ఏపీలో ముందస్తు దీపావళి.. విషయం ఏంటంటే!
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన విషయం తెలిసిం దే. దీంతో ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీలపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు భారంగా మారింది.;
దేశంలో దీపావళి పండుగ జరుపుకొనేందుకు ఇంకా.. 17 రోజుల సమయం ఉంది. అయితే.. ఏపీలో మాత్రం ముందుగానే దీపావళి వచ్చింది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, మ్యాక్సీ డ్రైవర్లు .. పలు జిల్లాల్లో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా భాగస్వామ్య మయ్యారు. ఎక్కడికక్కడ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ల చిత్ర పటాలకు.. పాలాభిషేకం చేసిన డ్రైవర్లు.. కూటమి సర్కారుకు అనుకూలంగా నినాదాలతో హోరెత్తించారు.
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన విషయం తెలిసిం దే. దీంతో ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీలపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు భారంగా మారింది. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ద్వారా వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. దీనిలో ప్రతి సొంత వాహన డ్రైవర్‌కు ఏటా రూ.15 వేల చొప్పున జమ చేయనున్నారు. ప్రతి దసరాకు ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా నిధులు విడుదల చేశారు.
ప్రధాన కార్యక్రమం విజయవాడలో జరగ్గా.. జిల్లాల స్థాయిలోనూ మరిన్ని కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డ్రైవర్లు.. తమ ఖాతాల్లోకి రూ.15 వేల చొప్పున పడగానే.. బాణాసంచా కాల్చుతూ.. సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు జై కొట్టారు. కాగా.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ జరిగిన కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆటోలు నడుపుతూ.. డ్రైవర్లను ఉత్సాహ పరిచారు.
లబ్ధి ఇలా..
మొత్తం ఆటో డ్రైవర్లు: 2,90,669
ఒక్కొక్కరికీ పడే సొమ్ము: రూ.15,000
మొత్తంగా ఖర్చు: రూ.436,00,35,000
విశాఖపట్నంలో ఎక్కువగా 22,955 మందికి అమలు
వీరికి ఇచ్చే సొమ్ము: రూ.34.43 కోట్లు.
జగన్ సొంత జిల్లా కడపలో లబ్ధిదారులు: 11,456
అందే సొమ్ము: 17.18 కోట్ల రూపాయలు
జగన్ హయాంలో వాహన మిత్రకు కడపలో ఎంపికైన వారు: 9,376
వీరికి ఇచ్చిన సొమ్ము: 9.3 కోట్ల రూపాయలు.