పట్టు పెంపులో పడుతూ లేస్తూ.. నేతల తిప్పలు..!
నియోజకవర్గాలు మారారు. విజయం దక్కించుకున్నారు. కానీ.. అదే నియోజకవర్గంలో పట్టు పెంచుకునే విషయంలో మాత్రం నాయకులు తడబడుతున్నారు.;
నియోజకవర్గాలు మారారు. విజయం దక్కించుకున్నారు. కానీ.. అదే నియోజకవర్గంలో పట్టు పెంచుకునే విషయంలో మాత్రం నాయకులు తడబడుతున్నారు. కూటమి పార్టీల నాయకుల పరిస్థితి ఇలానే ఉంది. కొందరు అయిస్టంగానే..గత ఎన్నికల్లో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేశారు. కానీ, విజయం సాధిం చారు. అయితే.. తర్వాత సదరు నియోజకవర్గంపై పట్టు బిగించలేకపోతున్నారు. వీరిలో మంత్రులు కూడా ఉండడం గమనార్హం.
నూజివీడు నియోజకవర్గంలో కొలుసు పార్థసారథి విజయం సాధించారు. కానీ, ఆయనకు ఇక్కడి పరిస్థితు లపై ఇంకా అవగాహనరాలేదు. పైగా.. సొంత ఇల్లు కూడా లేక పోవడంతో పెనమలూరు నుంచే ఆయన కార్యక్రమాలు సాగిస్తున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు పేరుతో మట్టిని తరలించేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. కానీ.. వారెవరో ఆయనకు తెలియదని చెప్పడం గమనార్హం. దీంతో వారు.. తమను తాము పరిచయం చేసుకున్నారు. ఇది అక్కడితో అయిపోయింది.
ఇక, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విజయం దక్కించుకున్న బీజేపీనాయకుడు.. కేంద్ర మాజీ మం త్రి సుజనా చౌదరి పరిస్థితికూడా అలానేఉంది. ఈయనకు కూడా.. ఇక్కడ పట్టులేదు. ఇటీవల కొందరు కార్పొరేటర్లు.. ఆయనను అతి కష్టం మీద రెండునిమిషాలు కలిసి.. తమ సమస్యలు చెప్పుకొనే ప్రయత్నం చేశారు. కానీ, మీరెవరు? ఏ పార్టీ అంటూ.. ప్రశ్నించేస రికి నిర్ఘాంత పోయారు. వారంతా టీడీపీ నాయకు లు.. పైగాఎన్నికల సమయంలో ప్రచారం కూడా చేశారు. అయితే. సుజనా వారిని మరిచిపోయారు. చివరకు విషయం తెలుసుకుని హామీలు ఇచ్చారు.
ఇక, బీజేపీ చీఫ్ పురందేశ్వరి మనసు సొంత నియోజకవర్గం పరుచూరుపై ఉంది. వారంలో రెండు రోజులు ఇంట్లోనే ఉంటున్నారు. రాజమండ్రి నుంచి విజయం దక్కించుకున్నా.. స్థానిక అంశాలపై ఆమెకు కూడా పట్టులేదు. అంతేకాదు.. ఎవరైనా సమస్య చెబితే.. విని.. ``ఇది.. ఎక్కడన్నారు?`` అంటూ.. అంతావినేసి ప్రశ్నిస్తే.. అవతలి వారు ఉలిక్కిపడుతున్నారు. ఇక స్థానికంగా కూడా కొందరు నాయకులను మాత్రమే ఆమె ఎంపిక చేసుకుని పిలుస్తున్నారు. దీంతో రాజమండ్రి ఎంపీగా ఆమెపై విమర్శలు వస్తున్నాయి.