పవన్ కలసి ఉంటే రాజకీయ లాభం వైసీపీకేనా ?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో గేమ్ చేంజర్ అయ్యారు. ఆయన కూటమి కట్టడంలో ఎంతో ప్రయత్నం చేశారు.;
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో గేమ్ చేంజర్ అయ్యారు. ఆయన కూటమి కట్టడంలో ఎంతో ప్రయత్నం చేశారు. పట్టుదలగా శ్రమించారు. చివరికి తాను తగ్గి సీట్లను సైతం తగ్గించుకుని కూటమి ఏర్పాటు అయ్యేలా చూశారు. ఈ మధ్యలో ఆయన మీద వైసీపీ నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ఎన్ని రకాలైన సెటైర్లు వేసినా లైట్ తీసుకున్నారు. తాను అనుకున్నదే చేశారు. ఆ విధంగా పవనిజం పండి ఏపీ రాజకీయం రక్తి కట్టింది. ఆ దెబ్బకు వైసీపీ ఆల్ అవుట్ అయితే విపక్షం బెంచ్ సైతం దక్కక ఎక్కడో ఉండిపోయింది.
కట్ చేస్తే :
ఇక కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరకు దగ్గర అవుతోంది. నానాటికీ కూటమి బంధం బలపడుతోంది తప్ప తేలిపోవడం లేదు, ఎక్కడా తేడా రావడం లేదు. ఇప్పుడు కూడా చాలా వ్యూహాత్మకంగా పవన్ మీద ఒత్తిళ్ళు పెడుతున్నారు. అందులో ప్రధానంగా ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ నుంచి పవన్ మీద అపుడే మాటల దాడి మొదలైంది. మైండ్ గేమ్ కూడా స్టార్ట్ అయింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ళకు పైగా సమయం ఉండగానే పవన్ ని వైసీపీ టార్గెట్ చేయడం మొదలెట్టింది.
అంబటి ఆశీస్సులు :
కూటమితో పదిహేనేళ్ళు కలసి ఉంటాను అని పవన్ అనేక సందర్భాలలో చెప్పి ఉన్నారు. అది ఆయన ఏనాడూ దాచుకోలేదు, స్ట్రాటజీ అని కూడా అనడం లేదు, జనాలకు అర్ధమయ్యేలా చెబుతున్నారు. కూటమి ఉండాలని ఏపీ గెలవాలని ఆయన కోరుకుంటూ జనాల్లోకి అదే బలంగా ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పవన్ కూటమి నుంచి వేరు పడరు అన్నది అర్ధమైందా లేక కొత్త ఎత్తుగడలతో వైసీపీ పవన్ మీద గురి పెడుతోందా అన్నది తెలియదు కానీ పవన్ ని మళ్ళీ లక్ష్యంగా చేసుకుంటున్నారు. కూటమితో కలసి ఉంటాను అని పవన్ అంటున్నారు. పదిహేనేళ్ళు కాదు, జీవితాంతం కలసి ఉండాలని ఆశీస్సులు అందిస్తున్నాను అని మాజీ మంత్రి వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు అంటున్నారు.
లాభం అదేనట :
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని 2024 ఎన్నికల్లో పవన్ కూటమి కట్టారని అది ఫలించి కూటమి గెలిచింది అని అంబటి గుర్తు చేస్తున్నారు. అయితే 2029 నాటి ప్రభుత్వం మీద యాంటీ ఇంకెంబెన్సీ పెద్ద ఎత్తున ఉంటుందని అలాంటి నేపధ్యంలో పవన్ కూటమిలో ఉంటేనే మొత్తం వ్యతిరేక ఓట్లు అన్నీ గుత్తంగా వచ్చి తమ ఒడిలో పడతాయని అలా వైసీపీకి రాజకీయ లాభం చేకూరుతుందని అంబటి అంటున్నారు. అందువల్ల పవన్ ని కూటమిలోనే కొనసాగాలని కోరుకుంటున్నామని ఆయన గట్టిగానే చెబుతున్నారు.
రెచ్చగొడుతోందా :
అయితే పవన్ ని ఒక విధంగా వైసీపీ రెచ్చగొడుతోందా అన్న చర్చ వస్తోంది. ఏపీలో కాపుల మీద దాడులు జరుగుతున్నాయని మెగాస్టార్ ని బాలయ్య అవమానించారని అయినా పవన్ సైలెంట్ గానే ఉంటున్నారు అని అంబటి అనడం వెనక పవన్ కి బలమైన సామాజిక వర్గం మద్దతు లేకుండా చేయడం కోసమా అన్న చర్చ అయితే ఉంది. అంతే కాదు పవన్ ని ఈసారి గట్టిగా టార్గెట్ చేస్తే ఆయన ఎన్నికల వేళ అయినా కూటమి నుంచి విడిపోయి ఒంటరిగా పోటీ చేస్తారు అన్న లెక్కలు అయితే వైసీపీ వద్ద ఉన్నాయా అన్నది మరో చర్చ.
త్రిముఖ పోరు సాగితే :
అయితే ఏపీలో 2029లో త్రిముఖ పోరు సాగితే మాత్రం అది 2019 నాటి మాదిరిగా ఉండదని అంటున్నారు. ఎందుకంటే ఈసారి పవన్ అధికారంలో ఉంటూ వచ్చారు. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో పాటు రాజకీయంగా మరో పదేళ్ల అనుభవం ఉంటుంది. పవన్ కనుక ఒంటరిగా బరిలోకి దిగితే అది వైసీపీకి రాజకీయంగా లాభం కంటే నష్టం కలుగచేస్తుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. పైగా కూటమి వ్యతిరేక ఓట్లను బలంగా చీల్చే చాన్స్ ఉంది. అపుడు మరోసారి టీడీపీ అధికారంలోకి వచ్చినా రావచ్చు. మొత్తానికి వైసీపీకి నష్టం జరుగుతుందని అంటున్నారు. ఈ క్రమంలోనే కూటమిలో పవన్ కొనసాగాలని వైసీపీ కోరుకుంటోందా అన్నది కూడా ఉంది. అయితే కూటమిలో అపర చాణక్యుడు చంద్రబాబు ఉన్నారు. ఆయనకు ఇవన్నీ తెలియని ఎత్తులు కావు, అలాగే పవన్ సైతం రాటు తేలి ఉన్నారు. అందువల్ల 2029 రాజకీయ ఆట వైసీపీ కోరినట్లుగా ఉండే చాన్స్ ఎంత మేరకు అన్నది పెద్ద ప్రశ్నగానే చూడాల్సి ఉంది.