వైసీపీ #BoycottHHVM ట్రెండ్ వేళ... అంబటి ఆసక్తికర కామెంట్!
పవన్ కల్యాణ్ రాజకీయాలపైనా, ఆయన సినిమాలపైనా వైసీపీ కీలక నేత, అంబటి రాంబాబు ఏ స్థాయిలో స్పందిస్తారనేది దాదాపు అందరికీ తెలిసిన విషయమే.;
పవన్ కల్యాణ్ రాజకీయాలపైనా, ఆయన సినిమాలపైనా వైసీపీ కీలక నేత, అంబటి రాంబాబు ఏ స్థాయిలో స్పందిస్తారనేది దాదాపు అందరికీ తెలిసిన విషయమే. ప్రధానంగా "బ్రో" సినిమా తర్వాత ఈ విషయంలో పవన్ - అంబటి మధ్య ఫైట్ ఓపెన్ అయిపోయిందనే కామెంట్లు వినిపించాయి! ఇక సోషల్ మీడియాలోని కామెంట్ సెక్షన్ గురించి చెప్పే పనేలేదు!
అటు రాజకీయమైనా, ఇటు సినిమాలైనా... పవన్ కల్యాణ్ పై ఎక్స్ వేదికగా సెటైర్లు వేయడంలో అంబటి ముందుంటారనే సంగతి తెలిసిందే. ఈ విషయంలో మైకుల ముందు పేర్ని నాని, ట్విట్టర్ లో అంబటి పోటీ పడుతుంటారని అంటారు. ఈ క్రమంలో.. శుక్రవారం విడుదల కాబోతున్న పవన్ "హరిహర వీరమల్లు" సినిమాపై అంబటి ‘ఎక్స్’ వేదికగా, పాజిటివ్ గా స్పందించారు.
అవును... గతంలో బ్రో సినిమా సమయంలో "గెలిచినోడి డ్యాన్స్ సంక్రాంతి.. ఓడినోడి డ్యాన్స్ కాళరాత్రి!" అంటూ కామెంట్స్ చేసిన అంబటి రాంబాబు.. తాజాగా వాయిస్ మార్చారు! ఈ సందర్భంగా... పవన్ కల్యాణ్ తాజా మూవీ హరిహర వీరమల్లు సినిమా సూపర్ డూపర్ హిట్టు కావాలని, కనవర్షం కురవాలని కోరుకుంటున్నట్లు అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా వెల్లడించారు.
"పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీర మల్లు' సూపర్ డూపర్ హిట్టై, కనక వర్షం కురవాలని కోరుకుంటున్నాను!" అంటూ అంబటి రాంబాబు తాజాగా ట్వీట్ చేశారు. మరి ఇది నిజంగానే కోరుకున్నారా.. లేక, ఇందులో ఏదైనా మతలబు ఉందా అనే విషయం రేపు ఫస్ట్ షో పడిన తర్వాత వచ్చిన రివ్యూస్ అనంతరం అంబటి ట్వీట్ ని చూసి కన్ఫామ్ చేసుకోవాలని అంటున్నారు నెటిజన్లు.
#BoycottHHVM:
ఇటీవల కాలంలో పలు సినిమాలపై వైసీపీ బాయ్ కాట్ బ్రాండ్ వేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇటీవల విశ్వక్ సేన్ "లైలా" సినిమాకు ఆ దెబ్బ గట్టిగా పడిందని అంటారు! ఈ క్రమంలో తాజాగా "హరిహర వీరమల్లు"కు బాయ్ కాట్ పిలుపునిచ్చింది వైసీపీ సోషల్ మీడియా. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు.
అవును... పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లుపై వైసీపీ సోషల్ మీడియా వేదికగా బాయ్ కాట్ ప్రచారం మొదలుపెట్టడం, అది కాస్తా ట్రెండింగ్ లోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా... "బాయ్ కాట్ చేయాలా..? దేనికంట..? అంటే బాయ్ కాట్ దేనికి చేయాలని..?" పవన్ ప్రశ్నించారు.
అనంతరం... ఈ బాయ్ కాట్ లు అనేవి నడవవని.. ఎందుకంటే సినిమాని గన్ పాయింట్ లో పెట్టి ఎవరూ చూపించరని.. ఇష్టపడి టికెట్ కొనుక్కొని వెళ్తారని తెలిపారు. తాను ఎంత పెట్టి టికెట్ కొనుక్కోవాలి అనేది తన ఛాయిస్ అని చెప్పిన పవన్.. తాను చిన్నప్పుడు ఏదైనా సినిమాలకి వెళ్లాలంటే.. టికెట్లు దొరక్కపోతే బ్లాక్ లో టికెట్ కొని ఇస్తే వెళ్లామని తెలిపారు.
నచ్చకపోతే చూడకపోవడం వేరు కానీ ఇలాంటివి నడవవని.. అయినా తాము పనులు చేసేటప్పుడు ప్రత్యర్థులు లేకుండా ఎందుకు ఉంటారని.. ఇలాంటి పనులు చేయకుండా ఎందుకు ఉంటారని ప్రశ్నించిన పవన్ కల్యాణ్... అలాంటివి వారు చేయకూడదని అనుకోవడం మన అవివేకం అని అన్నారు. వాళ్లు ఏం చేసుకుంటారో చేసుకోమనండి సంతోషం అని రియాక్ట్ అయ్యరు.