ఏపీ పాలిటిక్స్‌లో ఫేడ్ లీడర్స్: ఫ్యూచర్ లేనట్టేనా ..!
గత ఎన్నికల తర్వాత.. పలువురు పార్టీలు మారారు. అయితే.. కొందరు మాత్రమే నామినేటెడ్ పదవులు దక్కించుకున్నారు.;
గత ఎన్నికల తర్వాత.. పలువురు పార్టీలు మారారు. అయితే.. కొందరు మాత్రమే నామినేటెడ్ పదవులు దక్కించుకున్నారు. చాలా మంది మౌనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు వారి ఫ్యూచర్ ఏంటి? భవిష్యత్తులో ఏమైనా పుంజుకుంటారా? అనేది ప్రశ్న. అయితే.. ఇప్పుడున్న పరిస్థితిలో ఆ అవకాశం వారికి దక్కడం లేదు. క్షేత్రస్థాయిలో వారు బయటకు రావడం లేదు. వచ్చినా.. గెలిచిన వారు వారిని పట్టించుకో వడం లేదు. దీంతో జంపింగుల ఫ్యూచర్ ప్రశ్నగా మారింది.
వాస్తవానికి జంప్ అయిన నాయకుల్లో చాలా మంది బలమైన నేతలు ఉన్నారు. మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, జయమంగళ వెంకటరమణ, బల్లి కల్యాణ్ చక్రవర్తి సహా అనేక మంది నేతలకు గతంలో ప్రజల్లో మంచి ఇమేజ్ ఉంది. అయితే.. పార్టీ మారిన తర్వాత.. వారి హవా పెద్దగా కనిపించడం లేదు. ఒకప్పుడు అధికారంతో సంబంధం లేకపోయినా.. ప్రజల మధ్యకు వచ్చిన వారు ఇటీవల కాలంలో ప్రజల మధ్యకు కూడా రాలేక పోతున్నారు.
కారణాలు ఏవైనా ప్రజలను కూడా కలుసుకోలేక పోతున్నారన్నది వాస్తవం. కానీ, వారు మాత్రం తాము ఎప్పుడు ప్రజల మధ్యకు వచ్చినా.. తమ హవా పెరుగుతుందని అంటున్నారు. ''ఇప్పుడు రాకపోయినా.. త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారు. ప్రజలంతా మా నాయకుడి వెంటే ఉన్నారు.'' అని బాలినేనికి చెందిన ప్రధాన అనుచరుడు ఒకరు.. ఇటీవల వ్యాఖ్యానించారు. ఇది నిజమే కావొచ్చు. కానీ, ఆ రేంజ్‌లో ప్రజల మనోభావాలు ఉన్నాయా? అనేది ప్రశ్న.
ప్రజల మధ్య నిత్యం ఉంటున్న నాయకులను పరిశీలిస్తే.. పాత తరం నేతలు ఎవరూ కనిపించడం లేదు. పైగా.. ఎవరికి వారు.. మౌనంగా ఉంటున్నారు. ఎక్కడా అలికిడి కూడా కనిపించడం లేదు. దీంతో ఫేడ్ అయిపోయారా? అనేది కూడా అనుమానంగానే ఉంది. కానీ.. ప్రజల నాడిని పట్టుకోవడం ఎవరి తరమూ కాదు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో .. ఎన్నికల సమయంలో ఎలాంటి ఆలోచన చేస్తారన్నది చూడాలి. ఇప్పటికైతే.. జంపింగుల విషయంలో ప్రజల మధ్యేకాదు.. పార్టీల్లోనూ పెద్దగా చర్చ లేదన్నది వాస్తవం.