ఏపీలో ఆగని 'అగ్ని' కీలలు: ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న వరుస ప్రమాదాలు!

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా బస్సులు అగ్నిప్రమాదాలకు గురవుతుండటం పెను సంచలనంగా మారుతోంది.;

Update: 2026-01-07 04:05 GMT

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా బస్సులు అగ్నిప్రమాదాలకు గురవుతుండటం పెను సంచలనంగా మారుతోంది. అసలేం జరుగుతోంది? ఎందుకీ బస్సులు ఇలా తగలబడుతున్నాయి? అనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. తాజాగా బుధవారం వేకువజామున తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఫ్లైఓవర్‌పై జరిగిన ఘోర అగ్నిప్రమాదం మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అసలేం జరిగింది?

ఖమ్మం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బుధవారం తెల్లవారుజామున కొవ్వూరు ఫ్లైఓవర్‌పైకి చేరుకుంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. అదే సమయంలో అకస్మాత్తుగా బస్సులోని సెల్ఫ్ మోటార్‌లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సును నిలిపివేయడంతో పాటు ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దీంతో బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే బస్సు పూర్తిగా కంకాళంలా మారిపోయింది. సుమారు 80 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

వరుస ప్రమాదాలకు కారణాలేంటి?

రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీని వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.చాలా ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు బస్సుల ఎలక్ట్రికల్ వైరింగ్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇంజిన్ హీట్ కావడం, పాత వైరింగ్ వల్ల షార్ట్ సర్క్యూట్లు జరుగుతున్నాయి. బస్సుల్లో అదనపు ఏసీలు, మ్యూజిక్ సిస్టమ్‌లు, డెకరేటివ్ లైట్ల కోసం బ్యాటరీపై అదనపు భారం వేయడం వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రవాణా శాఖ అధికారులు ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు ఇచ్చే సమయంలో క్షుణ్ణంగా తనిఖీలు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రయాణికుల్లో ఆందోళన

ఏపీలోనే ఎందుకిలా జరుగుతున్నాయి? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. గత కొద్ది నెలలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతుండటంతో దూరప్రయాణం చేసే వారు ప్రైవేట్ బస్సులంటేనే జంకుతున్నారు. కేవలం అదృష్టం బాగుండి ప్రాణాలు దక్కుతున్నాయని.. ఒకవేళ అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉండగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపిస్తే పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అధికారుల వివరణ

ప్రమాద స్థలాన్ని పరిశీలించామని... షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించాం. అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని డీఎస్పీ దేవకుమార్ క్లారిటీ ఇచ్చారు.

కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా నిబంధనలు ఉల్లంఘించే ట్రావెల్స్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసి.. కేవలం లాభాలే పరమావధిగా నడిపే సంస్థల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని బాధితులు కోరుతున్నారు.



Tags:    

Similar News