత్రం పొంతన లేదని అంటున్నారు.
దాంతో అప్పులకు వెళ్ళాల్సి వస్తోంది. 2014లో విభజన తరువాత తొలి విడత తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది 2019 నాటికి దిగి పోయేటప్పటికి మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది అని చెబుతారు. జగన్ సీఎం అయింది 2018లో. ఆయన దిగిపోయే నాటికి అంటే 2024 నాటికి ఆ అప్పులు పది లక్షల కోట్లకు చేరాయని లెక్క ఉందని అంటారు ఒక తొలి ఏడాది పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు లక్షా అరవై వేల కోట్ల రూపాయలు అని వైసీపీ నేతలు అంటున్నారు. అలా చూస్తే ఈ రోజుకు 11 లక్షల అరవై వేల కోట్ల అప్పు ఏపీ మీద ఉంది.
ఈ అప్పులకు ఏటా కట్టే వడ్డీలు ఎంతో తెలిస్తే గుండెలు బాదుకోవాల్సిందే. ఏటా డెబ్బై వేల కోట్ల రూపాయలు వడ్డీల కిందనే ప్రభుత్వం కట్టాల్సి ఉంది. ఈ వడ్డీలు అప్పులతో పాటే అంతకంతకూ పెరిగి ఏదో రోజున త్వరగానే లక్ష కోట్లకు చేరుకుంటాయని అంటున్నారు.
ఇపుడు వడ్డీలు కట్టే డెబ్బై కోట్ల రూపాయలు ఉంటే పోలవరం పూర్తి అవుతుంది. రాజధాని పూర్తి అవుతుంది. అభివృద్ధి ప్రాజెక్టులు ఎన్నో పూర్తి అవుతాయి. కానీ రాజకీయం అధికారమే పరమావధిగా చేసుకుని ఉచిత పధకాలను అమలు చేస్తూ దాని కోసం అప్పులు చేస్తూ ఏపీని ఎటు తీసుకుని పోతున్నారు అన్నదే ప్రశ్న.