రాబోయే రెండేళ్లలో `ఏఐ` సువర్ణావకాశాలు!
రాబోయే రెండేళ్లలో ఏపీలో సువర్ణావకాశాలు అందుబాటులోకి రానున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు.;
రాబోయే రెండేళ్లలో ఏపీలో సువర్ణావకాశాలు అందుబాటులోకి రానున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. మంత్రి నారా లోకేష్ సమక్షంలో `ఎన్ విడియా` సంస్థతో చేసుకున్న ఒప్పందం కీలక మైలురాయిగా మా రుతుందన్నారు. దీనివల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఉత్తమ ఇంజనీర్లను తీర్చిదిద్దే అవకాశం ఉంటుందన్నారు. ఏఐ శిక్షణ ద్వారా దేశానికి సైతం యువ ఉద్యోగులను అందించే అవకాశం రాష్ట్రానికి వస్తుందన్నారు.
త్వరలోనే 500లకు పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత.. స్టార్టప్‌లు రాష్ట్రంలో కొలుదీరనున్నట్టు చంద్రబాబు తెలిపారు. వీటి వల్ల ఏఐ విభాగంలో రాష్ట్రం అగ్రగామిగా మారుతుందన్నారు. ప్రస్తుతం ఏఐలో బెంగళూరు, చెన్నై అధునాత న ప్రయోగాలు చేస్తున్నాయి. ఇక, ముందు.. ఆయా నగరాలను తలదన్నే విధంగా ఏపీలో ఏఐ ప్రాజెక్టులు రానున్నాయి. వీటికి సంబంధించి మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎన్ విడియా సంస్థ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వచ్చే 20 ఏళ్ల తర్వాత.. దేశమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా.. ఏఐ పాలన సాగుతుందన్న అంచనా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏఐ తరహా సాంకేతికతకు ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి ఈ క్రమంలోనే ఏఐ యూనివర్సిటీని కూడా ఏపీలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా ఒప్పందం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని.. యువతకు.. ముఖ్యంగా ఇంజనీరింగ్ యువతకు మేలు చేకూరుస్తుందని పేర్కొన్నారు.