అడ్డంగా బుక్ అయిన అంబటి.. టీడీపీ ఏం చేస్తుందో?
మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అడ్డంగా బుక్ అయ్యారా? అధికార టీడీపీ కూటమి యాక్షన్ చూస్తుంటే ఆయనకు ఉచ్చు బిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.;
మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అడ్డంగా బుక్ అయ్యారా? అధికార టీడీపీ కూటమి యాక్షన్ చూస్తుంటే ఆయనకు ఉచ్చు బిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో అంబటి రాంబాబు తన అధికార ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన ఓ వీడియో తీవ్ర వివాదాస్పదం అవుతోంది. అధికార పార్టీ అంబటి పోస్టు చేసిన వీడియోను పట్టుకుని వైసీపీపై విమర్శల దాడి చేస్తోంది.
పులివెందుల ఎన్నికల ఫలితాల్లో వైసీపీ డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. అధికార టీడీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై కోర్టులో కూడా సవాల్ చేసింది. మాజీ సీఎం జగన్, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి వంటివారు పులివెందులలో అసలు ఎన్నికే జరగలేదని చెబుతూ, టీడీపీ విజయాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేశారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఎక్కడ పొరపాటు జరిగిందో కానీ, మాజీ మంత్రి అంబటి ఓ పాత వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసి అడ్డంగా బుక్ అయ్యారు అంటున్నారు.
ఈ జడ్పీటీసీ ఎన్నికల ఫలితం కోయ ప్రవీణ్ ఐపీఎస్ కు అంకితం అంటూ అంబటి తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశారు. అందులో ఓ యువకుడు బ్యాలెట్ పత్రాలను పట్టుకుని రిగ్గింగ్ చేస్తున్నట్లు ఉంది. అయితే ఆ వీడియో పులివెందులది కాదని టీడీపీ చెబుతోంది. అసలు ఆ వీడియో ఏపీ ఎన్నికలకు సంబంధించినది కాదని బలమైన వాదన వినిపిస్తోంది. ఏపీలో జడ్పీటీసీ ఎన్నికలకు పింక్ కలర్ లో ఉండే బ్యాలెట్ పత్రాలు వాడతారని, కానీ అంబటి పోస్టు చేసిన వీడియోలు బ్యాలెట్ పత్రాలు పసుపు రంగులో ఉన్నాయని టీడీపీ వాదిస్తోంది. అంతేకాకుండా అంబటి పోస్టు చేసిన వీడియో పశ్చిమబెంగాల్ స్థానిక సంస్థలకు చెందినదిగా టీడీపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ నిర్ధారించింది.
మాజీ మంత్రి అంబటికి ఎక్కడ లభించిందో, పొరపాటు ఎక్కడ జరిగిందో కానీ ముందు వెనుక చూడకుండా వీడియోను పోస్టు చేశారా? అనే చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ఏకంగా ఐపీఎస్ అధికారి, డీఐజీ కోయ ప్రవీణ్ ను విమర్శిస్తూ, ఆయనను ట్యాగ్ చేస్తూ వీడియోను పోస్టు చేయడాన్ని ప్రభుత్వం సీరియస్గా పరిగణిస్తోందని అంటున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాలని టీడీపీ సమాయుత్తమవుతోందని అంటున్నారు.