అనకాపల్లిలో భారీ సైబర్ డెన్... నెలకు 15 - 20 కోట్ల మోసాలు!

ఇటీవల కాలంలో సైబర్ నేరాల విషయంలో పోలీసులు ఎన్ని చర్యలు తీసుకొంటున్నా కొత్త కొత్త డెన్ లు పుట్టుకొస్తున్నాయి!;

Update: 2025-05-22 20:30 GMT

ఇటీవల కాలంలో సైబర్ నేరాల విషయంలో పోలీసులు ఎన్ని చర్యలు తీసుకొంటున్నా కొత్త కొత్త డెన్ లు పుట్టుకొస్తున్నాయి! ఈ క్రమంలో తాజాగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కేంద్రంగా నడుస్తున్న ఓ భారీ సైబర్ డెన్ గుట్టు రట్టయింది. ఈ సందర్భంగా కాల్ సెంటర్ ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అవును... అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం శివారులో ఫేక్ కాల్ సెంటర్ ముసుగులో ఓ భారీ ముఠా సైబర్ నేరాలకు పాల్పడుతోంది! ఈ సందర్భంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న 33 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు రెండేళ్ల నుంచి కాల్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో... ఇక్కడ నుంచి అమెరికా సహా ఇతర దేశాల ప్రజలే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. దీనికోసం సుమారు 44 ఫ్లాట్స్ అద్దెకు తీసుకొని ఈ వ్యవహారం నిర్వహిస్తున్నారని.. ఈ క్రమంలో నెలకు సుమారు రూ.15 నుంచి 20 కోట్ల వరకూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ వెల్లడించారు.

ఇదే సమయంలో... ముంబై, రాజస్థాన్ లకు చెందిన ఇద్దరు ప్రధాన వ్యక్తులు దీన్ని నడిపిస్తున్నారని.. మేఘాలయ, అస్సాం, మిజోరాం, సిక్కింగ్, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులు ఇందులో పని చేస్తున్నారని.. ఈ సమయంలో అమెరికా పౌరులతో ఎలా మాట్లాడాలో రెండు వారాలు ట్రైనింగ్ ఇస్తున్నారని వివరించారు.

అనంతరం.. అమెజాన్ ఇ-మార్కెట్ పేరుతో సైబర్ కాల్స్, సూపర్ మార్కెట్ గిఫ్ట్ కూపన్, వాల్నట్ పేరుతో నాలుగు దశల్లో ట్రాప్ చేస్తున్నారని.. ఈ కాల్ సెంటర్ లో 200 నుంచి 250 మంది వరకూ పనిచేస్తున్నారని చెప్పిన ఎస్పీ.. పట్టుబడిన నిందితుల నుంచి రూ.3 లక్షలు, మూడు వందలకు పైగా కంప్యూటర్లు, పలు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా... కాల్ సెంటర్ కు సంబంధించి దేశ వ్యాప్తంగా ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో పాటు సీఐడీ అధికారుల సాయంతో ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Tags:    

Similar News