ఆ ఇద్దరు సీఎం మెటీరియల్ కాదు.. పవన్, చిరంజీవిపై మాజీ మంత్రి అంబటి విమర్శలు
ఈ క్రమంలో ఓ యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అంబటి డిప్యూటీ సీఎం పవన్, మెగాస్టార్ చిరంజీవిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.;
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జనసేన శ్రేణులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవిపై తాజాగా అంబటి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్న జనసైనికులు మాజీ మంత్రిపై విమర్శల దాడి చేస్తున్నాయి. అయితే డిప్యూటీ సీఎం పవన్ తోపాటు మెగాస్టార్ చిరంజీవిపై అంబటి రాంబాబు వ్యాఖ్యలు వెనుక రాజకీయ వ్యూహం ఉందని పరిశీలకులు అనుమానిస్తున్నారు. పవన్ ను రెచ్చగొట్టడం ద్వారా కూటమిని విచ్ఛిన్నం చేయాలన్న వైసీపీ స్కెచ్ ను అంబటి ద్వారా అమలు చేయాలని భావిస్తున్నారని, అయితే వైసీపీ ట్రాప్ లో చిక్కకుండా పవన్ తన కార్యకర్తల ద్వారా ఎదురుదాడి చేయిస్తున్నారని అంటున్నారు.
వైసీపీ తరఫున తరచూ మీడియాతో మాట్లాడే కొద్ది మంది నేతల్లో మాజీ మంత్రి అంబటి ప్రముఖుడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పై విమర్శలతో మాటల యుద్ధం చేస్తున్న అంబటి ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. దీంతో వైసీపీలో జగన్ తర్వాత అంబటి అన్నట్లు పరిస్థితి మారింది. దీంతో ఆయనతో ఇంటర్వ్యూలు చేసేందుకు కొన్ని యూట్యూబ్ చానళ్లు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అంబటి డిప్యూటీ సీఎం పవన్, మెగాస్టార్ చిరంజీవిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ ఇద్దరూ ముఖ్యమంత్రి మెటీరియల్ కాదంటూ అంబటి చేసిన వ్యాఖ్యలతో పెద్ద దుమారమే రేపారు.
పవన్, చిరంజీవి ముఖ్యమంత్రి మెటీరియల్ కానందున రాజకీయాలకు తగిన వారు కాదని అంబటి వ్యాఖ్యానించారు. తాను ఇలా మాట్లాడటం వల్ల జనసేన కార్యకర్తలు తనను టార్గెట్ చేయొచ్చని చెప్పిన అంబటి డిప్యూటీ సీఎం పవన్, మెగాస్టార్ చిరంజీవి మళ్లీమళ్లీ అవే వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ వేరొక రాజకీయ నాయకుడిని భుజాన వేసుకుని, వారికి సేవ చయడానికి మాత్రమే పుట్టారంటూ అంబటి అగ్గి రాజేశారు. దీనిపై తీవ్రస్థాయిలో స్పందించిన జనసేన.. మాజీ మంత్రి అంబటిని ట్రోల్ చేస్తోంది. అంబటికి, పవన్ కు మధ్య వ్యత్యాసాన్ని తెలియజేస్తూ జనసేన కార్యకర్తలు పోస్టింగులు పెడుతున్నారు.
‘‘అంబటి కేబినెట్ మంత్రిగా పనిచేసిన తర్వాత కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడని, అదే పవన్ ఒంటరిగా పార్టీని స్థాపించి కూటమిని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చారు’ అని కామెంట్లు చేస్తున్నారు. అదేసమయంలో వైసీపీకి లాటరీలా ఒకసారి అధికారం దక్కిందని, పవన్ మాత్రం కృషి, దృఢ సంకల్పంతో డిప్యూటీ సీఎం అయ్యారని మరో అభిమాని కామెంట్ చేశాడు. ఇలా అంబటి చేసిన వ్యాఖ్యలపై జనసేన గట్టిగా రియాక్ట్ అవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.