పవర్ లేని పదవులు.. కూటమిలో మరో హెడేక్.. !
ఏపీలో చిత్రమైన పాలిటిక్స్ నడుస్తున్నాయి. టీడీపీకి చెందిన చాలా మంది నాయకులు.. గత ఎన్నికల్లో టికెట్లను త్యాగం చేశారు.;
ఏపీలో చిత్రమైన పాలిటిక్స్ నడుస్తున్నాయి. టీడీపీకి చెందిన చాలా మంది నాయకులు.. గత ఎన్నికల్లో టికెట్లను త్యాగం చేశారు. ఇలాంటి వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. ఇప్పటికీ .. చాలా మంది వేల సంఖ్యలో ఈ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే.. పదవులు దక్కించుకున్నవారు ఆనందంతో ఉన్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మారింది. ఎవరి బాధలు వారివి అన్నట్టుగా వారు వ్యవహరిస్తున్నారు.
దీనికి కారణం..పదువులు ఇచ్చారు తప్ప.. అధికారాలు ఇవ్వలేదు. పోనీ.. ఒకరిద్దరికి అధికారాలు కూడా ఇచ్చామని అనుకున్నా.. నిధులు కేటాయించలేదు. దీంతో ఆయా పదవులు చూసి మురిసిపోతారని అనుకున్న తమ్ముళ్లు.. దిగులు పెట్టుకుని పార్టీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరోవైపు వ్యతిరేక మీడియా దీనిని హైలెట్ చేస్తోంది.
గతంలో వైసీపీ అధినేత ఇలానే లెక్కకు మిక్కిలిగా పదవులు ఇచ్చి.. కార్యకర్తలను, నాయకులను సంతృ ప్తి పరిచే చర్యలు చేపట్టారు. కానీ, అప్పట్లోనూ ఇదే సమస్య వచ్చింది. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. నెలలు గడిచినా.. అప్పట్లోనూ కార్యాలయాలు ఏర్పాటు కాలేదు. నిధులు కూడా ఇవ్వలేదు. దీంతో ఆ ఎఫెక్ట్ ఎన్నికలపై పడింది. ఇదే విషయాన్ని ఇప్పుడు తమ్ముళ్లు కూడా సర్కారుకు చెబుతున్నారు. అయితే.. ఇప్పుడు కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేకుండా పోయింది.
దీంతో ప్రస్తుతం పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని.. సర్దుకు పోవాలని.. తమ్ముళ్లను కీలక నాయకులు బుజ్జగిస్తున్నారు. ``మీకు పదవులు ఇవ్వాలనిచంద్రబాబు భావించారు. ఇచ్చారు. సౌకర్యాల విషయంపై చర్చిస్తున్నారు. ఒకటి రెండు మాసాలు ఆగండి. అన్నీ సర్దుకుంటాయి. అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. అంతే.. గురూ`` అని కీలక నాయకుడు.. ఒకరు పదవులు పొందిన వారికి చెప్పుకొచ్చారు. అయితే.. మరికొన్ని రోజుల్లోనే ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని.. చంద్రబాబు కూడా వ్యాఖ్యానించినట్టు తెలిసింది.